ముందస్తు భగభగలు! | Winter ended ten days early and Temperature rise in Telangana | Sakshi
Sakshi News home page

ముందస్తు భగభగలు!

Feb 22 2026 4:45 AM | Updated on Feb 22 2026 4:45 AM

Winter ended ten days early and Temperature rise in Telangana

పది రోజుల ముందే ముగిసిన శీతాకాలం 

మూడు రోజులుగా రోజుకు సగటున 0.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల 

చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదు 

ఒకట్రెండు రోజుల్లో వేసవి అంచనాలు విడుదల చేయనున్న ఐఎండీ

సాక్షి, హైదరాబాద్‌: చలికాలం ముగిసింది. పది రోజుల ముందే రాష్ట్రంలో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోగా... వేసవి భగభగలు అప్పుడే మొదలయ్యాయి. సాధారణంగా రాష్ట్రంలో చలికాలం డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. కానీ ఈసారి నవంబర్‌ నెలలోనే చలి తీవ్రత అధికంగా నమోదు కాగా... డిసెంబర్‌లో తీవ్రస్థాయికి చేరింది. జనవరి నెలాఖరు వరకు తీవ్రత ఎక్కువగా ఉండగా... ఫిబ్రవరి రెండో వారం నుంచి చలి క్రమంగా తగ్గింది. ప్రస్తుతం పది రోజుల ముందే చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టగా... చిటపట ఎండలు నమోదవుతున్నాయి. రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదైంది. ఈనెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతుండటం గమనార్హం. 

వాతావరణంలో మార్పులతో... 
ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా సీజన్‌ మార్పును గమనించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని వాతావరణం వేగంగా మారుతోంది. ఉత్తర ప్రాంతం నుంచి చలి గాలుల తీవ్రత తగ్గింది. ప్రస్తుతం చలి తీవ్రంగా ఉండాల్సి ఉండగా... పొడి వాతావరణం నమోదవుతుండటంతో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫలితంగా పగటిపూట ఉక్కపోత అధికంగా నెలకొంటోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో సీజన్‌లు ముందుకు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో ముందస్తు వేసవి ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

ఒకట్రెండు రోజుల్లో వేసవి సీజన్‌ అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 36.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 2 డిగ్రీ సెల్సియస్‌ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement