న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తోంది. మహారాష్ట్ర నుంచి ఖాళీ అవుతున్న ఏడు స్థానాలకు గాను నలుగురు కీలక నేతలను బరిలోకి దించుతున్నట్లు బుధవారం పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ప్రముఖ నేతలు మాయా చింతామన్ ఇవ్నతే, రాంరావు వాడ్కుటేలకు చోటు దక్కింది. మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన పట్టును నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. బీహార్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు శివేష్ కుమార్‌లను బరిలోకి దించారు. నితిన్ నబిన్ నియామకం పార్టీలో సరికొత్త చర్చకు దారితీసింది. గత జనవరిలో జె.పి. నడ్డా స్థానంలో బాధ్యతలు చేపట్టిన 45 ఏళ్ల నబిన్, బీజేపీలో మూడవ తరం నాయకత్వ ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ వంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో ఎదిగి, నేడు ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన నబిన్, ప్రస్తుతం బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హర్యానాలో రాజ్యసభ అభ్యర్థిగా కర్నాల్ మాజీ ఎంపీ సంజయ్ భాటియాను పార్టీ ఎంపిక చేసింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితునిగా పేరున్న భాటియా, తనలాంటి సాధారణ కార్యకర్తకు ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో భాటియా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక అస్సాం నుంచి తెరష్ గోవాలా, జోగెన్ మోహన్; ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, ఒడిశా నుంచి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సుజిత్ కుమార్‌లను బీజేపీ అధిష్టానం నామినేట్ చేసింది.
ఇది కూడా చదవండి: ‘ఇది రంగుల పండుగ మాత్రమే కాదు’..’ .. సీఎం హోలీ సందేశం


