ఫిట్‌నెస్‌ కీలకం | Lakshya Sen satisfied with performance in All England tournament | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ కీలకం

Mar 11 2026 1:35 AM | Updated on Mar 11 2026 1:35 AM

Lakshya Sen satisfied with performance in All England tournament

శిక్షణ, ఆట ఎప్పటికప్పుడు మార్చుకోవాలి

ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో ప్రదర్శనపై సంతృప్తి

భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ అభిప్రాయం 

న్యూఢిల్లీ: ఆధునిక బ్యాడ్మింటన్‌ ప్రమాణలకు తగినట్లు ఫిట్‌నెస్‌తో మార్పు చెందాల్సిన అవసరం ఎంతగానో ఉందని భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ అంగీకరించాడు. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో రెండోసారి ఫైనల్లో ఓడిపోవడం నిరాశపరిచిందని అన్నాడు. స్వదేశం చేరాక మీడియాతో మాట్లాడుతూ తన ఆటతీరు, తీసుకునే ఆహారం, చేయాల్సిన కసరత్తు, ఉండాల్సిన ఫిట్‌నెస్‌ అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించాడు.  

నిరాశ నిజమే కానీ... 
టైటిల్‌ పోరులో ఓడిపోవడం నిరుత్సాహపరిచింది. అయినప్పటికీ ఓవరాల్‌గా టోర్నీ సానుకూలంగానే ముగిసింది. మేటి ప్రత్యర్థుల్ని ఓడించడం. నిలకడగా విజయాలు సాధించడం... ముఖ్యంగా నా ఆటతీరు నన్ను తృప్తి పరిచింది. వయసు పెరిగేకొద్దీ అలసట సహజమని, ఉన్నపళంగా కోలుకోవడానికి నేనేమీ టీనేజ్‌ కుర్రాడిని కాదు. అలాగని ఈ 24 ఏళ్ల వయసుకే నా పనైపోయిందని చెప్పడం లేదు. 

టోర్నీకి టోర్నీకి మధ్య విరామం, కచ్చితమైన ప్రాక్టీస్, బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ అన్నీ ఎప్పుడు కూడా ఒకేలా లేదంటే ఒకప్పటిలాగే ఉండవని చెబుతున్నా. ఉదాహరణకి చిన్న వయసులో ఏం తిన్నా జీర్ణమవుతుంది. కానీ వయసు పెరిగేకొద్దీ ఆ సామర్థ్యంలో తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ముఖ్యంగా తినే ఆహారం, చేసే కసరత్తు, ఆట కోసం కలిగి ఉండాల్సిన ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ ఎప్పటికప్పుడు మారుతుంది.  

ఆటను అనుసరించే శిక్షణ 
కొన్నిసార్లు ఆటను బట్టి శిక్షణ... కొన్ని సందర్భాల్లో శిక్షణను బట్టే ఆటతీరు మార్చుకోవాల్సి వస్తుంది. కాలక్రమంలో మనం ఎలా ముందజ వేయాలనేది పరిస్థితిని మార్పు చెందుతుంది. దీన్ని బట్టి నాకు సరిపోయే నిర్దిష్టమైన శైలితో ఆడాల్సి వస్తుంది. నాకు తరచూ అయిన భుజం గాయాలు కూడా నా ఆటతీరును ప్రభావితం చేశాయి. అటాకింగ్‌ షాట్లు బాగా ఆడే నేను కొన్ని సార్లు (మ్యాచ్‌ల్లో) వెనుకబడిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటప్పుడే విశ్రాంతి తీసుకొని పుంజుకోవాలి. ముఖ్యంగా గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాను. 

ఈ ఏడాదంతా కీలకం  
ఈ సీజన్‌ చాలా కీలకం. కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల రూపంలో రెండు మెగా ఈవెంట్లు ఉన్నాయి. దీంతో ఆల్‌ ఇంగ్లండ్‌ వైఫల్యంపై నా బృందంతో కలిసి విశ్లేషించుకొని ముందంజ వేస్తాను. ఇదొక్కటే సరిపోదని కూడా తెలుసు. ఎందుకంటేప్రతిష్టాత్మక టోర్నీలకు ముందు మరింత లోతైన విశ్లేషణ–పర్యవేక్షణ కూడా అవసరం కోర్టులో నా ఆటతీరు పదును పెట్టేందుకు... దీంతోపాటే ఈ సీజన్‌ మొత్తం ఫిట్‌గా ఉండేందుకు శ్రమిస్తాను. అంతర్జాతీయ సర్క్యూట్‌ ఒత్తిళ్లను తట్టుకునేలా మెంటల్‌ కండిషనింగ్‌ సెషన్‌ కూడా అవసరమవుతుంది. ఇందుకోసం మోన్‌ బ్రాక్‌మన్‌ నాకు తోడుగా ఉన్నాడు. అతనికి నా థ్యాంక్స్‌. 

అంచనాలు పెట్టుకోను  
నేను అంచనాలు లేకుండా ఆడేందుకే ఇష్టపడతాను. కానీ ఈసారి నేను తరువాతి దశలకు, క్వార్టర్‌ ఫైనల్స్‌ మరియు సెమీఫైనల్స్‌కు చేరుకున్నప్పుడు, ఈ ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతాను. నా కోచింగ్‌ బృందం ప్రోత్సాహం, వెన్ను తట్టే నాన్న అండదండలు నన్ను ఎప్పటికప్పుడు బాగా సిద్ధం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా ఫామ్‌ బాగుంది. శారీరకంగా మెరుగైన స్థితిలో ఉన్నాను. నైపుణ్యం పరంగా ఇంకా మెరుగవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement