Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
సాక్షి,ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవమయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు నితీన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ నబీన్‌ను ప్రతిపాదిస్తూ 37 సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి. 2020 నుంచి 2026 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పనిచేశారు. ఆయన పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగింది. నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికై బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బిహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో ఈయన బీజేపీ చీఫ్ పదవి చేపట్టనున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టించనున్నారు. బిహార్‌లో బీజేపీ సీనియర్ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ నబీన్‌కు పార్టీ అధిష్టానం పటా్న(పశ్చిమ) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60వేల ఓట్ల భారీ మెజారిటీతో నబీన్ గెలిచారు. అప్పట్నుంచి వరసగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బిహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 51,000 ఓట్ల మెజారిటీతో బంకింపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.అలా కేవలం 45 ఏళ్ల వయసుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. నబీన్ గతంలో యువ మోర్చాలో పనిచేశారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. రేపే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.