సాక్షి, జనగామ: పట్టణంలోని బాలాజీ నగర్‌లో ఉన్న కెనరా బ్యాంక్ శాఖలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ లాకర్ రూమ్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనతో బ్యాంకు ఆవరణ మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
మంటలు ప్రారంభమైన వెంటనే బ్యాంకు సిబ్బంది ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫోమ్‌తో పాటు నీటిని ఉపయోగించి వాటిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పొగను పూర్తిగా తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో కొన్ని మైనర్ డాక్యుమెంట్లు దగ్ధమైనట్లు సమాచారం.


