బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 21–16తో ప్రపంచ 6వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం లక్ష్య సేన్ ఆధిపత్యం చలాయించాడు.
ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీ క్వార్టర్ ఫైనల్లో లీ షి ఫెంగ్ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్‌గా లీ షి ఫెంగ్‌తో 15 సార్లు తలపడ్డ లక్ష్య సేన్ 8 సార్లు గెలిచి, 7 సార్లు ఓడిపోయాడు. కొకి వతనాబె (జపాన్), విక్టర్ లాయ్ (కెనడా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు.


