సీఎం నేతృత్వంలోనే క్యూర్‌ | Establishment of CURE Apex Governance Council in the CURE 2026 Act | Sakshi
Sakshi News home page

సీఎం నేతృత్వంలోనే క్యూర్‌

Jul 10 2026 12:41 AM | Updated on Jul 10 2026 12:41 AM

Establishment of CURE Apex Governance Council in the CURE 2026 Act

‘అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌’ చైర్మన్‌గా.. 

కౌన్సిల్‌ పర్యవేక్షణలోనే భారీ ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆమోదం  

కౌన్సిల్‌ నిర్ణయాల అమలుకు అత్యున్నత అధికారాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 

ఈ కమిటీలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లు.. జలమండలి, మెట్రో ఎండీలు 

కొత్త చట్టంలో పొందుపరిచిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌ : మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని అధిగమించేందుకు, ప్రణాళికాబద్ధమైన ప్రగతిని సాధించేందుకు త్వరలో అమల్లోకి రానున్న క్యూర్‌–2026 చట్టంలో ‘క్యూర్‌ అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేయనున్నారు. కౌన్సిల్‌ నిర్ణయాల్ని అమలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కూడా ఉంటుంది. ప్రభుత్వం ఇటీవల వెలువరించిన క్యూర్‌–2026 బిల్లులో ఈ అంశాల్ని పేర్కొంది. అపెక్స్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా స్వయానా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. క్యూర్‌లోని మహానగర ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యతలను నిర్ణయించడం, విధానపరమైన దిశానిర్దేశం చేయడం వంటి పనుల్ని అపెక్స్‌ కౌన్సిల్‌ చేస్తుంది. 

ఈ కౌన్సిల్‌లో ఎంఏయూడీ మంత్రి సభ్యులుగా ఉండగా, ప్రిన్సిపల్‌ సెక్రటరీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. విషయ ప్రాధాన్యతను బట్టి ఇతర మంత్రులను, నగర అభివృద్ధికి దోహదపడే నిపుణులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కౌన్సిల్‌లోకి తీసుకునే వెసులుబాటు కల్పించారు. నగర ప్రగతికి సంబంధించిన భారీ ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆమోదం, వివిధ శాఖల విధానాల అనుసంధానం, తదితరమైనవి ఈ కౌన్సిల్‌ పర్యవేక్షణలో ఉంటాయి.  

అమలు చర్యలకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ  
అపెక్స్‌ కౌన్సిల్‌ తీసుకునే కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేయడానికి, వివిధ విభాగాల మధ్య సమన్వయానికి క్యూర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ రంగంలోకి దిగనుంది. ఎంఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దీనికి చైర్మన్‌గా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ కన్వినర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో నగరంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీస్‌ కమిషనర్లు, సంబంధిత జిల్లాల కలెక్టర్లతోపాటు కీలక సేవా విభాగాల అధిపతులందరికీ భాగస్వామ్యం కల్పించారు. విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ. జలమండలి, మెట్రో రైల్, ఆర్టీసీ ఎండీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. ముఖ్యంగా నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, ఆస్తుల సంరక్షణలో దూసుకుపోతున్న హైడ్రా కమిషనర్‌కు కూడా ఈ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో కీలక స్థానం కల్పించడం గమనార్హం. 

మూడు నెలలకోసారి సమీక్ష 
ఈ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారైనా విధిగా సమావేశం కావాలని స్పష్టమైన నిబంధన విధించారు. నగర పరిధిలో సాగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం, శాఖల మధ్య తలెత్తే అంతర్గత సమస్యలు, విధానపరమైన చిక్కులను గుర్తించి, వాటి పరిష్కారాలను అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లడం ఈ కమిటీ ప్రధాన విధి. ఇంతకాలం ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నగరంలో రోడ్ల తవ్వకాలు, డ్రైనేజీ సమస్యలు, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తేవని, ఇకపై ఈ సమన్వయ వ్యవస్థతో మహానగర అభివృద్ధికి ఆటంకాలుండవని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement