ఆన్‌లైన్ షాపింగ్ అంత ఈజీ కాదు?
భవిష్యత్తులో ఏఐ చిక్కులకు చెక్ పెట్టేలా నెటిజన్ల ఆలోచన
లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు
ఒక్క క్లిక్‌తో ప్రపంచాన్ని ఇంటి ముందుకు తెస్తున్న ఈ–కామర్స్ రంగంలో ఇప్పుడు వినియోగదారులు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వస్తువుల ఎంపికలో గందరగోళం, రేటింగ్స్‌లో నిజానిజాలు, ధరల వ్యత్యాసాలతో 69 శాతం మంది నెటిజన్లు సతమతమవుతున్నట్లు ‘లోకల్ సర్కిల్స్’తాజా సర్వే బాంబు పేల్చింది. అయితే, ఈ చిక్కుముడులను విప్పేందుకు 64 శాతం మంది కొనుగోలుదారులు ఇప్పుడు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’వైపు మొగ్గుచూపుతుండటం విశేషం. – సాక్షి, హైదరాబాద్
వస్తువుల కొనుగోళ్లకు ఎక్కువ మంది ఇప్పుడు ఈ–కామర్స్ వెబ్‌సైట్లను వినియోగిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో వంటి వెబ్‌సైట్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు ఇలా ఏ వస్తువునైనా ఇంటి వద్దే కూర్చుని కొనుగోలు చేయవచ్చు. అయితే వస్తువుల ఎంపిక, నాణ్యత, ధరల్లో వ్యత్యాసం ఇలా ఎన్నో అంశాలను వినియోగదారుడు పరిశీలించుకోవాలి. అప్పుడే మన్నికైన, తక్కువ ధరలో వస్తువు పొందగలుగుతారు.
అయితే ఈ పోలికల్లో చిక్కులు తప్పడం లేదని, ఆన్‌లైన్ షాపింగ్ కూడా అంత ఈజీ కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడేందుకు ఆసక్తి పెరుగుతోంది. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా 332 జిల్లాల నుంచి 75 వేల మంది వినియోగదారులతో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రానున్న ఏడాదిలోపు చాట్‌జీపీటీ, గ్రోక్, మెటా, జెమిని వంటి ఏఐ టూల్స్ వాడతామని వారు పేర్కొన్నారు.
ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇబ్బందులు
సరైన వస్తువు ఎంపికలో ఎక్కువ సమయం: 69 శాతం
ఉత్తమ ధర, డెలివరీ, రిటర్న్ పాలసీలు: 49 శాతం
విక్రేత వివరాలు తెలుసుకోవడం: 43 శాతం
రివ్యూలు, రేటింగ్స్ వాస్తవికత: 40 శాతం
ఇతర అంశాలు: 6 శాతం /ఏమీ చెప్పలేం: 6 శాతం
ఏఐ టూల్స్ ఎందుకు వాడాలనుకుంటున్నారు?
అమ్మకందారుల ప్రామాణికత తనిఖీకి.. 68%
సమయం ఆదా చేయడానికి.. 64%
రివ్యూలు, రేటింగ్స్ విశ్లేషణకు.. 56%
సందేహాల నివృత్తికి 46%
ధరల మార్పులు గుర్తించేందుకు.. 36%
కొనుగోళ్ల ప్లానింగ్ కోసం.. 22%


