సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో పూర్తి సమయం కేటాయించడం వల్లే తాను సీఎం అయ్యానని.. కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. వర్శిటీ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
‘‘యువకులు ఈ దేశ సంపద.. ఒలంపిక్స్‌లో ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ అత్యంత వెనుకబడింది. ప్రభుత్వాలకు ఒక విధానం లేకపోవడమే ఇందుకు కారణం. పీటీ ఉష లాంటి క్రీడాకారులు దేశానికి పేరు తెచ్చారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను క్రీడల్లో రాణించిన దేశంగా గుర్తించడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ విధానంలో ప్రారంభించుకున్నాం. క్రీడల్లో రాణించడం వల్లే పీటీ ఉషకు గుర్తింపు వచ్చింది. క్రీడల్లో రాణించి ఆమె రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేరారు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘లక్ష్యాన్ని చేరాలంటే వంద శాతం కష్టపడాల్సిందే. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలతో పాటు నగదు పారితోషికం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకుంటాం. క్రీడల్లో రాణించినా మీ భవిష్యత్తు బాగుంటుంది. క్రీడల్లో రాణించి దేశానికి పేరు తెస్తే మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.


