IND v AUS: భారత్‌ ఆలౌట్‌.. ఆసీస్‌ స్కోరెంతంటే? | IND W Vs AUS W Only Test, Australia Steady After Sutherland Sinks India, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

IND v AUS: భారత్‌ ఆలౌట్‌.. ఆసీస్‌ స్కోరెంతంటే?

Mar 6 2026 9:15 PM | Updated on Mar 7 2026 12:58 PM

IND W vs AUS W Only Test: Australia Steady After Sutherland Sinks India

ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు మొదటి రోజు తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ వుమెన్‌ టీమ్‌తో మూడు టీ20, మూడు వన్డేలు.. ఒక టెస్టు ఆడేందుకు హర్మన్‌ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా
టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో దక్కించుకోగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం డే- నైట్‌ టెస్టు మ్యాచ్‌ మొదలైంది. పెర్త్‌లోని WACA స్టేడియం  వేదికగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) నాలుగు పరుగులకే వెనుదిరిగింది. లూసీ హోమిల్టన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రతికా రావల్‌ (18) సైతం నిరాశపరిచింది.

హాఫ్‌ సెంచరీతో రాణించిన జెమీమా
ఇక మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) అర్ధ శతకం (84 బంతుల్లో 52, 7 ఫోర్లు)తో రాణించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (19) విఫలం కాగా.. లోయర్‌ ఆర్డర్‌లో కశ్వీ గౌతం (34 నాటౌట్‌) మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.

మిగిలిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీప్తి శర్మ (7), రిచా ఘోష్‌ (11), స్నేహ్‌ రాణా (5), సయాలీ సత్‌గరే (7), క్రాంతి గాడ్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా భారత్‌ 62.4 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

అనాబెల్‌కు నాలుగు వికెట్లు
ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. లూసీ హోమిల్టన్‌ మూడు వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్‌ రెండు, ఆష్లే గార్డ్‌నర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక తొలి రోజే బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆసీస్‌కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లలో జార్జియా వోల్‌ (2)ను సయాలీ బౌల్డ్‌ చేయగా.. ఫోబే లిచిఫీల్డ్‌ (9)ను క్రాంతి గాడ్‌ పెవిలియన్‌కు పంపింది. కెప్టెన్‌ అలెసా హీలీ (13) వికెట్‌ను సయాలీ తన ఖాతాలో వేసుకోగా.. ఎలిస్‌ పెర్రీ, అనాబెల్‌ పట్టుదలగా నిలబడ్డారు.

నిలకడగా పెర్రీ, అనాబెల్‌
శుక్రవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఎలిస్‌ పెర్రీ 62 బంతుల్లో 43, అనాబెల్‌ 29 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో నిలిచారు. మొత్తంగా ఆసీస్‌ 27 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కంటే ఆసీస్‌ 102 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా తొలి రోజు ఆసీస్‌దే పైచేయి అని చెప్పవచ్చు.   

చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Advertisement
 
Advertisement
Advertisement