భారతీయ కార్పొరేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రానున్న ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందనుంది. 2025లో నమోదైన 8.9 శాతం వేతన పెంపు 2026లో 9.1 శాతానికి చేరుకోనుందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏయాన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా విడుదలైన ‘32వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2025-26’ ప్రకారం.. దేశంలోని 45 పరిశ్రమలకు చెందిన సుమారు 1,400 సంస్థల గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించారు.
రంగాల వారీగా వేతనాల జోరు
ఈ ఏడాది వేతన పెంపులో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థలు) రంగాలు అగ్రస్థానంలో నిలవనున్నాయి. సాంకేతికత, ఇంజినీరింగ్, కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం సంస్థలు పోటీ పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో చెప్పారు.
ప్రధాన రంగాల అంచనాలు
| పరిశ్రమ | 2025 వాస్తవ పెంపు (%) | 2026 అంచనా (%) |
|---|---|---|
| ఎన్‌బీఎఫ్‌సీ | 9.7 | 10.1 |
| రియల్టీ / ఇన్‌ఫ్రా | 10.5 | 10.2 |
| ఆటోమోటివ్ | 9.8 | 9.9 |
| రిటైల్ | 9.0 | 9.5 |
| టెక్నాలజీ | 7.0 | 6.6 |
తగ్గిన వలసలు
గడిచిన మూడేళ్లుగా ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్-ఉద్యోగ మార్పు) క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం.
2023: 18.7%
2024: 17.7%
2025: 16.2%
ప్రస్తుతం ఈ రేటు కొవిడ్ పూర్వపు స్థాయికి చేరుకుంది. కంపెనీలు అనుసరిస్తున్న మెరుగైన నియామక ప్రక్రియలు, ఉద్యోగుల నిలుపుదల కోసం చేపడుతున్న కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు ఈ సానుకూల మార్పుకు కారణమని నివేదిక పేర్కొంది.
ఈ సందర్భంగా ఏయాన్ ఇండియా పార్టనర్ రూపాంక్ చౌదరి మాట్లాడుతూ..‘భారతదేశం ప్రస్తుతం బలమైన స్థూల ఆర్థిక పునాదులతో వృద్ధి పథంలో ఉంది. దేశీయ గిరాకీ పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల కంపెనీలు ప్రతిభావంతులపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు. దేశంలో కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తుండటంతో కంపెనీలు తమ వేతన నిర్మాణాలను మారుస్తున్నాయని ఏయాన్ అసోసియేట్ పార్టనర్ అమిత్ కుమార్ ఓత్వానీ తెలిపారు.
ఇదీ చదవండి: రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?


