‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు | How a Digital Sunset can fix your sleep? | Sakshi
Sakshi News home page

‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు

Mar 5 2026 7:58 AM | Updated on Mar 5 2026 8:48 AM

How a Digital Sunset can fix your sleep?

అది.. చీకటి గది.. నిశ్శబ్ద వాతావరణం.. కానీ మీ కళ్లపై స్మార్ట్‌ఫోన్ వెలుగు పడుతోంది. ఒక్క నిమిషం రీల్స్ చూసి పడుకుందాం అనుకుంటే, అది కాస్తా తెల్లవారుజామున రెండు గంటలవుతోంది. చేతిలో ఫోన్ ఉన్నంత సేపు సమయం తెలియదు.. అయితే మరుసటి రోజు ఉదయం నీరసం, తలనొప్పి, చిరాకు వెంటాడుతుంటాయి. దీనినే నిపుణులు ‘డూమ్ స్క్రోలింగ్’ వ్యసనం అంటున్నారు. ఈ మాయలో పడి కోట్లాది మంది  తమ విలువైన నిద్రను, ఆరోగ్యాన్ని  కోల్పోతున్నారు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘డిజిటల్ సన్ సెట్’ మంత్రం వైరల్ అవుతోంది.

‘డిజిటల్ సన్ సెట్’ అంటే?
ప్రకృతిలో సూర్యుడు అస్తమించినట్లే, మన ఇంట్లో కూడా డిజిటల్ పరికరాలకు ‘సూర్యాస్తమయం’ ప్రకటించడమే ఈ పద్ధతి. అంటే రాత్రి పడుకోవడానికి కనీసం ఒకటి లేదా రెండు గంటల ముందే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలకు స్వస్తి పలకాలి. వినడానికి ఇది కొత్తగా అనిపించినా, దీని వెనుక ఒక బలమైన కథనం ఉంది. 2018లో అన్నా ఫిర్త్, లిండెన్ కెమ్కరాన్ అనే ఇద్దరు మహిళలు తమ పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ అడిక్షన్‌ను తగ్గించడానికి ‘డిజిటల్ సన్ సెట్ ఛాలెంజ్’ ప్రారంభించారు. నేడు అది  అందరికీ ఒక సంజీవనిలా మారింది.

61 శాతం భారతీయుల నిద్ర గల్లంతు
భారతదేశంలో నిద్రలేమి సమస్య భయంకరంగా ఉంది. గణాంకాల ప్రకారం సుమారు 61 శాతం మంది భారతీయులు కనీసం ఆరు గంటల ప్రశాంతమైన నిద్రకు కూడా దూరమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం స్క్రీన్ల నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ (నీలి కాంతి). మనం నిద్రపోయేందుకు మన మెదడు 'మెలటోనిన్' అనే హార్మోన్‌ను విడుదల చేయాలి. అయితే అర్ధరాత్రి ఫోన్ వెలుగును చూడగానే, మన మెదడు అది ఇంకా పగలే అనుకుని భ్రమపడుతుంది. ఫలితంగా మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోయి, నిద్ర కరువవుతుంది. నైట్ మోడ్ లేదా ఫిల్టర్లు వాడినా మెదడుపై ఒత్తిడి తగ్గదని, కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని  వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పరిష్కార మిదే..
కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం  ఎంతో ముఖ్యమని డాక్టర్లు సూచిస్తుంటారు. రాత్రివేళ అధిక సమయంపాటు ఫోన్ చూసే అలవాటు క్రమంగా డిప్రెషన్‌కు దారితీస్తుందని క్లినికల్ న్యూరో సైకాలజిస్ట్ నైనా శర్మ తెలిపారు. బెంగళూరులోని డాక్టర్ సుమలత వాసుదేవ పర్యవేక్షణలో.. ఆన్‌లైన్ షాపింగ్‌కు బానిసైన యువత నుంచి, టీవీ సీరియల్స్ చూస్తూ గడిపే వృద్ధుల వరకు ‘డిజిటల్ సన్ సెట్’ పాటించి అద్భుతమైన మార్పులు సాధించారు. వారిలో ఏకాగ్రత పెరగడమే కాకుండా చిరాకు కూడా తగ్గింది. ముఖ్యంగా నేటి తరం పిల్లల విద్యాబుద్ధులు మెరుగుపడాలంటే తల్లిదండ్రులే ముందుగా ఫోన్ పక్కన పెట్టి, ఆదర్శంగా నిలవాలని డాక్టర్ పూజా కపూర్ సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. పెను విపత్తులో పాక్‌?

Advertisement
 
Advertisement
Advertisement