UAE: స్కూళ్లు బంద్.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా | No final exams How UAE government school grades will be decided for term | Sakshi
Sakshi News home page

UAE: స్కూళ్లు బంద్.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

Mar 5 2026 12:16 PM | Updated on Mar 5 2026 12:27 PM

No final exams How UAE government school grades will be decided for term

దుబాయ్: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు ముందస్తుగా ‘స్ప్రింగ్ బ్రేక్’ (వసంతకాల సెలవులు) ప్రకటించడమే కాకుండా, విద్యా సంవత్సరం రెండో విడత (టర్మ్-2) గ్రేడింగ్ విధానంలోనూ సమూల మార్పులు చేసింది.

విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఆదేశాల ప్రకారం షెడ్యూల్ కంటే ఒక వారం ముందుగానే, అంటే మార్చి 9వ తేదీ నుండి మార్చి 22 వరకు విద్యా సంస్థలన్నీ మూతపడనున్నాయి. సాధారణంగా మార్చి 16 నుండి ప్రారంభం కావాల్సిన ఈ సెలవులను, ప్రస్తుతం నెలకొన్న క్షిపణి, డ్రోన్ దాడుల ముప్పులను దృష్టిలో ఉంచుకుని మార్చి 9వ తేదీకి మార్చారు. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు, బోధన, బోధనేతర సిబ్బందికి కూడా వర్తిస్తుంది.

ఈ ఆకస్మిక మార్పుల నేపథ్యంలో విద్యార్థుల విద్యా ఫలితాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు టర్మ్-2 మూల్యాంకన విధానాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మార్కులను ప్రస్తుత సెమిస్టర్లో వారు పూర్తి చేసిన ప్రాజెక్టులు, అసైన్‌మెంట్ల ఆధారంగా నిర్ణయించనున్నారు. ప్రైవేటు పాఠశాలల విషయానికొస్తే, ఆయా విద్యా సంస్థలు తమ సొంత విద్యా విధానాలకు అనుగుణంగా మూల్యాంకన పద్ధతులను ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఉద్రిక్తతల నేపధ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇప్పటికే మార్చి 5, 6 తేదీల్లో మిడిల్‌ ఈస్ట్‌లో జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. యూఏఈతో పాటు సౌదీ అరేబియా, ఖతార్, ఓమన్, కువైట్, బహ్రెయిన్, ఇరాన్ దేశాల్లోని విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. 

ఇది కూడా చదవండి: నార్కో గ్యాంగ్‌లకు ట్రంప్ వార్నింగ్: ఈక్వెడార్‌లో వేట షురూ!

Advertisement
 
Advertisement
Advertisement