T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌ | T20 WC 2026 Semis IND vs ENG: Sanju Scripts History Breaks Rohit Record | Sakshi
Sakshi News home page

T20 WC 2026: మరోసారి విధ్వంసం.. చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌

Mar 5 2026 9:00 PM | Updated on Mar 5 2026 9:16 PM

T20 WC 2026 Semis IND vs ENG: Sanju Scripts History Breaks Rohit Record

టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.

మరోసారి సెంచరీ మిస్‌
అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.

అయితే, మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.

అనంతరం సూపర్‌-8 జింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్‌ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్‌మెంట్‌ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ ‍క్రమంలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌ను గెలిపించి సెమీ ఫైనల్‌కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.

8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి
తాజాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో పద్నాలుగో ఓవర్లో విల్‌ జాక్స్‌ బౌలింగ్‌కు దిగాడు. అతడి బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించిన సంజూ.. ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

ఇక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9)తో కలిసి తొలి వికెట్‌కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌  ఇషాన్‌ కిషన్‌ (39)తో కలిసి రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌
టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.

టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు
👉సంజూ శాంసన్‌- 16 సిక్స్‌లు- 2026లో
👉రోహిత్‌ శర్మ- 15 సిక్స్‌లు- 2024లో
👉శివం దూబే- 15 సిక్స్‌లు- 2026లో
👉ఇషాన్‌ కిషన్‌- 14 సిక్స్‌లు- 2026లో
👉హార్దిక్‌ పాండ్యా- 14 సిక్స్‌లు- 2026లో
👉యువరాజ్‌ సింగ్‌- 12 సిక్స్‌లు- 2007లో.

చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement