‘డ్రా’ చేసుకుంటే సెమీస్‌ బెర్త్‌ | Indian womens hockey team to face Wales today | Sakshi
Sakshi News home page

‘డ్రా’ చేసుకుంటే సెమీస్‌ బెర్త్‌

Mar 11 2026 1:43 AM | Updated on Mar 11 2026 1:43 AM

Indian womens hockey team to face Wales today

నేడు వేల్స్‌ జట్టుతో భారత మహిళల హాకీ జట్టు పోరు

రాత్రి గం. 7:30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచకప్‌ మహిళల హాకీ క్వాలిఫయింగ్‌ టోర్నీలో నేటితో లీగ్‌ దశ ముగియనుంది. మంగళవారం విశ్రాంతి దినం తర్వాత బుధవారం చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. పూల్‌ ‘బి’లో ఆతిథ్య భారత జట్టు తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో వేల్స్‌ జట్టుతో తలపడనుంది. గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. పూల్‌ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్‌ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 

ఉరుగ్వే 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన వేల్స్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్ర మించింది. నేడు జరిగే పూల్‌ ‘బి’ మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో ఉరుగ్వే (సాయంత్రం గం. 5:15 నుంచి) ఆడుతుంది. స్కాట్లాండ్‌ కూడా ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ఉరుగ్వే నెగ్గితే ఆ జట్టు సెమీఫైనల్‌ చేరుకుంటుంది. 

ఈ రెండు మ్యాచ్‌లకంటే ముందు పూల్‌ ‘ఎ’లో ఆస్ట్రియాతో ఇంగ్లండ్‌ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం గం. 3 నుంచి) పోటీపడతాయి. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకోగా... ఇటలీ, కొరియా మధ్య మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రెండో సెమీఫైనల్‌ బెర్త్‌ లభిస్తుంది. ఒకవేళ ఇటలీ, కొరియా మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే మెరుగైన గోల్స్‌ సగటుతో ఇటలీ ముందంజ వేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement