రాజ్యసభ సీట్లపై బీజేపీ వ్యూహాం.. 21 టార్గెట్‌! | BJP Full Focus On Rajya Sabha 21 Seats on Elections | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సీట్లపై బీజేపీ వ్యూహాం.. 21 టార్గెట్‌!

Feb 25 2026 7:15 AM | Updated on Feb 25 2026 8:36 AM

BJP Full Focus On Rajya Sabha 21 Seats on Elections

ఎన్నికలు జరిగే స్థానాల్లో 19 గ్యారంటీగా ఎన్‌డీఏ పక్షాలకు

బీహార్, అస్సాం, హరియాణాలో మరో 2 సీట్లు గెలిచేందుకు వ్యూహం

కేంద్రమంత్రులు అథవాలే, ఠాకూర్‌లకు అవకాశం

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌కు కొనసాగింపు

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 37 స్థానాల్లో కనీసంగా 21 స్థానాలను తన ఖాతాలో వేసుకునే దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. మొత్తం సీట్లలో 19 స్థానాలు కచ్చితంగా ఎన్‌డీఏ పక్షాలకు దక్కుతాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. మరో రెండు సీట్లను కొద్దిపాటి సర్దుబాట్లతో దక్కించుకోవచ్చన్న అంచనాతో ఆ దిశగా రాష్ట్రాల నేతలతో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు మొదలుపెట్టింది.  

మెజార్టీ సీట్లే లక్ష్యంగా కసరత్తు..
ప్రస్తుతం 245 సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకు 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లున్నాయి. మెజారిటీకి అవసరమైన 123 సీట్లకు ఇంకా కొంత దూరంలోనే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అధికార బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల ముఖ్య నేతలతో ఇప్పటికే బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్‌ నబిన్, అగ్ర నేతలు చర్చలు మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. 288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్రలో ఎన్డీయేకు 235 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఖాళీ అయిన 7 స్థానాల్లో కనీసం 6 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది.

బీహార్‌లో ఎన్డీఏ పక్షాలకు ఉన్న బలం ఆధారంగా 5 స్థానాలకుగాను 4 స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా కని్పస్తోంది. ఐదో స్థానంపై ఎన్‌డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ఐదో స్థానం గెలిచేందుకు ప్రతిపక్ష శిబిరం నుంచి ముగ్గురు శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఎన్‌డీఏకు దొరకడం అంత కష్టమేమీ కాదనేది పార్టీ వర్గాల అంచనా. ఒడిశాలో 4 స్థానాలకు గానూ రెండింటిలో ఎన్‌డీఏ, మరొక సీటును ప్రతిపక్ష పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. మరో సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేడీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం.

హరియాణాలో రెండు సీట్లకుగాను ఒక సీటు బీజేపీ ఖాతాలో పడగా మరో సీటుకు ఏ పారీ్టకి తగినంత బలం లేదు. దీంతో ఆ సీటుపైనా బీజేపీ కన్నేసింది. వరుసగా రెండు పర్యాయాలు పూర్తిచేసిన వారిని పక్కనపెట్టడం, పార్టీ జాతీయస్థాయి పదవుల్లో ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వయోపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ మార్చినెల తొలివారంలో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది.

బీహార్‌ నుంచి నితిన్‌ నబిన్‌.. 
ప్రస్తుతం బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు బిహార్‌ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూకి చెందిన కేంద్ర మంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌లకు తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ను బిహార్‌ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న భోజ్‌పురి నటుడు పవన్‌ సింగ్‌కు ఇదే రాష్ట్రం నుంచి సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌దాస్‌ అథావాలేకు తిరిగి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయి. ఒడిశా లేదా హరియాణా రాష్ట్రం నుంచి మాజీ కేంద్ర మహిళా మంత్రి స్మృతీ ఇరానీని రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement