T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్‌ ఆవేదన | T20 WC 2026: I made a big mistake dropping Sanju Samson: Harry Brook reveals key reason behind England semi-final heartbreak | Sakshi
Sakshi News home page

T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్‌ ఆవేదన

Mar 6 2026 8:49 AM | Updated on Mar 6 2026 8:53 AM

T20 WC 2026: I made a big mistake dropping Sanju Samson: Harry Brook reveals key reason behind England semi-final heartbreak

క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అన్న నమ్మకాన్ని నిన్నటి భారత్‌-ఇంగ్లండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ మరోసారి రుజువు చేసింది. ఈ మ్యాచ్‌ కీలక దశలో శివమ్‌ దూబే (అక్షర్‌ పటేల్‌ సాయంతో), తిలక్‌ వర్మ పట్టిన రెండు అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్‌ గతినే మార్చేశాయి. అప్పటివరకు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉన్న సమీకరణలు.. ఆ రెండు క్యాచ్‌ల తర్వాత భారత్‌పైపు మళ్లాయి.

254 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న వేల, అక్షర్‌ పటేల్‌-శివమ్‌, తిలక్‌ వర్మ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదకరంగా ఉన్న విల్‌ జాక్స్‌, సామ్‌ కర్రన్‌ను అద్భుతమైన క్యాచ్‌లతో పెవిలియన్‌కు పంపారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపుకు ఈ రెండు క్యాచ్‌లు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

లక్ష్య ఛేదనలో జేకబ్‌ బేతెల్‌ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ గెలుపు వాకిటి వరకు వచ్చి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమికి మరో క్యాచ్‌ కూడా కారణమైంది. 

అదేంటంటే.. భారత ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ (జోఫ్రా ఆర్చర్‌) రెండో బంతికి సంజూ శాంసన్‌ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ నేలపాలు చేశాడు. ఇక్కడే ఇంగ్లండ్‌ ఓటమికి మొదటి బీజం పడింది. 

లైఫ్‌ లభించడంతో చెలరేగిపోయిన సంజూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారత్‌ భారీ స్కోర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. సంజూకు లైఫ్‌ లభించే సమయానికి అతని స్కోర్‌  కేవలం 15 పరుగులే. లైఫ్‌ లభించాక పేట్రేగిపోయిన సంజూ మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఒకవేళ సంజూ క్యాచ్‌ను బ్రూక్‌ ఆదిలోనే పట్టి ఉంటే, టీమిండియా ఈ స్థాయి స్కోర్‌ చేసుండకపోయేదేమో. ఏదిఏమైనా సంజూ క్యాచ్‌ వదలి బ్రూక్‌ సహా యావత్‌ ఇంగ్లండ్‌ టీమ్‌ మూల్యం చెల్లించుకుంది.

ఈ మ్యాచ్‌లో మరో టర్నింగ్‌ పాయింట్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 18, 19వ ఓవర్లు. అప్పటివరకు గెలుపుపై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్‌ను భారత పేసర్లు బుమ్రా, హార్దిక్‌ పాండ్యా దారుణంగా దెబ్బకొట్టారు.  

18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.

చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది.

మొత్తంగా సంజూ శాంసన్‌ డ్రాప్‌ క్యాచ్‌, శివమ్‌ దూబే (అక్షర్‌ పటేల్‌ సాయంతో), తిలక్‌ వర్మ క్యాచ్‌లు, బుమ్రా, హార్దిక్‌ పొదుపైన ఓవర్లు, చివరి ఓవర్‌ తొలి బంతికి రనౌట్‌ కావడం వంటి అంశాలు భారత్‌ గెలుపుకు కీలక కారణాలుగా నిలిచాయి.

అయితే వీటిలో సంజూ డ్రాప్‌ క్యాచే ఇంగ్లండ్‌ కొంపముంచిందని హ్యారీ బ్రూక్‌ అభిప్రాయపడ్డాడు. సంజూ క్యాచ్‌ వదలి చాలా పెద్ద తప్పు చేశానని మ్యాచ్‌ అనంతరం  ఆవేదన వ్యక్తం చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement