Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Kaushik Maity: India Ambidextrous Spinner Set To Counter SA In Guwahati1
గంభీర్‌ మాస్టర్‌ ప్లాన్‌తో వాళ్లకు చెక్‌!.. ఎవరీ మిస్టరీ స్పిన్నర్‌?

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఊహించని ఫలితాన్ని పొందింది. ప్రొటిస్‌ బ్యాటర్ల కోసం బిగించిన స్పిన్‌ ఉచ్చులో.. మనవాళ్లే చిక్కుకుపోయి విలవిల్లాడారు. సఫారీ స్పిన్నర్లు సైమన్‌ హార్మర్‌, కేశవ్‌ మహరాజ్‌ (Keshav Maharaj) ధాటికి తాళలేక చేతులెత్తేశారు.కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 93 పరుగులకే కుప్పకూలి ఓటమిని ఆహ్వానించారు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ వెనుకబడింది. ఈ నేపథ్యంలో పిచ్‌ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో గువాహటిలో సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాతక్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ 1-1తో సిరీస్‌ను సమం చేయగలుగుతుంది. ఇలాంటి తరుణంలో బర్సపరా క్రికెట్‌ మైదానంలో ఎర్రమట్టి పిచ్‌ను తయారు చేయాలని బీసీసీఐ సంకల్పించింది.ఈ నేపథ్యంలో పేస్‌తో పాటు ఎక్కువగా బౌన్స్‌ అవుతూ.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను క్యూరేటర్‌ రూపొందించినట్లు సమాచారం. ఇలాంటి వికెట్‌పై పరుగులు రాబట్టే క్రమంలో టీమిండియా బ్యాటర్లు.. ఈడెన్‌ గార్డెన్స్‌లోనే ప్రాక్టీస్‌ చేశారు. ముఖ్యంగా మంగళవారం ఓ ప్రత్యేక బౌలర్‌ను భారత బ్యాటర్లు ఎదుర్కొన్నారు.అతడు మరెవరో కాదు.. బెంగాల్‌ మిస్టరీ స్పిన్నర్‌ కౌశిక్‌ మెయిటీ. రెండు చేతులతోనూ బౌలింగ్‌ చేయగల సవ్యసాచి. కుడి చేతితో ఆఫ్‌ స్పిన్‌.. ఎడమ చేతితో లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగల కౌశిక్‌ను పిలిపించాలన్నది హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఆలోచన అని సమాచారం. గతంలో పలు ఐపీఎల్‌ జట్లకు నెట్‌ బౌలర్‌గా కౌశిక్‌ మెయిటీ పనిచేశాడు.అయితే, టీమిండియాకు నెట్స్‌లో కౌశిక్‌ బౌలింగ్‌ చేయడం ఇదే తొలిసారి. 26 ఏళ్ల ఈ స్పిన్‌ బౌలర్‌.. నెట్స్‌లో లెఫ్టాండర్లు సాయి సుదర్శన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, దేవ్‌దత్‌ పడిక్కల్‌కు ఆఫ్‌ స్పిన్‌ వేశాడు. అదే విధంగా.. కుడిచేతి వాటం గల బ్యాటర్లు ధ్రువ్‌ జురెల్‌ వంటి వాళ్లను లెఫ్టార్మ్‌ స్పిన్‌తో తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో హార్మర్‌, మహరాజ్‌లను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లకు కావాల్సినంత ప్రాక్టీస్‌ దొరికింది.రెండు చేతులతోనూ బౌలింగ్‌ చేయగల విలక్షణ నైపుణ్యం కలిగిన కౌశిక్‌ మెయిటీ కారణంగా టీమిండియాకు అన్ని రకాలుగా సిద్ధమయ్యే అవకాశం దొరికింది. కాగా కోల్‌కతాకు చెందిన కౌశిక్‌ మెయిటీ దేశీ ‍క్రికెట్‌లో ఎనిమిది లిస్ట్‌-ఎ మ్యాచ్‌లతో పాట మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా పదకొండు వికెట్లు కూల్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియాకు నెట్స్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం రావడంపై కౌశిక్‌ మెయిటీ స్పందిస్తూ.. ‘‘మొదటిసారి భారత బ్యాటర్లకు నెట్స్‌ బౌలింగ్‌ చేశాను. కల నిజమైన అనుభూతి కలిగింది. నేను జడ్డూ భాయ్‌కు బౌలింగ్‌ చేశానంటే ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.తాను బౌలింగ్‌ చేస్తున్నపుడు గౌతం గంభీర్‌ కానీ.. బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ గానీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని.. తనను స్వేచ్ఛగా బౌలింగ్‌ చేయనిచ్చారని మెయిటీ తెలిపాడు. తన సహజ నైపుణ్యాలపై నమ్మకం ఉంచినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. జడేజా తనకు కొన్ని సూచనలు ఇచ్చాడని.. ఈ ట్రెయినింగ్‌ సెషన్‌ తనకు సరికొత్త అనుభవం, అనుభూతిని ఇచ్చిందని తెలిపాడు.

 Harbhajan Singh shakes hands with Pakistan cricketer in Abu Dhabi T10 league2
పాక్ ప్లేయ‌ర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన హర్భజన్.. వీడియో

ఆసియాకప్‌-2025లో భారత్‌-పాకిస్తాన్ జట్ల మధ్య నో హ్యాండ్‌ షేక్‌ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఈ టోర్నీలో పాక్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ టీమిండియా అంటిముట్టనట్టుగానే వ్యవహరించింది.ఆ తర్వాత మహిళల ప్రపంచకప్‌లో సైతం మన అమ్మాయిల జట్టు కూడా పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విముఖత చూపించారు. కానీ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇందుకు విరుద్దంగా ప్రవర్తించాడు. అబుదాబి టీ10 లీగ్‌లో హర్భజన్ సింగ్ ఆస్పిన్‌ స్టాలియన్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం అబుదాబి వేదికగా ఆస్పిన్‌ స్టాలియన్స్‌, నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం హర్భజన్.. నార్తర్న్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాకిస్తాన్ బౌలర్ షాహనవాజ్ దహానీతో కరచాలనం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.దీంతో నెటిజన్లు అతడిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఏడాది జూన్‌లో జరిగిన 'వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్'లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లను యువరాజ్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ బాయ్‌కాట్‌ చేసింది. ఇండియా లెజెండ్స్‌ జట్టులో భజ్జీ కూడా సభ్యునిగా ఉన్నాడు.చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌?Harbhajan Singh handshake with Shahnawaz Dahani. Ab kahan gai patriotism indians ki. #AbuDhabiT10 @iihtishamm pic.twitter.com/4ZFfgP2ld3— Ather (@Atherr_official) November 19, 2025

If not KKR then anywhere else: Venkatesh Iyer On IPL 2026 Auction Aspirations3
IPL 2026: ‘కేకేఆర్‌ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer) ఒకే జట్టుతో కొనసాగాడు. రూ. 20 లక్షల కనీస ధరతో ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను 2021లో కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) వరుస అవకాశాలు ఇచ్చి అతడిని ప్రోత్సహించింది.ఇందుకు తగ్గట్లుగానే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌.. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఫలితంగా జట్టులో చేరిన మరుసటి ఏడాదే అంటే.. 2022లో వేలానికి ముందు కేకేఆర్‌ అతడిని ఏకంగా రూ. 8 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. భారీ హైక్‌ ఇచ్చి వరుస మ్యాచ్‌లలో ఆడించింది.మెరుపు అర్ధ శతకంతో ఇక 2023, 2024 సీజన్లలోనూ వెంకీకి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించింది. గతేడాది శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో కేకేఆర్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్‌ అయ్యర్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన వెంకీ మెరుపు అర్ధ శతకంతో చెలరేగాడు.హైదరాబాద్‌ విధించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ (32 బంతుల్లో 39) ఓ మోస్తరుగా రాణించగా.. సునిల్‌ నరైన్‌ (6) విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి.. 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా చెన్నై వేదికగా రైజర్స్‌ను ఓడించిన కేకేఆర్‌ ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఏకంగా రూ. 23.75 కోట్లుఈ క్రమంలో ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు వెంకటేశ్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ రిలీజ్‌ చేసింది. ఆక్షన్‌లో భారీ పోటీ నెలకొన్నా.. రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ద్వారా ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసి అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. తద్వారా అతడి మొదటి జీతానికి దాదాపు 3900 శాతం హైక్‌ ఇచ్చింది.కేకేఆర్‌ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతాఅయితే, ఈసారి వెంకటేశ్‌ అయ్యర్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. పదకొండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 142 పరుగులే సాధించిన అతడు.. సీజన్‌ మొత్తంలో ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు. దీంతో తాజాగా మరోసారి కేకేఆర్‌ వెంకటేశ్‌ను వేలంలోకి వదిలింది. కానీ ఈసారి అతడిని మళ్లీ సొంతం చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో వెంకటేశ్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ.. ‘‘నాలాంటి ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడటమే గొప్ప అదృష్టం. ఏ జట్టుకు ఆడినా.. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.ఒకవేళ నా హృదయం చెప్పినట్లు వినాలంటే.. ఇప్పటికీ కేకేఆర్‌తోనే ఉండాలని కోరుకుంటున్నా. కేకేఆర్‌తో కలిసి చాంపియన్‌గా నిలిచాను. అక్కడే కొనసాగాలని అనుకుంటున్నాను. కేకేఆర్‌కు మరింత పేరు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాను.నాయకత్వ బృందంలో ఉండటం ఇష్టంఎందుకంటే ఐదేళ్ల పాటు వాళ్లు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. నన్ను ప్రోత్సహించారు. అయితే, ఈసారి వేలంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ కేకేఆర్‌ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడాల్సి వస్తుంది. ఏదేమైనా.. ఎక్కడికి వెళ్లినా నా సర్వస్వం ధారబోసి జట్టును గెలిపించేందుకు కృషి​ చేస్తానని అందరికీ తెలుసు.బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగానే కాదు.. నాయకత్వ బృందంలో ఉండటం నాకు ఇష్టం. కెప్టెన్‌కు అవసరమైన సలహాలు ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటాను’’ అని వెంకటేశ్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. కాగా 2025లో వెంకీని కెప్టెన్‌ చేస్తారని భావించగా.. అనూహ్య రీతిలో కేకేఆర్‌ వెటరన్‌ ప్లేయర్‌ అజింక్య రహానేను సారథిగా నియమించింది. అతడి కెప్టెన్సీలో ఘోర పరాభవం చవిచూసింది. పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. చదవండి: IND Vs PAK: మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్‌?

 debutants Weatherald, Doggett for AUS playing XI in Ashes opener4
యాషెస్ తొలి టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే! ఇద్దరు అరంగేట్రం

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సమరానికి సమయం అసన్నమైంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు పెర్త్ వేదికగా శుక్రవారం(నవంబర్ 21) నుంచి మొదలు కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.తొలి టెస్టుకు గాయాల కారణంగా హాజిల్ వుడ్‌, కమ్మిన్స్ వంటి కీలక ప్లేయర్లు దూరం కావడంతో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు ఆసీస్ తరపున అరంగేట్రం చేసే అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి అనుహ్యంగా యాషెస్ సిరీస్‌కు ఎంపికైన ఓపెనర్ జేక్ వెదరాల్డ్.. తొలిసారి 'బ్యాగీ గ్రీన్' క్యాప్(ఆసీస్ టెస్టు క్యాప్‌) అందుకునేందుకు సిద్దమయ్యాడు.అతడితో పాటు పేసర్ బ్రెండన్ డాగెట్ కూడా ఆసీస్ తరపున డెబ్యూ చేయనున్నాడు. ఈ రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌, స్కాట్ బోలాండ్‌తో కలిసి బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. గ్రీన్ రాకతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌కు నిరాశ ఎదురైంది.షెఫీల్డ్ టోర్నీలో దుమ్ములేపిన సీనియర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మూడో స్ధానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. గ‌త సిరీస్‌లో ల‌బుషేన్.. ఉస్మాన్ ఖావాజాతో క‌లిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఇప్పుడు వెదరాల్డ్ ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగ‌నున్నాడు. ఇక రెగ్యూల‌ర్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ గైర్హ‌జ‌రీలో సీనియ‌ర్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ ఆసీస్ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు.తొలి టెస్టు కోసం ఆసీస్‌ తుది జట్టు: ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్‌, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌?

Mushfiqur Rahim becomes 11th batter to score century in 100th Test5
చ‌రిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్.. వందో టెస్టులో సెంచరీ

బంగ్లాదేశ్‌ సీనియర్‌ ప్లేయర్ ముష్ఫిక‌ర్‌ రహీమ్ త‌న‌ కెరీర్‌లో ఆడుతున్న 100వ టెస్టులో అదరగొట్టాడు. ఢాకా వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ర‌హీమ్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 99 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ర‌హీమ్‌.. జోర్డాన్ నైల్ బౌలింగ్‌లో త‌న 13వ‌ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.ఈ క్ర‌మంలో ముష్ఫిక‌ర్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో వందో మ్యాచ్‌లో శ‌త‌క్కొట్టిన 11వ ఆటగాడిగా ర‌హీమ్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్‌, హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.వందో టెస్ట్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్లు..కొలిన్‌ కౌడ్రేజావిద్‌ మియాందాద్‌గార్డన్‌ గ్రీనిడ్జ్‌అలెక్‌ స్టీవర్ట్‌ఇంజమామ్‌ ఉల్‌ హక్‌రికీ పాంటింగ్‌- రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలుగ్రేమీ స్మిత్‌హషీమ్‌ అమ్లాజో రూట్‌- వందో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడుడేవిడ్‌ వార్నర్‌- వందో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన రెండో ఆటగాడుముష్ఫిక‌ర్‌ రహీమ్👉అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ త‌ర‌పున అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా మొమిముల్ హక్ రికార్డును ముష్ఫికర్ స‌మం చేశారు. ఇద్ద‌రూ కూడా ఇప్ప‌టివ‌ర‌కు టెస్టుల్లో 13 సెంచ‌రీలు సాధించారు.బంగ్లాదేశ్ తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు..13 - మోమిముల్ హక్, ముష్ఫికర్ రహీమ్10 - తమీమ్ ఇక్బాల్8 - నజ్ముల్ హొస్సేన్ శాంటోప్రత్యేక జ్ఞాపిక మ్యాచ్‌ ఆరంభానికి ముందు జరిగిన కార్యక్రమంలో ముష్ఫికర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. 2005లో ఇంగ్లండ్‌పై లార్డ్స్‌ టెస్టులో 18 ఏళ్ల 17 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముషి్ఫకర్‌... సుదీర్ఘ కెరీర్‌లో బంగ్లాదేశ్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. సచిన్‌ టెండూల్కర్, ఇమ్రాన్‌ ఖాన్‌ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్‌ ఉన్న ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముష్ఫికర్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించింది. తొలి టెస్టు ఆడిన సహచరుల సంతకాలతో కూడిన జెర్సీతో పాటు... ప్రస్తుత మ్యాచ్‌ ఆడుతున్న ప్లేయర్ల సంతకాలతో కూడిన జెర్సీని అతడికి బహుమతిగా అందజేశారు. దీంతో పాటు 100 అంకెతో కూడిన ప్రత్యేక టోపీని బహుకరించారు. బంగ్లాదేశ్‌ తరఫున వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న తొలి ప్లేయర్‌ కావడంతో... గతంలో అతడితో కలిసి ఆడిన ప్లేయర్లు, కుటుంబ సభ్యుల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

India could face Pakistan at ACC Asia Cup Rising Stars Final as semi-final fixtures get confirmed6
మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్‌?

మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో సెమీఫైన‌ల్ బెర్త్‌లు ఖ‌రార‌య్యాయి. గ్రూపు-ఎ నుంచి బంగ్లాదేశ్‌-ఎ, శ్రీలంక‌-ఎ.. గ్రూపు-బి నుంచి పాకిస్తాన్‌, భార‌త్ జ‌ట్లు సెమీస్‌కు అర్హ‌త సాధించాయి. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌, భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ పట్టుదలతో ఉంది.ఇక సెకెండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ షాహీన్స్‌, శ్రీలంక అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ రెండు సెమీస్ మ్యాచ్‌లు శుక్రవారం(నవంబర్ 21) దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.పాక్ జోరు..కాగా ఈ ఖండాంతర టోర్నమెంట్‌లో దాయాది పాకిస్తాన్ ఇప్పటివరకు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పాక్ విజయం సాధించింది. భారత్‌-ఎతో జరిగిన మ్యాచ్‌లో కూడా పాక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. మాజ్ సదాకత్ (79 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఫైనల్‌?కాగా తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం జితేశ్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు నల్లేరు మీద నడకే. ఇండియా జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, నమన్ ధీర్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.బౌలింగ్‌లో కూడా యష్ ఠాకూర్‌, యుద్దవీర్ సింగ్ వంటి యువ సంచలనాలు సత్తా చాటుతున్నారు. మరోవైపు పాక్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండడంతో శ్రీలంకను ఓడించడం దాదాపు ఖాయమనే చెప్పాలి. దీంతో మరోసారి ఫైనల్ పోరులో పాక్‌-భారత్ తలపడే అవకాశముంది.చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌?

 Shubman Gill likely to miss ODI series against South Africa7
టీమిండియా కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌?

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు నుంచి మెడ గాయం కారణంగా ఆర్ధరాంతరంగా వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అతడు జట్టుతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటుపై సందేహలు నెలకొన్నాయి. అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృం‍దం పర్యవేక్షిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే గిల్ దాదాపుగా గౌహ‌తి టెస్టుకు దూర‌మైన‌ట్లే. అత‌డి స్ధానంలో సాయిసుద‌ర్శ‌న్‌ను తుది జ‌ట్టులోకి రానున్నాడు.వ‌న్డేల‌కు దూరం?ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్‌కు సౌతాఫ్రికాతో వ‌న్డేల‌కు కూడా విశ్రాంతి ఇవ్వాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అత‌డితో వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా వ‌న్డేల‌కు దూరం కానున్న‌ట్లు స‌మాచారం. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ అయ్య‌ర్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేదు. దీంతో అత‌డిని ఆడించి రిస్క్ తీసుకోడ‌ద‌ని బీసీసీఐ యోచిస్తోంది. వీరిద్ద‌రితో పాటు జ‌స్ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలకు కూడా సెల‌క్ట‌ర్లు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గాయం కారణంగా ఆసియా కప్‌ ఫైనల్‌కు దూరమైన పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.ఈ క్ర‌మంలో స‌ఫారీల‌తో వ‌న్డే సిరీస్‌లో భార‌త ప‌గ్గాల‌ను తిరిగి రోహిత్ శ‌ర్మకు అప్ప‌గించాల‌ని అజిత్ అగార్క‌ర్ అండ్ కో నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ రోహిత్ అందుకు అంగీక‌రించ‌క‌పోతే వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్‌ను సార‌థిగా నియ‌మించ‌నున్న‌ట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఈ వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును సెల‌క్ష‌న్ క‌మిటీ ఒక‌ట్రెండు రోజుల్లో ప్ర‌కటించే అవ‌కాశ‌ముంది. వ‌న్డే జ‌ట్టులోకి య‌శ‌స్వి జైశ్వాల్‌, సాయిసుద‌ర్శ‌న్‌లు రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా న‌వంబ‌ర్ 30 నుంచి రాంఛీ వేదిక‌గా ఈ మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: రెండో టెస్టులో ఆడాలని ఉన్నా...

Captain Shubman Gill not fully recovered for second Test against South Africa8
రెండో టెస్టులో ఆడాలని ఉన్నా...

గువాహటి: భారత టెస్టు జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఎలాగైనా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే మెడనొప్పి నుంచి పూర్తిగా కోలుకోని అతను ఈ మ్యాచ్‌లో ఆడటం సందేహంగానే ఉంది. బుధవారం జట్టు సభ్యులతో పాటు గిల్‌ కూడా గువాహటికి వెళ్లాడు. గిల్‌ ఆరోగ్య స్థితిపై బీసీసీఐ ఒక ప్రకటన జారీ చేసింది. ‘కోల్‌కతా టెస్టు రెండో రోజు గిల్‌ మెడకు గాయం కాగా అదే రోజు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాం. తర్వాతి రోజు కొంత కోలుకొని అతను డిశ్చార్జ్‌ కూడా అయ్యాడు. ప్రస్తుతం అతని గాయాన్ని బోర్డు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని బట్టి వైద్య బృందం సూచన మేరకే గువాహటి టెస్టులో ఆడించాలా లేదా అని నిర్ణయిస్తాం’ అని బోర్డు వెల్లడించింది. తాజా స్థితిని బట్టి చూస్తే అతను ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా టెస్టు మ్యాచ్‌ ఆడే ఫిట్‌నెస్‌ లేదని సమాచారం. అతను అన్ని రకాలుగా కోలుకొని మైదానంలోకి వచ్చేందుకు కనీసం 10 రోజుల సమయం పట్టవచ్చు. రెండో టెస్టుతో పాటు వన్డే, టి20 సిరీస్‌ల నుంచి కూడా తప్పుకొని విశ్రాంతి తీసుకుంటే మంచిదని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. వన్డే సిరీస్‌కు బుమ్రా, పాండ్యా దూరం! పని భారం తగ్గించడంలో భాగంగా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలకు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా ఆసియా కప్‌ ఫైనల్‌కు దూరమైన పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. త్వరలోనే టి20 వరల్డ్‌ కప్‌ జరగనున్న నేపథ్యంలో వన్డేలకంటే టి20లకే ప్రాధాన్యతనివ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అందుకే సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరమై ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఫిట్‌నెస్‌ నిరూపించుకొని పాండ్యా టి20లు ఆడే అవకాశం ఉంది. ఇదే కారణంగా ప్రధాన పేసర్‌ బుమ్రాకు కూడా విరామం ఇవ్వవచ్చు.

Five Indian shuttlers advance to pre quarterfinals of Australian Open9
తరుణ్‌ శుభారంభం

సిడ్నీ: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఐదుగురు భారత షట్లర్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్‌ సహా లక్ష్యసేన్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, ఆయుశ్‌ శెట్టి విజయాలు సాధించారు. తరుణ్‌ 21–13, 17–21, 21–19తో మాగ్నస్‌ జాన్‌సెన్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందాడు. 66 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తరుణ్‌ తన షాట్‌లతో ఆకట్టుకున్నాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ లిన్‌ చున్‌ యీ (చైనీస్‌ తైపీ)తో తరుణ్‌ ఆడతాడు. ఇతర మ్యాచ్‌ల్లో లక్ష్యసేన్‌ 21–17, 21–13తో సు లీ యాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై, ప్రణయ్‌ 6–21, 21–12, 21–17తో యొహానెస్‌ సౌట్‌ మార్సెల్లినో (ఇండోనేసియా)పై విజయాలు సాధించారు. ప్రపంచ 85వ ర్యాంకర్‌తో పోరులో తొలి గేమ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ప్రణయ్‌ ఆ తర్వాత కోలుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆయుశ్‌ శెట్టి 21–11, 21–15తో సామ్‌ యువాన్‌ (కెనడా)పై, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–19, 19–21, 21–15తో లీ చియా హావ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలుపొందారు. భారత్‌కే చెందిన కిరణ్‌ జార్జ్‌ 21–11, 22–24, 17–21తో ఆరో సీడ్‌ కెంటా నిషిమొటో (జపాన్‌) చేతిలో పోరాడి ఓడాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మోహిత్‌ జగ్లాన్‌–లక్షిత జగ్లాన్‌ జంట 12–21, 16–21తో నైల్‌ యాకురా–క్రిస్టల్‌ లై (కెనడా) ద్వయం చేతిలో ఓడింది.

Lleyton Hewitt playing tennis with his son10
తండ్రీకొడుకులు ‘డబుల్స్‌’ జంటగా...

సిడ్నీ: మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, రెండు సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల విజేత లీటన్‌ హెవిట్‌ (ఆ్రస్టేలియా) రిటైర్మెంట్‌ను వదిలి ఐదేళ్ల విరామం తర్వాత టెన్నిస్‌ కోర్టులోకి మళ్లీ అడుగు పెట్టాడు. అయితే ఈ పునరాగమనానికి ప్రత్యేక కారణం ఉంది. 44 ఏళ్ల హెవిట్‌ తన 16 ఏళ్ల కొడుకు క్రజ్‌ హెవిట్‌ జోడీగా ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ న్యూసౌత్‌వేల్స్‌ ఓపెన్‌ ‘డబుల్స్‌’లో బరిలోకి దిగాడు. ఈ ద్వయానికి వైల్డ్‌ కార్డ్‌ దక్కింది. హెవిట్‌ ముగ్గురు కుమారుల్లో క్రజ్‌ ఒకడు. బుధవారం మొదటి పోరులో సత్తా చాటిన ఈ తండ్రీ కొడుకుల జంట ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో లీటన్‌ హెవిట్‌–క్రజ్‌ హెవిట్‌ 6–1, 6–0తో ఆ్రస్టేలియాకే చెందిన హేడెన్‌ జోన్స్‌–పావ్లె మరింకోవ్‌ను 47 నిమిషాల్లో చిత్తు చేశారు. మరోవైపు సింగిల్స్‌లో కూడా వైల్డ్‌ కార్డ్‌తో బరిలోకి దిగి తొలి రౌండ్‌ నెగ్గిన క్రజ్‌ హెవిట్‌ రెండో రౌండ్‌లో 7–5, 3–6, 5–7తో హయటో మట్సుకోవా (జపాన్‌) చేతిలో ఓడి నిష్క్రమించాడు. ప్రొఫెషనల్‌ కెరీర్‌లో 30 సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించిన లీటన్‌ హెవిట్‌ 2001లో యూఎస్‌ ఓపెన్, 2002లో వింబుల్డన్‌ నెగ్గాడు. సొంతగడ్డపై 2005 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను వరల్డ్‌ నంబర్‌వన్‌గా 80 వారాల పాటు ఉన్నాడు. 2016లో సింగిల్స్‌నుంచి, 2020లో డబుల్స్‌నుంచి హెవిట్‌ రిటైర్‌ అయ్యాడు. హెవిట్‌ తర్వాత పురుషుల విభాగంలో ఏ ఆ్రస్టేలియన్‌ ఆటగాడు కూడా ఇప్పటి వరకు సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ గెలవలేకపోయాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement