ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో పెట్రో ధరల బాంబు పేలింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా చైన్‌లో తలెత్తిన ఆటంకాల నేపథ్యంలో పాకిస్తాన్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ శనివారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా 55 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తాజా పెంపుతో పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 266.17 నుంచి రూ. 321.17కు చేరింది. అంటే దాదాపు 17 శాతం మేరకు పెరిగింది. ఇక రవాణా రంగానికి కీలకమైన హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 280.86 నుంచి ఏకంగా రూ. 335.86కు (20 శాతం పెంపు) ఎగబాకింది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్, ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అనిశ్చితి నెలకొందని వారు పేర్కొన్నారు. ‘పొరుగు దేశంలో రాజుకున్న నిప్పు ఇప్పడు ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్ర హెచ్చుతగ్గుల దృష్ట్యా, ఇకపై ప్రతి వారం పెట్రో ధరలను సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా పాకిస్తాన్‌కు వచ్చే చమురు రవాణాలో అధిక భాగం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధి గుండానే జరుగుతుంటుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గంలో సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు నౌకలను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు


