IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి | IND Vs ENG Semis, India Beat England Won By 7 Runs And Enters Into T20 WC 2026 Finals, Check Out Full Score Details And Match Highlights | Sakshi
Sakshi News home page

IND Vs ENG Semis: పరుగుల వరదతో ఫైనల్లోకి

Mar 6 2026 4:00 AM | Updated on Mar 6 2026 11:57 AM

India in the final battle of the T20 World Cup 2026

టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్‌

సెమీస్‌లో 7 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలుపు

మళ్లీ చెలరేగిన సంజు సామ్సన్‌ 

బెతెల్‌ శతకం వృథా

ఆదివారం న్యూజిలాండ్‌తో ఫైనల్‌

భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్‌లు.. వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్‌ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్‌ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్‌లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్‌ బృందం గట్టెక్కింది. 

గత మ్యాచ్‌ తరహాలోనే సంజు సామ్సన్‌ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్‌ తరఫున జాకబ్‌ బెతెల్‌ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్‌ భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. టి20 వరల్డ్‌ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్‌కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది.  

ముంబై: టి20 వరల్డ్‌ కప్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్‌ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్‌ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజు సామ్సన్‌ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా... శివమ్‌ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. 

అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్‌ బెతెల్‌ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది. భారత్, కివీస్‌ మధ్య టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి.  

పోటీ పడి సిక్సర్లు బాది... 
ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్‌ భాగస్వామ్యంతో భారత్‌ దూసుకుపోయింది. ఆర్చర్‌ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్‌ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. మరోవైపు ఇషాన్‌ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్‌ ఓవర్లో భారీ సిక్స్‌తో 26 బంతుల్లో సామ్సన్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్‌ కరన్‌ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. 

రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్‌ను రషీద్‌ అవుట్‌ చేశాడు. అయితే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్‌లో ముందుగా దూబేను పంపిన భారత్‌ ఫలితం రాబట్టింది. రషీద్‌ ఓవర్లో 2 భారీ సిక్స్‌లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్‌ ఓవర్లో మరో రెండు సిక్స్‌లు బాదిన సామ్సన్‌ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. 

సూర్యకుమార్‌ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్‌ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్‌ వేసిన 19వ ఓవర్లో తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్‌లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్‌లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్‌ 76 పరుగులు సాధించడం విశేషం.  

టాపార్డర్‌ విఫలం... 
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆరంభంలోనే ఫిల్‌ సాల్ట్‌ (5) వికెట్‌ కోల్పోయింది. జోస్‌ బట్లర్‌ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హ్యారీ బ్రూక్‌ (7), టామ్‌ బాంటన్‌ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్‌ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన అతను వరుణ్‌ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టాడు. 

మరోవైపు విల్‌ జాక్స్‌ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బెతెల్‌కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్‌ అవుటైన తర్వాత స్యామ్‌ కరన్‌ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మళ్లింది. 

45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్‌... శివమ్‌ దూబే వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్‌ (19 నాటౌట్‌) మూడు సిక్స్‌లు బాదినా లాభం లేకపోయింది.  

17 ఓవర్ల వరకు ఇంగ్లండ్‌దే పైచేయి... 
దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్‌ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్‌లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్‌ ముందంజలో ఉంది. 

17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్‌ వేసిన 19వ ఓవర్లో తిలక్‌ కొట్టిన 3 సిక్స్‌లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్‌ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది.  

సామ్సన్‌ క్యాచ్‌ వదిలేసి... 
గత మ్యాచ్‌ తరహాలో ఈసారి కూడా సామ్సన్‌ దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్‌ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్‌ బౌలింగ్‌లో మిడాన్‌ వద్ద కెప్టెన్‌ బ్రూక్‌ అతి సునాయాస క్యాచ్‌ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్‌ ఫలితం అనుభవించింది. 

క్యాచ్‌ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఇంగ్లండ్‌ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్‌ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్‌ను బ్రూక్‌ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్‌ లభించిన తర్వాత సామ్సన్‌ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు.  

ఆ ఒక్క ఓవర్లోనే... 
భారత్‌ ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లంతా ఏ బౌలర్‌ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్‌ వేసిన ఒక్క 14వ ఓవర్‌ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్‌ తొలి బంతికే సామ్సన్‌ వికెట్‌ తీశాడు.


 

అక్షర్‌ అదరహో... 
మైదానంలో అక్షర్‌ పటేల్‌ ఫీల్డింగ్‌ భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్‌ అందుకొని సాల్ట్‌ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్‌ ఆ తర్వాత అసాధారణ క్యాచ్‌తో బ్రూక్‌ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్‌ షాట్‌ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్‌ నుంచి అక్షర్‌ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. 

బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్‌ క్యాచ్‌ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్‌తో మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ వైపు మొగ్గింది.

5 టి20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్‌ సంజు సామ్సన్‌. గతంలో యువరాజ్‌ సింగ్‌ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్‌ పఠాన్‌ (2007లో పాకిస్తాన్‌పై ఫైనల్లో), విరాట్‌ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్‌ పటేల్‌ (2024లో ఇంగ్లండ్‌పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.

4  ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్‌–న్యూజిలాండ్‌ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.

4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌ నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్‌ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

105 టి20 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బెతెల్‌ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్‌ అలెన్‌ (100 నాటౌట్‌) స్కోరును బెతెల్‌ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) సాల్ట్‌ (బి) జాక్స్‌ 89; అభిషేక్‌ (సి) సాల్ట్‌ (బి) జాక్స్‌ 9; ఇషాన్‌ కిషన్‌ (సి) జాక్స్‌ (బి) రషీద్‌ 39; దూబే (రనౌట్‌) 43; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 11; పాండ్యా (రనౌట్‌) 27; తిలక్‌ (బి) ఆర్చర్‌ 21; అక్షర్‌ (నాటౌట్‌) 2; వరుణ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–61–1, జాక్స్‌ 4–0–40–2, ఒవర్టన్‌ 3–0–36–0, స్యామ్‌ కరన్‌ 4–0–53–0, ఆదిల్‌ రషీద్‌ 4–0–41–2, లియామ్‌ డాసన్‌ 1–0–19–0. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) అక్షర్‌ (బి) పాండ్యా 5; బట్లర్‌ (బి) వరుణ్‌ 25; హ్యారీ బ్రూక్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) బుమ్రా 7; బెతెల్‌ (రనౌట్‌) 105; బాంటన్‌ (బి) అక్షర్‌ 17; జాక్స్‌ (సి) శివమ్‌ దూబే (బి) అర్ష్ దీప్  35; స్యామ్‌ కరన్‌ (సి) తిలక్‌ వర్మ (బి) హార్దిక్‌ పాండ్యా 18; ఒవర్టన్‌ (నాటౌట్‌) 2; ఆర్చర్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్‌: అర్ష్ దీప్  సింగ్‌ 4–0–51–1, హార్దిక్‌ పాండ్యా 4–0–38–2, జస్‌ప్రీత్‌ బుమ్రా 4–0–33–1, వరుణ్‌ 4–0–64–1, అక్షర్‌ పటేల్‌ 3–0–35–1, శివమ్‌ దూబే 1–0–22–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement