అయిదు వందల కోట్ల వ్యాపారాన్ని సృష్టించారు! | Indiranagar Kitchen To ITC, Two Sisters Built A Rs 500 Crore Empire | Sakshi
Sakshi News home page

అయిదు వందల కోట్ల వ్యాపారాన్ని సృష్టించారు!

Mar 5 2026 6:22 AM | Updated on Mar 5 2026 6:22 AM

Indiranagar Kitchen To ITC, Two Sisters Built A Rs 500 Crore Empire

ఉమెన్‌ పవర్‌

‘ఆరోగ్యానికే ప్రథమ స్థానం’ అనే ఒకే ఒక మాటతో అయిదు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు బెంగళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని, అనిందిత సంపత్‌. ఈ బ్రాండ్‌ నగరంలోని అతిపెద్ద బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇది గాలివాటు విజయం కాదు. విద్య, క్రమశిక్షణ, పోషకాహారం పట్ల లోతైన అవగాహన, వ్యాపార దక్షత ఒక దగ్గర చేర్చితే కనిపించిన ఫలితం.

ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలకు కూతుళ్లు దూరంగా ఉండేలా చూసుకునేది సుహాసిని తల్లి. ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తయారుచేసేది. ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఎప్పటికప్పుడూ అవగాహన కలిగించేది. చివరికి ఆ అవగాహనే వారి వ్యాపారానికి కేంద్రబిందువు అయ్యింది. అనిందిత బిట్స్‌ పిలాని, ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి. న్యూయార్క్‌లోని ఎర్న్స్‌ అండ్‌ యంగ్‌లో మేనేజర్‌గా పనిచేసింది. సుహాసిని లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ, వార్టర్‌ స్కూల్‌ నుండి సీఏ చేసింది. మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా పనిచేసింది.

ఒకరోజూ ప్రొటీన్‌బార్‌ తింటూ...
‘మనం ఎప్పుడైనా వ్యాపారం ప్రారంభిస్తే ఆ కంపెనీ పేరు యోగా బార్‌’ అని సరదాగా చెప్పింది సుహాసిని. ఆమె సరదాగా అన్నా, ఆ మాట నిజమైంది.
క్లీన్‌ లేబుల్‌ స్నాక్స్‌ను సృష్టించే లక్ష్యంతో సుహాసిని, అనిందిత భారతదేశానికి తిరిగివచ్చారు. ఇందిరానగర్‌లోని తమ ఇంట్లో మూడు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించింది. ‘యోగా బార్‌’ రూపంలో వారి కంపెనీ పట్టాలకెక్కింది. రిటైల్‌ వ్యాపారులు, వియోగదారులలో తమ ప్రాడక్ట్‌ గురించి నమ్మకాన్ని కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు విజయకేతనం ఎగరేశారు.

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసి దృష్టిని ఆకర్షించింది యోగా బార్‌. యోగాబార్‌ మాతృసంస్థ స్ప్రౌట్స్‌లైఫ్‌ ఫుడ్స్‌లో దాదాపు 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఐటీసీ. కంపెనీ సీయీవోగా అనిందిత ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్, క్రియేటివ్‌ విజన్‌కు సంబంధించిన బాధ్యతలను, సీవోవోగా సుహాసిని మేనేజింగ్‌ ఆపరేషన్స్, ఫైనాన్షియల్‌ డిసిప్లేన్‌కు సంబంధించిన బాధ్యతలను చూస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement