ఇయర్‌ఫోన్ల వాడకంలో ఈ తప్పు చేస్తున్నారా? | Wearing earphones for long hours ENT doctor shares this one | Sakshi
Sakshi News home page

ఇయర్‌ఫోన్ల వాడకంలో ఈ తప్పు చేస్తున్నారా?

Mar 10 2026 8:16 AM | Updated on Mar 10 2026 8:24 AM

Wearing earphones for long hours ENT doctor shares this one

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఎంత అవసరమో, చెవుల్లో ఇయర్‌ఫోన్లు కూడా అంతే అనివార్యమయ్యాయి. ప్రయాణాల్లో పాటలు విన్నా, ఆఫీస్ కాల్స్ మాట్లాడినా.. ఇయర్‌ఫోన్లు లేనిదే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ అలవాటే శాశ్వత  చెవిటితనంలోకి నెట్టేస్తుందనే సంగతి మీకు తెలుసా? గంటల తరబడి చెవిని హోరెత్తించే ఆ శబ్దం, వినికిడి శక్తిని మటాష్ చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యువతపై ‘సౌండ్’ సర్జికల్ స్ట్రైక్!
సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి వచ్చే వినికిడి సమస్యలు ఇప్పుడు 20 ఏళ్ల యువకుల్లోనే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్ దీప్తి సిన్హా తెలిపిన వివరాల ప్రకారం 'నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్' (NIHL) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇయర్‌ఫోన్ల మితిమీరిన వాడకం వల్ల లోపలి చెవిలో జరిగే నష్టం వెంటనే తెలియదు. ఇది ఒక ‘స్లో పాయిజన్’ మాదిరిగా పనిచేసి, మనం గుర్తించే లోపే వినికిడి శక్తిని హరిస్తుంది.

తిరిగి రాని ‘కేశ కణాలు’.. జాగ్రత్త!
శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా నొప్పి వస్తుంది. కానీ చెవి లోపల వినికిడి దెబ్బతినేటప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు. మనం 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం విన్నప్పుడు, లోపలి చెవిలోని సున్నితమైన 'హెయిర్ సెల్స్' (కేశ కణాలు) శాశ్వతంగా చనిపోతాయి. మానవ శరీరంలోని ఈ కణాలు ఒక్కసారి నశిస్తే తిరిగి పుట్టవు. అంటే ఆ సెల్స్ పోయాయంటే వినికిడి శక్తిని మళ్లీ పొందడం అసాధ్యం.

రక్షణ కవచం: ‘60/60’ మ్యాజిక్ ఫార్ములా
ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు వైద్యులు ఒక అద్భుతమైన సూత్రాన్ని సూచిస్తున్నారు. అదే '60/60' రూల్. దీని ప్రకారం ఫోన్‌ వాల్యూమ్‌ను ఎప్పుడూ 60 శాతం కంటే పెంచకూడదు. రోజులో ఇయర్‌ఫోన్లు వాడే సమయాన్ని కేవలం 60 నిమిషాలకే పరిమితం చేయాలి. ప్రతి గంట వాడకం తర్వాత కనీసం ఐదు నిమిషాలు చెవులకు విశ్రాంతినివ్వడం వల్ల శ్రవణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.

నాయిస్ క్యాన్సిలేషన్: ఒక వరం
బయట ట్రాఫిక్ లేదా రద్దీగా ఉన్నప్పుడు మనం వాల్యూమ్ పెంచుతుంటాం. ఇది చెవికి మరింత చేటు చేస్తుంది. అందుకే బయటి శబ్దాలను అడ్డుకునే 'ఆక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్' (ANC) ఫీచర్ ఉన్న ఇయర్‌ఫోన్లను వాడటం ఉత్తమం. దీనివల్ల తక్కువ వాల్యూమ్‌లో కూడా స్పష్టమైన శబ్దం వినిపిస్తుంది. తద్వారా చెవి లోపలి సున్నిత భాగాలకు రక్షణ లభిస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే..
తరచుగా చెవుల్లో 'రింగు'మనే శబ్దం (Tinnitus) వస్తున్నా, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మాటలు అస్పష్టంగా అనిపిస్తున్నా వెంటనే మేల్కోవాలి. చెవులు మూసుకుపోయినట్లు ఉండటం లేదా శబ్దాలు మందకొడిగా వినిపించడం లాంటివాటిని ప్రమాద ఘంటికలుగా గుర్తించాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు ఏటా ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: రష్యాలో ఆఫ్రికన్‌ యువత మృత్యు ఘోష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement