నడుము పెరిగిందా? ఆయుష్షు తగ్గినట్లే! | Gaining weight around waist danger for your heart and liver | Sakshi
Sakshi News home page

నడుము పెరిగిందా? ఆయుష్షు తగ్గినట్లే!

Mar 7 2026 8:01 AM | Updated on Mar 7 2026 8:51 AM

Gaining weight around waist danger for your heart and liver

నడుము చుట్టూ కొంచెంగానైనా కొవ్వు పెరిగితే  అది వయసుతో పాటు వచ్చేదేగా.. అని సరిపెట్టుకుంటున్నారా? అయితే నిలువునా ప్రమాదంలో పడినట్లే! పెరిగే పొట్ట కేవలం బట్టల సైజును మాత్రమే మార్చదు.. అది  మనిషి ఆయుష్షును కూడా హరిస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఏం జరుగుతుంది?

బీఎంఐ బాగున్నా.. కొవ్వు కాటేయవచ్చు!
చాలామంది తమ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) సరిగానే ఉందని, బరువు అదుపులోనే ఉందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు డాక్టర్ పంకజ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం.. బయటకు సన్నగా కనిపిస్తూ, కేవలం నడుము వద్ద కొవ్వు పేరుకుపోయిన వారు (Skinny Fat) మరింత జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల బాహ్యంగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా, లోపలి అవయవాలు ప్రమదకరమైన కొవ్వులో మునిగిపోయి ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ప్రాణాంతక ‘విసెరల్ ఫ్యాట్’ అంటే..
చర్మం కింద కనిపించే మెత్తటి కొవ్వు కంటే, కంటికి కనిపించకుండా అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే ‘విసెరల్ ఫ్యాట్’ అత్యంత ప్రమాదకరమైనది. ఇది కాలేయం, గుండె, క్లోమం  తదితర కీలక అవయవాలను చుట్టుముట్టి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఇది కేవలం కొవ్వు మాత్రమే కాదు, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (మంట) కలిగించే హానికరమైన రసాయనాలను నిరంతరం విడుదల చేసే ఒక ‘టాక్సిక్ సెంటర్’.

కాలేయంపై నిశ్శబ్ద దాడి
నడుము చుట్టూ చేరే ఈ కొవ్వు నేరుగా కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ‘మెటబాలిక్ అసోసియేటెడ్ స్టెటోటిక్ లివర్ డిసీజ్’ (MASLD) లేదా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా కాలేయ వాపునకు, తద్వారా సిర్రోసిస్ వంటి ప్రాణాంతక స్థితికి దారితీస్తుంది. అందుకే నడుము చుట్టూ కొవ్వు పెరగడం అంటే కాలేయానికి ముప్పు మొదలైనట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గుండెకు గండం.. 
పెరిగిన నడుము చుట్టుకొలతకు, గుండె జబ్బులకు విడదీయలేని సంబంధం ఉంది. విసెరల్ ఫ్యాట్ వల్ల రక్తపోటు పెరగడం, చెడు కొలెస్ట్రాల్ అధికం కావడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం జరుగుతుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీసి, అకస్మాత్తుగా గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని ఈ కొవ్వు నెమ్మదింపజేస్తుంది.

ప్రమాదాన్ని ఇలా కొలుచుకోండి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం.. నడుము-తుంటి నిష్పత్తి (Waist-to-hip ratio)  ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మహిళల్లో ఈ నిష్పత్తి 0.85 దాటితే అది అధిక ముప్పుగా భావించాలి. పురుషుల్లో 1.0 దాటితే గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. రిబ్స్ దిగువన, నడుము ఎముక పైభాగంలో టేపుతో కచ్చితమైన కొలత తీసుకోవడం ద్వారా నడుము స్థితిని తెలుసుకోవచ్చు.

పరిష్కారం మీ చేతుల్లోనే!
నడుము చుట్టూ కొవ్వు పెరుగుతున్నట్లు గమనిస్తే దానిని నిర్లక్ష్యం చేయకండి. ఆహార నియమాలు పాటించడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ విసెరల్ ఫ్యాట్‌ను కరిగించవచ్చు. బరువు తగ్గడం అనేది కేవలం అందం కోసం కాదు, మీ గుండె, కాలేయాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం అని గుర్తించండి.

ఇది కూడా చదవండి: ‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement