‘శబరిమల’ సెగ ఉధృతం.. పినరయి సర్కారుకు షాక్‌ | Sabarimala controversy cost the Pinarayi Vijayan CM's chair | Sakshi
Sakshi News home page

‘శబరిమల’ సెగ ఉధృతం.. పినరయి సర్కారుకు షాక్‌

Mar 7 2026 9:25 AM | Updated on Mar 7 2026 9:33 AM

Sabarimala controversy cost the Pinarayi Vijayan CM's chair

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరానికి గడువు సమీపిస్తున్న వేళ, అధికార ఎల్డీఎఫ్ (ఎల్‌డీఎఫ్‌)కూటమికి పలు వివాదాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో మరోమారు పాగా వేయాలని భావిస్తున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి శబరిమల వివాదం, బంగారం  చోరీ ఉదంతాలు పెద్ద అడ్డంకులుగా మారనున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ప్రముఖ వార్తా సంస్థ 'మాతృభూమి-కోర్' నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’ సర్వేలో వెల్లడైన గణాంకాలు అధికార కూటమిలో గుబులు రేపుతున్నాయి. సుమారు 28,432 మంది ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ సంప్రదాయాల వివాదం, దౌత్య కార్యాలయం ద్వారా జరిగిన బంగారం చోరీ కేసులు నేటికీ ఓటర్లపై బలంగా ముద్ర వేశాయి. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 52.09 శాతం మంది.. ఈ అంశాలు రాబోయే ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.

సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 11.33 శాతం మంది మాత్రమే వీటి ప్రభావం యూడీఎఫ్ (యూడీఎఫ్‌)పై ఉంటుందని భావిస్తుండగా, ఎన్‌డీఏకు నష్టం వాటిల్లుతుందని నమ్ముతున్న వారు కేవలం 1.31 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. పినరయి విజయన్ నేతృత్వంలోని రెండో విడత ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత కంటే, గత వివాదాల నీడ ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే స్థాయికి చేరాయంటున్నారు. సుమారు 19.24 శాతం మంది ఓటర్లు ఈ అంశాలు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని అభిప్రాయపడినప్పటికీ, సగానికి పైగా జనం ప్రతికూలత వ్యక్తం చేయడం ఎల్డీఎఫ్ అగ్రనేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మరో రెండు నెలల్లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో, వివాదాలను అధిగమించి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఎల్డీఎఫ్ తహతహలాడుతుంటే, ప్రజాభిప్రాయాన్ని తమ వైపు తిప్పుకోవాలని యూడీఎఫ్ శ్రమిస్తోంది.

ఇది కూడా చదవండి: Nepal: ‘ఆర్ఎస్‌పీ’ ప్రభంజనం.. ప్రధానిగా ‘బాలెన్’?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement