breaking news
cure
-
క్యూర్ జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో నిర్మించే ఎల్ఐజీ (ఇందిరమ్మ ఇళ్లు) ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని ఈ ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని, ప్రతిగా ఆయా శాఖలకు వేరే చోట స్థలాలు ఇవ్వాలని సూచించారు. జనావాసాలకు దూరంగా ఇళ్లను కేటాయిస్తే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.అలా కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తేగా.. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని, సంబంధిత శాఖలకు వేరేచోట స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు.సంబంధిత నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శులు ఎన్.శ్రీధర్, వి.శేషాద్రి, రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఇల్లు.. ఇకపై ఇలాగే కట్టుకోవాలి!
సాక్షి, సిటీబ్యూరో: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ నగరంలో నిర్మాణాలకు ‘క్యూర్’ కొత్త చట్టంలో కట్టుదిట్టమైన ప్రమాణాలను ప్రతిపాదించారు. గ్రీన్ బిల్డింగ్స్‌కు ప్రాధాన్యమిస్తూ తగిన ప్రోత్సాహకాలతో పాటు, పెద్ద భవనాల్లో వాతావరణ మార్పులను తట్టుకునే డిజైన్లు, వర్షపునీటి సంరక్షణ, నిర్మాణ సమయంలో దుమ్ము, శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు, అవసరాకనుగుణంగా ప్రభుత్వం సూచించే ఇతర పర్యావరణ చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది.భారీ భవనాలు లేదా ప్రత్యేక కేటగిరీల ప్రాజెక్టులకు ట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీతోపాటు పర్యావరణ ప్రభావం అధ్యయనం చేయాలి. స్టామ్వాటర్ మేనేజ్మెంట్ప్లాన్ ఉండాలి. అంతేకాదు, గాలి ప్రభావం, భూకంప భద్రత వంటి సాంకేతిక నివేదికలను సైతం కోరే అధికారం ఉంటుంది. నెట్– జీరో, గ్రీన్ బిల్డింగ్స్ లేదా తక్కువ కర్బన ఉద్గారాల భవనాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చట్టం అవకాశం కల్పించింది.లోకల్ ఏరియా ప్లాన్ నగరంలో ఆయా ప్రాంతాలకు తగ్గట్లుగా లోకల్ ఏరియా ప్లాన్‌ను రూపొందించే అధికారం సంబంధిత కార్పొరేషన్ కమిషనర్‌కు ఉంటుంది. నోటీసు జారీ చేసి ఒక ప్రాంతం లేదా వీధికి ప్రత్యేక లోకల్ ఏరియా ప్లాన్ రూపొందించవచ్చు. ఇందుకోసం నెలరోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి కార్పొరేషన్, అనంతరం ప్రభుత్వానికి సిఫారసులతో పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత గెజిట్‌లో ప్రచురించి అమలు చర్యలు చేపడతారు. తద్వారా ఒక ప్రాంతానికి తగిన నిర్మాణ శైలిని నిర్దేశించవచ్చు. ప్లాట్ కనీస పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. నిర్దిష్ట విస్తీర్ణంలో నిర్మించే భవనాలు లేదా నివాస యూనిట్ల సంఖ్యను పరిమితం చేయవచ్చు. దుకాణాలు, గోదాములు, పరిశ్రమలు వంటి వినియోగాలపై నియంత్రణలు విధించవచ్చు.వికలాంగులకు అనుకూల సౌకర్యాలు తప్పనిసరి దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం వారికి యాక్సెసిబిలిటీ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. భవన రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ మొత్తం అందుకు అనుగుణంగా ఉండాలి.నిర్మాణ నాణ్యతపై కఠిన ప్రమాణాలు నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక నిబంధనలను కూడా ప్రభుత్వం సంబంధిత ముసాయిదా బిల్లులో పొందుపరిచింది. ప్రతి భవనం స్థల పరిస్థితులు, లేఅవుట్, రహదారి అనుసంధానం, నిర్మాణ భద్రత, ఎత్తు, విస్తీర్ణం, వెంటిలేషన్, పారిశుద్ధ్యం, నిర్మాణ సామగ్రి వంటి అంశాల్లో ప్రభుత్వం లేదా బై–లాస్ నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతే కొన్ని ప్రత్యేక రకాల భవనాలకు అదనపు నిబంధనలు కూడా విధించే అధికారం కమిషనర్‌కు ఉంటుంది. మొత్తంగా.. కొత్త చట్టం ద్వారా గ్రేటర్ నగరంలో నియంత్రిత, పర్యావరణ హిత, భద్రతతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే మౌలిక వసతులతో కూడిన భవన నిర్మాణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లు సమాచారం. -
సీఎం నేతృత్వంలోనే క్యూర్
సాక్షి, హైదరాబాద్ : మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని అధిగమించేందుకు, ప్రణాళికాబద్ధమైన ప్రగతిని సాధించేందుకు త్వరలో అమల్లోకి రానున్న క్యూర్–2026 చట్టంలో ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నారు. కౌన్సిల్ నిర్ణయాల్ని అమలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఉంటుంది. ప్రభుత్వం ఇటీవల వెలువరించిన క్యూర్–2026 బిల్లులో ఈ అంశాల్ని పేర్కొంది. అపెక్స్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా స్వయానా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. క్యూర్‌లోని మహానగర ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యతలను నిర్ణయించడం, విధానపరమైన దిశానిర్దేశం చేయడం వంటి పనుల్ని అపెక్స్ కౌన్సిల్ చేస్తుంది. ఈ కౌన్సిల్లో ఎంఏయూడీ మంత్రి సభ్యులుగా ఉండగా, ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. విషయ ప్రాధాన్యతను బట్టి ఇతర మంత్రులను, నగర అభివృద్ధికి దోహదపడే నిపుణులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కౌన్సిల్లోకి తీసుకునే వెసులుబాటు కల్పించారు. నగర ప్రగతికి సంబంధించిన భారీ ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆమోదం, వివిధ శాఖల విధానాల అనుసంధానం, తదితరమైనవి ఈ కౌన్సిల్ పర్యవేక్షణలో ఉంటాయి. అమలు చర్యలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అపెక్స్ కౌన్సిల్ తీసుకునే కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేయడానికి, వివిధ విభాగాల మధ్య సమన్వయానికి క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రంగంలోకి దిగనుంది. ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి చైర్మన్‌గా, హెచ్ఎండీఏ కమిషనర్ కన్వినర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో నగరంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత జిల్లాల కలెక్టర్లతోపాటు కీలక సేవా విభాగాల అధిపతులందరికీ భాగస్వామ్యం కల్పించారు. విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ. జలమండలి, మెట్రో రైల్, ఆర్టీసీ ఎండీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. ముఖ్యంగా నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, ఆస్తుల సంరక్షణలో దూసుకుపోతున్న హైడ్రా కమిషనర్‌కు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కీలక స్థానం కల్పించడం గమనార్హం. మూడు నెలలకోసారి సమీక్ష ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారైనా విధిగా సమావేశం కావాలని స్పష్టమైన నిబంధన విధించారు. నగర పరిధిలో సాగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం, శాఖల మధ్య తలెత్తే అంతర్గత సమస్యలు, విధానపరమైన చిక్కులను గుర్తించి, వాటి పరిష్కారాలను అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడం ఈ కమిటీ ప్రధాన విధి. ఇంతకాలం ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నగరంలో రోడ్ల తవ్వకాలు, డ్రైనేజీ సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవని, ఇకపై ఈ సమన్వయ వ్యవస్థతో మహానగర అభివృద్ధికి ఆటంకాలుండవని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
క్యూర్లో గ్రీన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన పట్టణాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కోర్ అర్బర్ రీజియన్ (క్యూర్) ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్–2026ను తీసుకురానుంది. ఈ నూతన ముసాయిదా చట్టంలో హరిత భవన నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను తట్టుకునేలా నగరాలను తీర్చిదిద్దేందుకు ఈ బిల్లులో ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. ఈవీ చార్జింగ్ తప్పనిసరి.. హరిత ఇంధన వినియోగాన్ని పెంచడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో నిర్మించే భవనాలలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్ల ఏర్పాటును ఈ బిల్లు తప్పనిసరి చేయనుంది. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే వినియోగ నీటిని (గ్రే వాటర్) శుద్ధి చేసి, తిరిగి మొక్కలకు లేదా ఇతర అవసరాలకు ఉపయోగించే ప్లాంట్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి కానుంది. క్యూఆర్ కోడ్ వాల్ట్.. భవన నిర్మాణ అనుమతులలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రతి ప్రాపర్టీకి ఒక విశిష్టమైన ‘క్యూఆర్’ కోడ్‌ను కేటాయించనుంది. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను, నీటి కనెక్షన్ నంబరు, విద్యుత్ కనెక్షన్ వివరాలన్నీ ఒకేచోట డిజిటల్‌గా వీక్షించవచ్చు. ఇది భవన యజమానులకు బ్యాంక్ రుణాలు పొందడానికి సులభతరం చేయడంతో పాటు పన్ను చెల్లింపులను సులువవుతుంది. ప్రోత్సాహకాలు.. రాయితీలు.. హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టే నిర్మాణ సంస్థలు, యజమానులకు పన్ను ప్రోత్సాహకాలు, రాయితీలు అందించనున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ (ఎల్ఈఈడీ) గోల్డ్ రేటింగ్ పొందిన భవనాలకు 5 శాతం, ప్లాటినం రేటింగ్ పొందిన భవనాలకు 10 శాతం అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)ను బోనస్‌గా ఇవ్వనున్నారు. – నెట్‌జీరో భవనాలకు తొలి ఐదేళ్ల పాటు 10–20 శాతం ఆస్తి పన్ను రిబేట్ కూడా ఉండనుంది. గ్రీన్ రేటింగ్ ఉన్న ప్రాజెక్టులకు తనిఖీల భారం తగ్గించి గ్రీన్ ట్రాక్ ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తారు. రీసైకిల్ చేసిన నిర్మాణ వ్యర్థాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలు లేదా గరిష్ట ధర పరిమితిని విధించనుంది. రీసైకిల్ చేసిన మెటీరియల్ నాణ్యతపై నిర్మాణదారుల్లో నమ్మకం పెంచేందుకు ప్రభుత్వం అధికారికంగా క్వాలిటీ సరి్టఫికేషన్‌ను కూడా ఇవ్వనుంది. నిర్మాణ రంగంలో పారదర్శకత క్యూర్ ముసాయిదా చట్టంతో రాష్ట్రంలో పట్టణాభివృద్ధిని మరింత సరళతరం అవుతుంది. నిర్మాణ రంగంలో పారదర్శకత, సులభతర వాణిజ్యం, పర్యావరణహిత విధానాలను పెంపొందించడమే లక్ష్యంగా కీలక ప్రతిపాదనలు చేశారు. – కె.శ్రీధర్ రెడ్డి, ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ -
గుప్పెళ్లతో మందులొద్దు.. యోగాతో రోగాలకు చెక్!
ఆధునిక జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా పలువురిని చిన్న వయసులోనే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ప్రతిరోజూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, గుప్పెళ్ల కొద్దీ మందులు వాడాల్సిన అవసరం లేదంటున్నారు ప్రముఖ వైద్యు నిపుణులు. నిరంతరం వేధించే ఆస్తమా, కీళ్లనొప్పులు, తీవ్రమైన వెన్నునొప్పి నుంచి నేటి యువతను వేధిస్తున్న పీసీఓఎస్ వరకు ఎన్నో సమస్యలను కేవలం క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు.శ్వాసకోశ, గుండె జబ్బులకు యోగా సంజీవనిఆస్తమా బారిన పడిన వారికి అత్యవసర సమయాల్లో ఇన్హేలర్లు ప్రాణదాతగా నిలిచినప్పటికీ, ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవడానికి ప్రాణాయామం, అనులోమ-విలోమ ప్రక్రియలు అద్భుతంగా పనిచేస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అలాగే, నేటి కాలంలో గుండె జబ్బుల ముప్పు విపరీతంగా పెరుగుతోంది. భుజంగాసనం (కోబ్రా పోజ్) వేయడం ద్వారా ఛాతీ భాగం సాగి, గుండెతో పాటు లోపలి అవయవాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల గుండె కండరాలు బలోపేతం అవుతాయి. కపాలభాతి ప్రాణాయామం ద్వారా రక్తంలో ఆక్సిజన్ శోషణ శాతం పెరిగి, గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని పలు పరిశోధనలు సైతం నిరూపించాయి.హార్మోన్ల సమతుల్యత.. వెన్నునొప్పులకు చెక్థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సర్వాంగాసనం, హలాసనం, మత్స్యాసనం వంటివి ఎంతగానో తోడ్పడతాయి. భుజంగాసనం, ఉజ్జాయి ప్రాణాయామం ద్వారా జీవక్రియలు సమతుల్యమై, గొంతు భాగంలోని నాడులు ఉత్తేజితమవుతాయి. అలాగే, డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకతను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినా, త్రికోణాసనం వంటి ఆసనాలతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అద్భుతంగా నియంత్రించవచ్చు. ఐటీ ఉద్యోగులను వేధించే తీవ్రమైన నడుము నొప్పికి ఎలాంటి సర్జరీలు లేకుండా కేవలం తాడాసనం (ట్రీ పోజ్) ద్వారా ఉపశమనం పొందవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు.మానసిక ఒత్తిడి, కీళ్లనొప్పుల నుంచి విముక్తికీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) కలిగించే తీవ్రమైన బాధను సూర్యనమస్కారాల ద్వారా సులభంగా అదుపు చేయవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలు, ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉండటానికి పొత్తికడుపులో రక్తప్రసరణను పెంచే స్ట్రెచింగ్ ఆసనాలు ఎంతో మేలు చేస్తాయి. మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్లే మైగ్రేన్, తీవ్రమైన తలనొప్పి వస్తుంటాయి. వీటికి టాబ్లెట్లు వాడే బదులు శీర్షాసనం వేయడం ఉత్తమం. ఇక డిప్రెషన్, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఉత్తానాసనం రామబాణంలా పనిచేస్తుంది. అంతేకాక, నేటి యువతుల్లో వంధ్యత్వానికి దారితీసే పీసీఓఎస్ సమస్యను కూడా నిర్దేశిత యోగాసనాల ద్వారా మందులు, ఆపరేషన్లు లేకుండా నయం చేసుకోవచ్చని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: భూకంపాలకే సవాల్.. 4500 ఏళ్ల గీజా పిరమిడ్ల రహస్యం ఇదే! -
అన్నిటికీ ఒకటే క్యూర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగర ప్రజలు ఇకపై వివిధ ప్రభు త్వ విభాగాలకు చెందిన వివిధ సేవల చెల్లింపులను ఒకే యాప్ (క్యూర్–1) ద్వారా చేయొచ్చు. ఈ మేరకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ‘కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టం’ అమలుకు మార్గ దర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు తదితర ప్రభుత్వ బకాయిలన్నింటినీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.ప్రస్తుతం నగర ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన బిల్లులు, పన్నులు చెల్లించేందుకు వేర్వేరు పోర్టళ్లను వినియోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ప్రజలకు ఇబ్బందులు, శాఖలకు వసూళ్ల సమన్వయంలో సమస్యలు, ఆదాయ లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ యాప్ ద్వారా సమగ్ర చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. దీంతో చెల్లింపుల పారదర్శకత, జవాబుదారీతనం, వసూళ్ల సామర్థ్యం పెరగడంతో పాటు విభిన్న చెల్లింపు వ్యవస్థల అవసరం తొలగిపోనుంది. ఏ సేవలు అందుబాటులోకి?మొదటి దశలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు సంబంధించిన ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, సెల్ఫ్ అసెస్మెంట్, సూపర్ స్ట్రక్చర్ ఫీజులు, ఖాళీ భూముల పన్ను (వీఎల్టీ) చెల్లింపులను అనుసంధానించనున్నారు. అలాగే టీజీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లులు, జలమండలికి సంబంధించిన వాటర్, సివరేజి చార్జీలు, హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు కూడా ఈ వేదికలోకి రానున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం సూచించే ఇతర సేవలను కూడా ఇందులో చేర్చనున్నారు. యాప్ నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించనున్నారు. రోజువారీ సెటిల్మెంట్యాప్ ద్వారా జరిగే అన్ని చెల్లింపులు మీ సేవ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రాసెస్ అవుతాయి. వసూలైన మొత్తా లు తాత్కాలికంగా కేంద్ర ఖాతాలో నిల్వ చేసి, టీ+0 లేదా టీ+1 విధానంలో సంబంధిత శాఖలకు బదిలీ చేస్తారు. పేమెంట్ వైఫల్యాలు, రీకన్సిలియేషన్ సమస్యలు, ఇతర సేవా వివాదాల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ రెడ్రెస్సల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.పౌరులు క్యూర్ –1 యాప్,మై క్యూర్ యాప్, ఆయా శాఖల పోర్టళ్ల ద్వారా ఫిర్యాదులు నమో దు చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖలు 90 రోజుల్లోపు క్యూర్–1 యాప్‌తో చెల్లింపు వ్యవస్థలోకి మారా ల్సి ఉంటుంది. కాగా.. ఒకే డిజిటల్ ఎకో సిస్టమ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన క్యూర్ –1 యాప్ నగర పాలనలో డిజిటల్ సంస్కరణలకు కొత్త మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తు న్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలోని పౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని పేర్కొంటున్నారు. -
గృహమస్తు
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అఫర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాం కింద లక్ష గృహాల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధితో పాటు నగర ఆర్థిక ప్రాంతాన్ని (క్యూర్) యూనిట్‌గా తీసుకుని దిగువ ఆదాయ వర్గాలకు (ఎల్ఐజీ) 70 వేల ఫ్లాట్లు, మధ్య ఆదాయ వర్గాలకు (ఎంఐజీ) 30 వేల ఫ్లాట్లను నిర్మించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 12 వేల ఇళ్లు: భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడత కింద పైలట్ ప్రాజెక్టుగా సుమారు 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. హౌసింగ్ బోర్డు సొంత నిధులతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగస్వామ్యంతో కేపీహెచ్‌బీ, బాలానగర్, లింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను నిర్మించనున్నారు. జూన్ నెలాఖరు, లేదా జూలై మొదటి వారంలో డిమాండ్ సర్వే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. క్యూర్ పరిధిలో ఇప్పటి వరకు నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట, మల్కాజిగిరి, మేడ్చల్ తదితర 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో గృహాల నిర్మాణాలకు అనువైన భూములను గుర్తించారు. మరో తొమ్మిది నియోజకవర్గాల్లో స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పలు ప్రాంతాలను సందర్శించారు. గుర్తించిన భూముల్లో ఎక్కెడెక్కడ ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్లు నిర్మించవచ్చన్న దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. జీవనోపాధి ప్రాంతాలకు చేరువగా.. గత ప్రభుత్వాల హయాంలో నగరానికి 30 నుంచి 40 కి.మీ దూరంలో ఇళ్లు నిర్మించడంతో రవాణా, ఉపాధి, వైద్యం కరువై లబి్ధదారులు ఇబ్బంది పడ్డారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగర నడిబొడ్డున, ఐటీ, పారిశ్రామిక కారిడార్లకు సమీపంలోనే ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. ప్రతి ఫ్లాట్‌ను కనీసం 400 చ.అడుగుల ప్లింత్ ఏరియాతో అన్ని ఆధునిక మౌలిక వసతులతో నిర్మించనున్నారు. -
'క్యూర్' ఎన్నికలపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరం విస్తరించిన క్యూర్‌లోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు గత ఫిబ్రవరి 10న ముగిసిపోగా, 11 నుంచి స్పెషలాఫీసర్ పాలన కొనసాగుతుండటం తెలిసిందే. జీహెచ్ఎంసీ రూపాంతరం చెంది మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కావడంతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలపైనా పలువురు దృష్టి సారించారు. సాధారణంగా అయితే పాలకమండలి గడువు ముగిశాక ఆర్నెళ్ల లోపున కొత్త పాలకమండలి ఏర్పాటు కావాలి. అంటే ఆ లెక్కన ఆగస్టు రెండోవారంలోపున ఎన్నికలు జరగాలి. కానీ ప్రస్తుతమా పరిస్థితి కనిపించడం లేదు.ఓటరు జాబితాకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. ‘సర్’ ముగిశాక అక్టోబర్ ఒకటో తేదీన ఓటరు తుది జాబితా వెలువడనుంది. అంటే, అప్పటిలోగా ఎన్నికలకు అవకాశం లేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు అప్పటి నుంచి వడివడిగా చేపట్టినా, వార్డుల రిజర్వేషన్లు, మేయర్ రిజర్వేషన్లు తదితరమైనవి పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు డిసెంబర్ వరకు పట్టే అవకాశం ఉందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.మూడింటికా..పాలకమండలి గడువును పరిగణనలోకి తీసుకొని కేవలం జీహెచ్ఎంసీకి మాత్రమే తొలుత ఎన్నికలు నిర్వహించి, దాని ఫలితాన్ని బట్టి సీఎంసీ, ఎంఎంసీలకు నిర్వహించనున్నారనే వాదనలున్నప్పటికీ, జీహెచ్ఎంసీ స్వరూపం మారిపోయింది. మిగతా రెండు కార్పొరేషన్లలోనూ పాత జీహెచ్ఎంసీ ప్రాంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకే ఎన్నికలు ఒక్క కార్పొరేషన్‌కో.. రెండు లేక మూడు కార్పొరేషన్లకో జరగనున్నాయని చెబుతున్న వారూ ఉన్నారు. మూడు కార్పొరేషన్లకూ ఏకకాలంలో నిర్వహించే అవకాశాన్ని కాదనలేమని పలువురు భావిస్తున్నారు.ఇటీవలే సీఎంసీ, ఎంఎంసీల సొంత కార్యాలయ భవనాలతో పాటు ఒక్కో కార్పొరేషన్లో వందల కోట్ల పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఈ అంశాలు ఉపకరించనున్నాయి. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి నల్లగొండ ఫ్లై ఓవర్‌ను ఆలోగా ప్రారంభించడంతో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేసే యోచనలో ఉన్నారు. వీటితోపాటు మూడు కార్పొరేషన్ల పరిధుల్లోనూ వీలైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రంగుల ప్రపంచంలో గ్రామాలేవీ? స్పష్టతకు అవకాశం.. మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న కేబినెట్ సమావేశం జరగనుంది. తొలిసారిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని ‘ఈ–కేబినెట్’ సమావేశంగా చెబుతున్నారు. సమావేశంలో వివిధ అంశాలతోపాటు క్యూర్‌లోని కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి కూడా కీలక చర్చ జరగనున్నందున చర్చలో ఒక స్పష్టత రాగలదని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం జరిగే సెన్సస్తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు జరిగిన తీరులోనే హడావుడి లేకుండానే నిశ్శబ్దంగానే ఎన్నికల నగారా మోగవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే కసరత్తు కూడా జరుగుతోందని సమాచారం. -
AIDS Day: హెచ్ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో..
‘హెచ్ఐవీ’ నేటికీ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని బారిన పడినవారు నిరంతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. నేడు డిసెంబర్ ఒకటి.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఈ సందర్భంగా హెచ్ఐవీ నివారణకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఏం వెల్లడించాయి? ఎటువంటి పరిష్కారాలను సూచిస్తున్నాయనే వివరాల్లోకి వెళితే..ఆశాజనకమే.. కానీ..హెచ్ఐవీ అంటువ్యాధిని నివారించడంలో సైన్స్ అద్భుతమైన పురోగతిని సాధించింది. ఇప్పుడు యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)తో హెచ్ఐవీ బాధితులు సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఈ వైరస్‌ను శాశ్వతంగా తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు క్లినికల్ పరీక్షలలో ఆశాజనకమైన ప్రారంభ ఫలితాలను సాధిస్తున్నప్పటికీ, హెచ్ఐవీ నిజంగా నయం అవుతుందా? అనేది ఇంకా పూర్తిగా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది.స్టెమ్ సెల్స్ సాయంతో..ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగించగల హెచ్ఐవీ చికిత్స అందుబాటులో లేదని ROPAN హెల్త్‌కేర్ వ్యవస్థాపకురాలు, యూఎన్ సలహాదారు డాక్టర్ సబీన్ కపాసి తెలిపారు. అయితే బెర్లిన్, లండన్‌కు చెందిన పలువురు రోగులు స్టెమ్ సెల్ మార్పిడి తర్వాత దీర్ఘకాలిక ఉపశమనాన్ని (functional cure) పొందారు. ఈ వ్యక్తులు సీసీఆర్ఎస్ మ్యుటేషన్ కలిగిన దాతల నుండి స్టెమ్ సెల్స్‌ను స్వీకరించారు. ఇది వైరస్‌ను కణాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఈ కేసులు చికిత్స జీవశాస్త్రపరంగా సాధ్యమే అని నిరూపించినప్పటికీ, స్టెమ్ సెల్ మార్పిడిలో ప్రాణాంతక ప్రమాదాలు ఉన్నందున, ఇది కేవలం తీవ్రమైన క్యాన్సర్లకు చికిత్స చేయడానికి మాత్రమే పరిమితమై ఉంది. అందువల్ల దీనిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి ఆచరణీయమైన మార్గం కాదని వెల్లడయ్యింది.సవాల్ విసురుతున్న వైరల్ రిజర్వాయర్లు హెచ్ఐవీ చికిత్సకు సంబంధించి కొత్త పరిశోధనలు విస్తృత స్థాయిలో సురక్షితంగా ఉపయోగించగల విధానాలపై దృష్టి సారించాయి. పరిశోధకులు సీసీఆర్ఎస్ గ్రాహకాన్ని నిలిపివేయడానికి లేదా వైరస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి సీఆర్ఐఎస్పీఆర్ వంటి జన్యు-ఎడిటింగ్ సాధనాలను పరీక్షించడం సహా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అధ్యయనాల నుండి లభ్యమైన ప్రారంభ క్లినికల్ డేటా ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, హెచ్ఐవీకి చెందిన దాగి ఉన్న వైరల్ రిజర్వాయర్లు (latent reservoirs) ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయాయి. ఈ రిజర్వాయర్లు వైరస్‌ను కణజాలాలలో దాచి ఉంచుతాయి. చికిత్సను నిలిపివేసిన తర్వాత వైరస్ తిరిగి పెరగడానికి కారణమవుతాయి.ఇప్పటికింతే..ఈ అడ్డంకిని అధిగమించడానికి పరిశోధకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్ఐవీ నివారణ దశగా పురోగతి కనిపిస్తున్నప్పటికీ, ఔషధాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయనే హామీని ఎవరూ ఇవ్వడంలేదు. ప్రస్తుతానికి హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించడానికి అత్యంత శక్తివంతమైన విధానం యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ). దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే, అది వైరల్ లోడ్‌ను కనీస స్థాయికి తీసుకువస్తుంది. బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. సంక్రమణ ముప్పును నివారిస్తుంది. అసురక్షిత లైంగిక సంపర్కం హెచ్ఐవీకి ప్రధాని కారణమని, దీనికి సురక్షిత విధానాలే పరిష్కార మార్గమని వైద్యులు చెబుతుంటారు.ఈ ఏడాది థీమ్.. కార్యక్రమాలుప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం’ అనే థీమ్‌తో 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకునేందుకు పిలుపునిచ్చింది. సమాజంలో ఎయిడ్స్ బాధితులను చిన్నచూపు చూడటం లాంటి అంతరాలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధమైన పిలుపునిచ్చింది. 2030 నాటికి ఎయిడ్స్ అంతం చేసే లక్ష్యాన్ని చేరుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో అందరి సహకారం అవసరమని తెలిపింది. హెచ్ఐవిపై అవగాహన పెంచేందుకు, బాధితులపై వివక్షను రూపుమాపేందుకు, నేడు పలుచోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా, గోప్యంగా హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే బాధితులకు ఏఆర్టీ మందులు పంపిణీ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్నార్లు నిర్వహిస్తోంది. ఈ రోజున హెచ్ఐవి బాధితులకు మద్దతుగా పలుచోట్ల ప్రజలు రెడ్ రిబ్బన్లు ధరిస్తారు. ఈ వ్యాధితో మరణించిన వారి జ్ఞాపకార్థం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: మళ్లీ శశిథరూర్ లొల్లి.. ఈసారి అమ్మ కారణం? -
World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!
ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్నీ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ "యునైటెడ్ బై యునిక్". కేన్సర్ కారకాలు, సంరక్షణపై దృష్టి సారించి, సంరక్షణలో మార్పు తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషించాలనేది దీని లక్ష్యం. వ్యక్తిగతీకరించిన చికిత్సలు, మద్దతుపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. 2000లో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ఈ రోజును ప్రారంభించింది. కేన్సర్ వ్యాధి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంఘాలు, సంస్థలను సమీకరించే ఈ కార్యక్రమానికి మరింత ఆదరణ పెరిగింది. కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, అందరికీ సంరక్షణలో మెరుగుదల చూడాలనే సంకల్పంతో కేన్సర్ సమాజం ఐక్యంగా ఉంది అని UICC అధ్యక్షురాలు, స్వీడిష్ కేన్సర్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఉల్రికా అరెహెడ్ అన్నారు.దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, తరువాతి కేన్సర్దే. 2050 నాటికి కేసులలో 77 శాతం పెరుగుదల అంచనా. ఫలితంగా 1.32 కోట్ల మరణాలు సంభవించనున్నాయని ఆందోళన వ్యక్తమౌతోంది. 2022లో 90.6 లక్షల మంది మరణించారు. ప్రతీ ఏడాది 10 లక్షల మంది పిల్లలు తమ తల్లిని కోల్పోతున్నారు. 10.4 లక్షల మంది పిల్లలు తమ తండ్రిని కోల్పోతున్నారు. నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, కడుపు కేన్సర్, లివర్ కేన్సర్ ప్రధానంగా ఉన్నాయి.సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది, ట్యూమర్, కణితి, గడ్డలుగా మారే స్థితినే కేన్సర్ అని పిలుస్తారు. అయితే ఈ వ్యాధి ముందస్తుగా గుర్తించడం వల్ల చాలావరకు ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి మాత్రమే కాదు కాదు, బాధిత వ్యక్తి, ఆ కుటుంబానికి చెందిన మానసిక, భావోద్వేగాలకు సంబంధించి కూడా. అయితే వివిధ రకాల అపోహలతోపాటు అవగాహన లేక పోవడం, భయం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోంది. చాలా కేసుల్లో వ్యాధి ముదిరిన తరువాతే గుర్తిస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనట్టు ఏ వ్యాధికైనా చికిత్సకంటే ముందస్తుగా గుర్తించడం కీలకం. ఈ సూత్రం కేన్సర్ విషయంలో ఇంకా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.కేన్సర్‌ను గుర్తించేందుకు ముఖ్యమైన లక్షణాలుఉన్నట్టుండి అనూహ్యంగా బరువు తగ్గడం. ఎలాంటి కారణం అంటే, డైటింగ్, వ్యాయామం, లేకుండానే నెలకు ఐదు కేజీలకంటే ఎక్కువ బరువు తగ్గితే ప్రమాద సంకేతమని గుర్తించాలి. సుదీర్ఘం కాలం పాటు జ్వరం వేధించడం. కేన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం, బాడీ పెయిన్స్ లాంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గాయాలు త్వరగా మానకపోవడం. సాధారణంగా ఎలాంటి గాయమైనా మూడు నాలుగు వారల్లో నయం కావాలి. అలా కాని పక్షంలో అనుమానించాలి. గాయం తగ్గకపోగా, లక్షణాలు పెరుగుతుంటే వైద్యులను సంప్రదించాలి.నోట్లో ఎంతకీ మానని పుండ్లు. నోట్లో పుండ్లు ఏర్పడి చాలాకాలం తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించాలి. పొగాకు, గుట్కా, పాన్ నమలడం లాంటి అలవాట్లున్నవారు మరింత జాగ్రత్తపడాలి.అకారణంగా అలిసిపోవడం కేన్సర్‌లో మరో ప్రధాన కారణం. విపరీతమైన అసలట. నీరసం, ఓపిక లేకుండా అయిపోవడం. ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోవడం. నిస్సత్తువగా అనిపించడం. ప్రధానంగా లుకేమియా కేన్సర్ సోకిన వారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. విపరీతమైన రక్తహీనత. రక్తంలో హిమగ్లోబిన్ శాతం గణనీయంగా తగ్గిపోవడం.శరీరంపై కొత్తగా మచ్చలు పుట్టుకు రావడం, పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం. శరీర రంగు నల్లగా మారిపోవడం (హైపర్ పిగ్మెంటేషన్)ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురు పోవడంలాంటి సమస్యలున్నా జాగ్రత్తపడాలి. సుదీర్ఘకాలం పాటు,వాంతులు వేధించడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం, మలబద్ధకం లాంటి లక్షణాలు పెద్దపేగు కేన్సర్ వల్ల కావచ్చునేమో అనుమానించాలి.రొమ్ముల్లో, వృషణాల్లో, గొంతులో ఏదైనా గడ్డలు తగిలితే అనుమానించాలి. రొమ్మునుంచి రక్తం, చీము లాంటి స్రావాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే పురుషాంగం లేదా యోనిపై మానని పుండ్లు ఉండే సాధారణ ఇన్ఫెక్షన్ అవునా? కాదా నిర్ధారించుకోవాలి. మూత్రంలో మంట, నొప్పి, రక్తం పడటం, మూత్రం రంగు మారడం, పదే పదే మూత్రానికి వెళ్లాలని పించడం, లేదా అసలే నీరుడు బంద్ కావడం లాంటి లక్షణాలు బ్లాడర్ లేదా ప్రొస్టేట్ కేన్సర్లకు దారి తీయవచ్చు.మలంలో విపరీతంగా రక్తం, రంగు మారడం పెద్ద పేగు కేన్సర్‌కు సంకేతం కావొచ్చు.ఈ పైన చెప్పిన లక్షణాలు మూడు లేదా నాలుగు వారాలకు మించి కొనసాగుతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దానికి కారణాలను నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్స తీసుకోవాలి. సైలంట్ కిల్లర్కేన్సర్ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు దాకా గుర్తించడం కష్టం. మరో విధంగా చెప్పాలంటే.. దాదాపు నాలుగో స్టేజ్‌లో బయటపడతాయి. ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ , అండాశయ కేన్సర్ లాంటి నిశ్శబ్దంగా చుట్టుముడతాయి. ఈ మహమ్మారికి చిన్నాపెద్దా, ముసలీ ముతకా, స్త్రీ, పురుష అనే దయాదాక్షిణ్యాలేవీ ఉండవు. అందుకే అవగాహన, అప్రమత్తత అవసరం. -
డయాబెటిక్ రోగులకు భారీ ఊరట : ‘సెల్ థెరపీ’తో చైనా శాస్త్రవేత్తల ఘనత
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. అందుకే షుగర్ వచ్చిందంటే అనేక రోగాలకు మూలం అని చాలామంది భయపడిపోతారు. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్లలు ఈ భయాలకు చెక్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం!డయాబెటీస్‌కు 11 వారాల్లోనే సెల్ థెరపీతో పూర్తిగా చెక్ చెప్పవచ్చని చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న రోగికి వినూత్న సెల్ థెరపీ పద్ధతిలో పూర్తిగా నయం చేసి చైనా శాస్త్రవేత్తలు వైద్య ప్రపంచంలో రికార్డు సృష్టించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండ్ రెంజీ హాస్పిటల్ టీం అభివృద్ధి చేసిన చికిత్సను సెల్ డిస్కవరీ జర్నల్‌లో ప్రచురించారు.25 సంవత్సరాలుగా టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకునాడు. అయినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ప్యాంక్రియాటిక్ ఐలెట్ పనితీరు మెరుగు పడలేదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నాడు. ఇతను జూలై 2021లో సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. కేవలం 11 వారాల తర్వాత, ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. అలాగే ఏడాదిలోపే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నోటి ద్వారా తీసుకునే మందుల అవసరం కూడా పూర్తిగా తొలిగి పోయిందని తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్ పూర్తిగా నయమైందనీ, గడిచిన 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవట్లేదని ప్రకటించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్‌లోని ప్రముఖ పరిశోధకుడు యిన్ హావో నేతృత్వంలోని బృందం, ఓన్ పెరిఫిరయల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్‌తో ఉపయోగించిఈ ప్రయోగం చేసింది. ఇవే సీడ్ సెల్స్‌గా రూపాంతరం చెందాయి. అంతేకాదు కృత్రిమంగా ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణజాలాన్ని పునర్నిర్మించాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చైనాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దేశంలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు, వారిలో 40 మిలియన్ల మంది జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నారు.ఈ సెల్ థెరపీ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక ఔషధాల భారం నుండి విముక్తి లభిస్తుందని, ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపడుతుందనీ, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను కూడా తగ్గిస్తుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు. -
మద్యపాన వ్యసనానికి చెక్‌పెట్టే సరికొత్త చికిత్స విధానం!
మద్యపాన వ్యసనం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది. బంధాలను ముక్కలు చేసి ఎవర్నీ ఎవరికీ కాకుండా చేసి జీవితాలను కాలరాస్తోంది. అలాంటి మహమ్మారిలాంటి ఈ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు ఇప్పటివరకు అందుబాటుల్లో లేవు. డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి కదా! అని అంటారేమో. మందు బాబులు అక్కడ ఇచ్చే కౌన్సిలింగ్‌కి, జీవనశైలికి దాని అడిక్షన్ నుంచి బయటపడినట్లు అనిపిస్తారు అంతే. కళ్ల ముందు చుక్క కనిపించిందంటే మళ్లీ కథ మాములే. కొందరే ఆయా సెంటర్ల నుంచి మెరుగై మళ్లీ దాని జోలికి వెళ్లకుండా ఉండేందుకు యత్నిస్తారు. ఇది కూడా అంత ప్రభావంతమయ్యింది కాదు. దీని పరిష్కారం కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనాల్లో దీనికి ప్రభావంతమైన జన్యు చికిత్స విధానాన్ని కనుగొన్నారు. అదేంటంటే..ఈ ఆల్కాహాల్ యూజ్ డిజార్డర్(ఏయూడీ) ఓ పట్టాన వదిలించుకోలేని జబ్బు అని చెప్పొచ్చు. దీని కోసం శాస్త్రవేత్తలు చేసిని పరిశోధన కొంతవరకు పురోగతినే చూపించింది. ఈ మద్యపానానికి బానిసలుగా మారిన వాళ్ల బ్రెయిన్‌పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఎందుకు మందువైపు నుంచి వాళ్లను వాళ్లు మరల్చుకోలేకపోవడానికి కారణం ఏంటా? అనే దిశగా పరిశోధనలు చేయగా..మెదడులో ఉండే కమ్యేనికేషన్ వ్యవస్థకు సంబంధించిన మొసోలింబిక్ డోపమేన్ సిగ్నలింగ్ లోతుగా ఉన్నట్లు గురించారు. ఇది మద్యం సేవిస్తే కలిగి మంచి అనుభూతిని న్యూరోట్రాన్సిమీటర్కు ఎలా ప్రశారం చేస్తుందో నిర్థారించారు. ఈ వ్యవస్థ పనితీరులో ప్రధానమైనది గ్లియల్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్(జీడీఎన్‌ఎఫ్) అనే ప్రోటీన్. అల్కహాల్ తాగకుండా ఉండేందుకు యత్నిస్తున్న ఏయూడీ రోగుల మెదుడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ) జీడీఎన్ఎఫ్స్థాయిలు పడిపోతాయని పరిశోధనలో తేలింది. దీని కోసం జన్యు చికిత్స ఉపయోగించి వీటీఏలో జీడీఎన్‌ఎఫ్ స్థాయిలను భర్తీ చేస్తే డోపమేన్ సిగ్నలింగ్‌ను బలోపేతం అవుతుందా? అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఆ అధ్యయనంలో తక్కువ మోతాదులో మద్యపానం సేవిస్తే డోపమైన్ సిగ్నలింగ్ విడుదల బాగానే ఉంది. దీర్ఘకాలికంగా తాగితే మాత్రం మెదడును డీసెన్సిటైజ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కాలక్రమేణ తక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తుందని అన్నారు. ఈ వ్యసనంతో బాధపడుతున్నవారికి నిగ్రహంగా ఉందామనే సమయంలో వచ్చే అసౌకర్యం, చికాకుని తట్టుకోలే మళ్లీ తాగడం ప్రారంభిస్తుంటారని అన్నారు. ఇక్కడ తాగాలనిపించేలా మెదడు సిగ్నలింగ్ ఇచ్చే డోపమేన్ వ్యవస్థకే జన్యు చికిత్స చేస్తే సమస్యను అధిగమించవచ్చు అనేది శాస్త్రవేతల ఆలోచన. అందుకోసమని కొన్ని కోతులపై ఈ పరిశోధన చేశారు. దాదాపు 21 రోజుల పాటు కోతులకు మద్యపానం, నీరు వాటికి నచ్చినంత తాగేలా స్వేచ్ఛగా వదిలేశారు. కొద్దిరోజులకే అవి అధికంగా మధ్యపానానికి అడిక్ట్ అవ్వడం చూశారు. ఆ తర్వాత ఆ కోతులకు జీడీఎన్‌ఎఫ్ జన్యు చికిత్సను అందించారు. దీంతో అవి మద్యపానానికి బదులు నీటిని తాగడానికి ప్రయత్నించడం మొదలు పెట్టాయి. తెలియకుండానే మద్యపానాన్ని పక్కనపెట్టడం జరిగింది. వాటి రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ తక్కువుగా ఉండటాన్ని కూడా గుర్తించారు. ఆల్కహాల్ యూస్ డిజార్డర్‌తో బాధపడుతున్నవారికి ఈ చికిత్స గొప్ప పరిష్కార మార్గం అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి ఈ చికిత్స విధానం అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని అన్నారు. అయితే ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ జన్యు చికిత్స మానువులకు ఎంతవరకు సురక్షితం అనేదాని గురించి ట్రయల్స్ నిర్వహించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడకల్లో 'ఇడ్లీ లొల్లి'..దీని మూలం ఎక్కడిదంటే..) -
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్‌పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్‌లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్‌ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
కీళ్ల నొప్పుల నివారణ మన చేతుల్లోనే..
ఆర్థరైటిస్ అంటే కీళ్లనొప్పులు లేదా కీళ్ల వాతంగా చెప్పవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈ నెల 12వ తేదీ ‘ప్రపంచ ఆర్థరైటిస్ డే’. ‘‘దీన్ని ఎదుర్కోవడం మీ చేతుల్లోనే, అందుకే దీనిపై చర్యకు ఉపక్రమించండి’’ (ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, టేక్ యాక్షన్) అన్నది ఈ ఏడాది థీమ్. ఈ నేపథ్యంలో దీని నివారణకూ, మేనేజ్మెంట్కూ బాధితుల చేతుల్లో ఏ మేరకు అవకాశం ఉందనే అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరిగిపోతుంటాయనీ, దాంతో కీళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంటుందనీ, ఇది వయసు పెరగడం వల్ల వచ్చే సమస్య కాబట్టి సర్దుకుపోక తప్పదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది కొంతవరకే వాస్తవం. నిజానికి కీళ్లనొప్పులు / కీళ్లవాతం అనేక కారణాలతో వస్తుంటాయి. వీటిల్లో వందకు పైగా రకాలున్నాయి. అన్నింటినీ కలుపుకుని ఆర్థరైటిస్ లేదా కీళ్లవాతం అనే ఒక పదంతో సూచిస్తుంటారు. పైగా వయసు పెరిగిన వారిలోనే వస్తుంటాయన్నది కూడా పూర్తిగా నిజం కాదు. చాలామంది మధ్యవయస్కుల్లోనూ, కొంతమంది యువకుల్లోనూ కనిపిస్తుంటాయి. కారణాలు కొన్ని వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా, హార్మోన్ల అసమతౌల్యతలూ, విటమిన్ల లోపాలు, వాతావరణ కాలుష్యాలూ... ఇలా అనేక కారణాలతో వస్తుంటాయి. అరుగుదలతో వచ్చే వాటిని మినహాయిస్తే... సొంత కణాలపైనే తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతికూలంగా పనిచేసి, కణాలను దెబ్బతీయడం వల్ల వచ్చే కీళ్ల వాతాలూ ఉన్నాయి. ఇలా వచ్చేవాటిని ఆటో ఇమ్యూన్ సమస్యలుగా పేర్కొంటారు. శరీరంలోకి ప్రవేశించే శత్రుకణాలను దెబ్బతీయడానికి పుట్టే యాంటీబాడీస్... తమ సొంత కణాలే పరాయివిగా భావించి దెబ్బతీయడంతో కొందరిలో ఎముకలు, కీళ్లు, కండరాలతో పాటు... కొన్ని సందర్భాల్లో కీలకమైన అవయవాలు, వ్యవస్థలూ దెబ్బతినవచ్చు. ఆర్థరైటిస్‌లలో ప్రధాన ఆటోఇమ్యూన్ వ్యాధులు... ఆటోఇమ్యూన్ సమస్యలతో మహిళల్లో కనిపించే వ్యాధుల్లో లూపస్ (ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ స్కీ›్లరోసిస్, ఏపియన్ వంటివి ముఖ్యమైనవి. ఎస్‌ఎల్‌ఈ మహిళల్లో ఎక్కువగా కనిపించే ఓ ముఖ్యమైన వ్యాధి. ఇది కిడ్నీలు, కీళ్లు, చర్మం, మెదడు, కండరాల వంటి అనేక అవయవాలను దెబ్బతీస్తుంది. అది చూపే ప్రభావాన్ని బట్టి కొందరిలో తేలికపాటి నుంచి తీవ్రమైన సమస్యగానూ ఉండవచ్చు. కొందరిలో ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) కీళ్ల మీద ప్రభావం చూపే వ్యాధి. సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లు వంకర్లుపోయి, శాశ్వత వైకల్యానికీ దారితీయవచ్చు. ఇది కీళ్లను మాత్రమే కాకుండా లంగ్స్, రక్తనాళాలు, కళ్లు, నాడీవ్యవస్థతో సహా శరీరంలోని ఇతర అవయవాలను లక్ష్యంగా చేసుకుని, ఇతర వ్యవస్థలనూ ధ్వంసం చేసే అవకాశమూ ఉంది. ఈ సమస్యతో బాధపడేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు ఆస్కారం ఎక్కువ. అలాగే నాడీ వ్యవస్థ దెబ్బతినవచ్చు. ఈ కారణాలతో మరణాలకూ అవకాశం ఉంది. స్కిర్లోడెర్మా అనే కీళ్లవాతంలో చర్మం గట్టిపడటంతో పాటు జీర్ణవ్యవస్థ, గుండె, లంగ్స్, కిడ్నీల వంటి అవయవాలు ప్రభావితం కావచ్చు. యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనే కీళ్లవ్యాధిలో రక్తం తరచూ గడ్డకడుతుంది. మహిళల్లో గర్భస్రావాలూ జరుగుతుంటాయి. ఇవిగాక ఇతర వ్యాధులు చాలానే ఉంటాయి. లక్షణాలు: కీళ్లవాతాలకు దాని రకాన్ని బట్టి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలా బయటపడకపోవచ్చు. వ్యాధి రకాన్ని బట్టి, తీవ్రతను బట్టి, బాధితుల వయసు, వారి ఇతర వ్యాధులను బట్టి లక్షణాల తీరు మారుతూ ఉంటుంది. అయితే దాదాపు అన్ని రకాల కీళ్లవ్యాధుల్లో కనిపించే సాధారణ లక్షణాలను క్రోడీకరిస్తే... సాయంత్రానికి జ్వరం రావడం, నీరసం, నిస్సత్తువ, అలసట, క్రమంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు తొలిదశలో కనిపిస్తాయి. ఇవే లక్షణాలు ఇతర వ్యాధుల్లోనూ కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని. నిర్దిష్టంగా కీళ్ల విషయానికి వస్తే కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు, అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేనాటికి బాధితులు తమ సొంత పనుల్ని కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. ఇతర జాగ్రత్తలు... వీటిలో చాలావాటికి నివారణ ఉండదు. ఎందుకంటే ఇవి జన్యుపరమైనవీ, జన్యులోపాలతో వచ్చేవి. ఈ కారణంతో ఈ పరిమితి ఉంటుంది. ఈ జన్యులోపాలకు పర్యావరణ కారణాలూ, జీవనశైలీ తోడైనప్పుడు ఇవి బయటపడతాయి. అందుకే ఈ ఏడాది థీమ్‌ను బట్టి మన చేతుల్లో ఉండే అంశాలేమిటో తెలుసుకుని, ఆ మేరకు చర్యలు తీసుకోవడం చాలావరకు మేలు చేయడంతో పాటు... కొంతమేర నివారణకూ తోడ్పడేందుకు అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి... బరువును తగ్గించుకోవాలి. దీనివల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇదీ చికిత్సలో భాగమే. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు. ∙పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి. క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలి. విశ్రాంతి వల్ల కీళ్లవాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు చురుగ్గా ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి. దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. ఇదీ వాస్తవం కాదు. ఈ అపోహలకు దూరంగా ఉండటమూ బాధితుల చేతుల్లో ఉన్న పనే. ఈ ఏడాది థీమ్‌ను అనుసరిస్తూ... బాధితులు తగిన జాగ్రత్తల్ని పాటించడం, రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, జీవనశైలిని మెరుగుపరచుకుంటే కీళ్లవ్యాధుల బాధల నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స: ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స ఉంటుంది. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటే తగు మోతాదులో స్టెరాయిడ్స్‌తో పాటు ‘డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్’ని మొదలుపెట్టాలి. జబ్బు తీవ్రతను అదుపు చేయడం కష్టమైన సందర్భాల్లో కొందరిలో ‘బయలాజిక్స్’ అనే మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్ పనిచేయవు. వ్యాధి తీవ్రత, ప్రభావితమైన అవయవం, బాధితులు స్త్రీ లేదా పురుషుడా అన్న అంశంతో పాటు ఒకవేళ బాధితులు మహిళలైతే వారు గర్భవతా లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మందుల్నీ, వాటి మోతాదుల్ని రుమటాలజిస్టులు నిర్ణయించి, సూచిస్తుంటారు. డా‘‘ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
ఆయుర్వేద వైద్యంతో క్యాన్సర్ నయం చేస్తానంటూ రూ.15 లక్షలు టోకరా!
ఆదునిక టెక్నాలజీతో కూడిన వైద్యం వచ్చాక ఆయుర్వేదం వైద్యం వైపుకి జనం వెళ్లటం చాలా వరకు తగ్గిపోయారు. ఐతే ఇంకా అక్కడక్కడ కొంతమంది ఆయుర్వేద వైద్యాన్నే నమ్ముతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకునే కొందరు దుండగలు అమాయక ప్రజలను పెద్ద మొత్తంలో మోసం చేస్తున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..థానే రైల్వే సిబ్బంది ఒక ఆయుర్వేద సెంటర్‌పై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఆయుర్వేద వైద్యంతో తగ్గిస్తానంటూ ఇద్దరు వ్యక్తులు సుమారు రూ. 15 లక్షలు తీసుకున్నారని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు రైల్వే పెయింటర్. గత ఏడాది ఫిబ్రవరి నుంచి తన భార్యకు ఆ ఆయుర్వేద సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. అయితే తన భార్య పరిస్థితిలో మార్పురాలేదని వాపోయాడు. దీంతో ఆ ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులు ముఖం చాటేస్తూ..తప్పించుకుని తిరుగుతన్నారని పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు సదరు ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని, ఆరోపణలపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్!) -
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ
మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా. సర్వైకల్ క్యాన్సర్ అంటే...? గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ భాగం గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయవచ్చు. కారణాలేమిటి? సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనే సందర్భాల్లో హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. ఈ వైరస్‌లోనూ అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలం తర్వాత క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని. నివారణ ఎలా? సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ఉపయుక్తమైన పరీక్ష. 21 ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. హెచ్‌పీవీ వ్యాక్సిన్ అంటే..? శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ను తయారుచేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్లను తయారు చేయదు. అందువల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ (టీకా) ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి హెచ్‌పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అయితే తొమ్మిదేళ్లు నిండినవారి నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. -
అతడు కరోనాను జయించాడు
కరోనా...ప్రపంచాన్నే వణికించేస్తోంది. ఓ వైపు పెరుగుతున్న అనుమానితులు .. మరో వైపు నిర్ధారణవుతున్న పాజిటివ్ కేసులు...ఈ నేపథ్యంలో ఓయువకుడు పదిహేను రోజుల కిందట నేరుగా లండన్ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చి.. అనుమానంతో చికిత్స చేయించుకోగా పాజిటివ్‌గా తేలడంతో భయం లేకుండా పూర్తి స్థాయిలో చికిత్స చేయించుకున్నాడు. 13 రోజుల అనంతరం కరోనాను జయించి పలువురి అభినందనలు అందుకున్నాడు. సాక్షి, కాకినాడ: చైనాలో ప్రబలి.. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కోవిడ్–19 (కరోనా) వైరస్ బారిన పడి జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నమోదయిన రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు కరోనాను జయించాడు. పాజిటివ్ నుంచి నెగిటివ్‌గా మారడంతో జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమయింది. ప్రభుత్వాలు, వైద్యులు సూచనలు పాటిస్తే భయపెడుతున్న కరోనాను జయించవచ్చునని ఈ యువకుడే నిలువెత్తు సాక్ష్యమని వైద్యులు చెప్పారు. లండన్ నుంచి నేరుగా విమానంలో హైదరాబాదు, అక్కడ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఈ యువకుడు తన డాబాపై ఉన్న పెంట్‌హౌస్‌కి వెళ్లి స్వీయ నిర్బంధం చేసుకున్నాడు. మరుసటి రోజున దగ్గు, రొంప అధికమవడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విషయం చెప్పాడు. వెంటనే అక్కడ నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించి వైరాలజీ టెస్టులు చేయడంతో కరోనా వైరస్ నిర్ధారణయింది. వెంటనే జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ప్రత్యేక వైద్యబృందం ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య చికిత్సలు అందజేశారు. దీంతో 13 రోజుల అనంతరం పాజిటివ్‌గా ఉన్న వైరస్ నెగిటీవ్‌గా మారింది. రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన సంపూర్ణ ఆరోగ్యంగా ఆ యువకుడు ఉన్నాడని ప్రకటించడంతో కాకినాడ జీజీహెచ్ నుంచి శుక్రవారం డిశ్చార్జ్ చేసి అతని స్వగ్రామమైన రాజమహేంద్రవరానికి 108 అంబులెన్స్‌లో పంపించారు. కలెక్టర్, ఎస్పీలు అభినందనలు ఆసుపత్రి నుంచి డిశ్చార్స్ అయిన యువకుడిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఎంపీ వంగా గీత, నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, ఆర్ఎంవో గిరిధర్, వైద్యబృదం అభినందించింది. ఢిల్లీ నుంచి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా జిల్లాలో నుంచి ఢిల్లీకి వెళ్లిన వారు 36 మంది ఉన్నారని, వీరిలో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారన్నాని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. వీరిలో 34 మంది జిల్లాకు చేరుకున్నట్లు తెలిపారు. వీరికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ కేసులుగా గుర్తించి కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులైన 200 మంది నుంచి సాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు ప్రజలందరూ ఇళ్లవద్దనే ఉండండి : కలెక్టర్ సాక్షి, కాకినాడ: జిల్లాలో శుక్రవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్, అతని తమ్ముడికి కరోనా పాజిటివ్‌గా తేలిందని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. గత నెల 17న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో నిజాముద్దీన్ నుంచి రాజమహేంద్రవరం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో దిగిన 180 మంది మర్కజ్ యాత్రికుల్లో వీరూ ఉన్నారని, మిగిలిన వారు ఎక్కడున్నారో తెలియదని, ప్రజలంతా ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని కలెక్టర్ సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. శుక్రవారం నమోదైన ఈ రెండు కేసులతో జిల్లాలో మొత్తం 10 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి తొమ్మిదిగా ఉన్న కేసులలో, ఒకరు నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అవడంతో మిగిలిన ఎనిమిది కేసులకు తాజా రెండు కేసులతో మొత్తం 10 కేసులు నమోదైనట్టు అధికారులు ధృవీకరించారు. -
కేన్సర్‌ను జయించవచ్చు !
కాశీ యాత్రంటే కాటికి వెళ్ళడమేనని పూర్వపు మాట. ప్రస్తుతం రైళ్ళు, బస్సులే కాదు, విమానాల్లో సైతం కాశీ యాత్రను మూడురోజుల్లో ముగించే సౌకర్యాలు వచ్చాయి. అటువంటిదే వెనకటి కాలపు రాచపుండు, దాని చుట్టూ అల్లుకున్న భయసందేహాలు, ఆధునిక కాలంలో అనుసరిస్తున్న చికిత్సా విధానం. కేన్సర్ వ్యాధి అనగానే ప్రాణభీతితో వణికిపోయే రోజులు వచ్చే ఐదేళ్ళలో అంతరిస్తాయనీ, సుగర్, బీపీల మాదిరే అదికూడా దీర్ఘకాలిక చికిత్సకు లొంగే వ్యాధిగా అదుపులోకి రానున్నదనీ విఖ్యాత కేన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆదివారం హైదరాబాద్‌లో భరోసా ఇచ్చారు. దేశంలోని లక్షలమంది కేన్సర్ వ్యాధిగ్రస్తులకు, ఆ వ్యాధి తొలిదశ లక్షణాలు గల వారికి ఇది సాంత్వననిస్తుంది, జీవితేచ్ఛని పెంచుతుంది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ తెలుగు ప్రముఖుడు అమెరికాలో అగ్రశ్రేణి కేన్సర్ వైద్య నిపుణుడు. అమెరికాలో కంటే భారత్‌లోనే కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మాత్రలు చవగ్గా లభ్యమవుతున్నాయని, ప్రస్తుతం అవి ఊపిరితిత్తులు, లుకేమియా (బ్లడ్‌కేన్సర్)లకే పరిమితమైనా, మున్ముందు అన్ని రకాల కేన్సర్లకూ చికిత్స ఖర్చు తగ్గనుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు అంతర్జాతీయంగా చేస్తున్న పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చాయని, వాటి ఫలితాలు త్వరలోనే సామాన్య రోగులకూ అందుబాటులోకి వస్తాయని డాక్టర్ నోరి చెప్పారు. పేద, ధనిక, పల్లె, పట్టణం తేడా తెలియని మహమ్మారి - కేన్సర్. ఇది సోకిన వేలమందికి 1970, 1980 దశకాల వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి మద్రాసు శివారులోని అడయార్ ఆస్పత్రి లేదా చిత్తూరు సరిహద్దున గల వెల్లూరు ఆస్పత్రులే దిక్కు. స్వరా్రష్టంలోనైతే హైదరాబాద్ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రే శరణ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించి, అప్పటికి అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలకు రోగి స్పందిస్తే అదృష్టం. లేదంటే దైవాధీనం. ఆ తరవాత ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్‌పై అనేక సంస్థలు ఎడతెగని పరిశోధనలు సాగించాయి. ఫలితంగా, కొన్ని రకాల కేన్సర్ల బారి నుంచి వ్యాధిగ్రస్తులు పాక్షికంగానైనా విముక్తి పొందారు. ఇదంతా కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకోగలిగిన స్తోమత గల సంపన్నులకే. వ్యాధి ముదిరి, అమెరికా తీసుకెళ్లినా ఫలితం కనబడక ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014 నాటికి సైతం ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయి కేన్సర్ ఆస్పత్రిగా చెప్పదగిన వైద్యాలయం నిజాంల కాలం నాటి ఎంఎన్‌జే ఒక్కటే. ఆ తరవాత ఎన్టీఆర్ సంకల్పంతో హైదరాబాద్‌లో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ప్రారంభమైంది. పస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకూ ఉన్నంతలో ఆధునిక రేడియేషన్ యంత్రాలు, పరికరాలు, శస్త్ర చికిత్సా సదుపాయాలు, పేద, మధ్యతరగతి వారికి అందుబాటు చార్జీలలో పడకలు గల ప్రైవేటు రంగంలోని ప్రత్యేక కేన్సర్ ఆస్పత్రి ఇదే. వైఎస్ హయాంలో పేదల పెన్నిధిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం కింద రేడియేషన్, కీమో చికిత్సలకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ప్రభుత్వం బిల్లు చెల్లించి కొంతలో కొంత ఆదుకుంది. ఆరోగ్యశ్రీని ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పథకంగా మార్చారు. కేన్సర్ వ్యాధితో కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే చికిత్స సాపేక్షంగా మెరుగ్గానే ఉంటుంది గాని , అవి వేసే బిల్లులను చెల్లించగల శక్తి ఎందరికి ఉంటుంది? వాస్తవానికి, ఏటా రెండు రాష్ట్రాల్లో ఎంతమంది కేన్సర్ బారిన పడుతున్నారు? వారిలో ఎంతమంది ఎక్కడ చికిత్స పొందుతున్నారు? ఎందరు స్పందిస్తున్నారు? వంటి లెక్కలేవీ (డేటా) ప్రభుత్వం వద్ద లేవు. దేశంలో ప్రస్తుతం 35 లక్షల కేన్సర్ రోగులుంటే వారిలో లక్షా, లక్షన్నర మంది తెలుగు రాష్ట్రాల్లో ఉంటారని అంచనా. రోగుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను బట్టి కేన్సర్ చికిత్స జరుగుతోంది. ఇందులో సర్జరీ, కీమో థెరపీ, రేడియేషన్ చికిత్సలు ముఖ్యమైనవి. వ్యాధిగ్రస్తుల వయస్సు, వ్యాధి దశ, త ట్టుకునే తత్వం, వ్యాధి నిరోధక శక్తి వంటి అంశాలు కేన్సర్ చికిత్సలో కీలకం. వీటన్నింటి కంటే, కేన్సర్ నివారణ చర్యలు, జాగ్రత్తలు, తొలి దశలోనే కనుగొనడం వంటివి సత్ఫలితాలనిస్తాయని డాక్టర్ దత్తాత్రేయుడు చెప్పారు. అమెరికాలో గత 50 ఏళ్లలో ఏటా నమోదయ్యే మహిళల్లో రొమ్ము కేన్సర్ కేసులు గణనీయంగా తగ్గి, ప్రస్తుతం 16 వేలకు చేరుకున్నాయని, ఇంతకు ముందు ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఏ వ్యాధి చికిత్సకైనా ఒక మహిళ ఏ ఆస్పత్రికి వెళ్లినా తప్పనిసరిగా ఆమెకు రొమ్ము, గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని, మన దేశంలోనూ ఈ విధానం అనుసరించాలని ఆయన సూచించారు. 2020 నాటికి తెలుగు రాష్ట్రాల్లో కేన్సర్ బెడద లేని వ్యవస్థ తన లక్ష్యమని, ఈ మేరకు రెండు ప్రభుత్వాలకూ నిర్దిష్ట ప్రణాళికలు అందజేస్తానని డాక్టర్ నోరి చెప్పారు. సగటు ఆయుర్దాయం పెరిగినందున 60 లేదా 65 ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్లు స్త్రీ, పురుష తేడా లేకుండా కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటున్నాయి. పర్యావరణ, ఆహార, నీటి కాలుష్యాలు, జన్యుపరమైన వార సత్వాలు, పొగాకు, మద్యపానం వంటి దురలవాట్లు ఇందుకు దారి తీస్తుం టాయి.ఊపిరితిత్తులు, ఉదరం, పేగులు, మలద్వారం, పాంక్రియాస్, గర్భా శయం, మూత్రాశయం, కాలేయం వంటి ప్రధాన శరీర భాగాలు ఎలా పని చేస్తున్నాయో కనీసం ఏడాదికి ఒక సారైనా పరీక్ష చేయించగలిగే సౌకర్యాలు రెండు రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా కల్పించగలిగితే డాక్టర్ నోరి ఆశయ సాధన అసాధ్యమేమీ కాదు. ఆ దిశగా రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తాయని విశ్వసిద్దాం.


