రష్యాలో ఆఫ్రికన్‌ యువత మృత్యు ఘోష | South African Youth Tricked Into Ukraine War, Former President Zuma Daughter Under Investigation | Sakshi
Sakshi News home page

రష్యాలో ఆఫ్రికన్‌ యువత మృత్యు ఘోష

Mar 8 2026 11:05 AM | Updated on Mar 8 2026 12:08 PM

The South Africans sent to fight Russias war

డర్బన్: విదేశాల్లో భారీ జీతంతో కూడిన ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. ఇవీ అక్కడి యువతకు చూపిన ఆశలు. కానీ కట్ చేస్తే, చేతిలో తుపాకీ.. కళ్లెదుట మృత్యుఘోష. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆఫ్రికా లోని పేద యువతను ఎలా బలిపీఠం ఎక్కిస్తోందో చాటిచెప్పే హృదయవిదారక ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రష్యా తరఫున ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి పంపిన దక్షిణాఫ్రికా యువకులు చావును తప్పించుకుని స్వదేశానికి చేరుకున్నారు.

ఈ భారీ కుంభకోణం వెనుక దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా కుమార్తె, దుదుజైల్ జుమా-సంబుడ్లా ఉన్నట్లు ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. వీఐపీలకు భద్రతా సిబ్బందిగా శిక్షణ ఇస్తామని నమ్మించి, ఎంపిక చేసిన యువకులను నేరుగా ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ రణక్షేత్రానికి తరలించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో దుదుజైల్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయగా, ప్రస్తుతం ఆమెపై పోలీసు విచారణ కొనసాగుతోంది.

స్వదేశానికి చేరుకున్న సిపో ద్లామిని అనే బాధితుడు తన చేదు అనుభవాలను పంచుకుంటూ.. ‘మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లగానే మా దుస్తులు, పత్రాలు, కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా అన్నింటినీ తగలబెట్టించారు. కనీస శిక్షణ కూడా లేకుండానే తుపాకులు ఇచ్చి, యుద్ధ భూమికి పంపారు. అక్కడ ఆఫ్రికన్ల పరిస్థితి అత్యంత దారుణం. రష్యా సైనికులు మమ్మల్ని జాతి వివక్షతో దూషించేవారు. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలకు మమ్మల్ని ఎరగా పంపేవారు’ అని వాపోయాడు. డ్రోన్ దాడుల్లో కొందరు తమ అవయవాలను కోల్పోగా, మరికొందరు ప్రాణాలు విడిచినట్లు బాధితులు వెల్లడించారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన చర్చల ఫలితంగా ఇప్పటివరకు 15 మంది యువకులు స్వదేశానికి చేరుకున్నారు. యుద్ధ భూమిలో ప్రాణాలు పోగొట్టుకున్న తోటి మిత్రుల జ్ఞాపకాలు వెంటాడుతుండగా, మరోవైపు విదేశీ యుద్ధాల్లో పాల్గొనడాన్ని నిషేధించే దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం వీరిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘హాక్స్’ (Hawks) దర్యాప్తు సంస్థ ఈ అక్రమ రవాణాపై విచారణ జరుపుతోంది. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని, వారిని కిరాయి సైనికులుగా మారుస్తున్న అంతర్జాతీయ ముఠాల ఆగడాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: కారును 150లో పోనిస్తూ.. యూట్యూబర్‌ ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement