summer Intensity
-
గొంతెండుతోంది ‘బాబూ’.. నీరు.. బేజారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు/ సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లె తాగునీటి ఎద్దడితో ఘోషిస్తోంది. మండుటెండల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా చంద్రబాబు సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. వేసవిలో ఏ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తుతుంది? పరిష్కార మార్గం ఏమిటి? ఎంత నిధులు అవసరం? అనే వివరాలతో ప్రణాళికలు రూపొందించి నిధుల కోసం ఏటా డిసెంబర్, జనవరిలోనే ప్రభుత్వానికి ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటిపారుదలశాఖ) అధికారులు ప్రతిపాదనలు పంపుతారు. వీటిని బుట్టదాఖలు చేసిన చంద్రబాబు సర్కారు మే చివరిలో కేవలం చిల్లర విదిల్చింది. ఈ ఏడాది నదుల్లో ప్రవాహం తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడంతో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సమస్య నెలకొంది. కొన్ని చోట్ల వారం పది రోజులకు కూడా నీరు అందడం లేదు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళంతో పాటు చాలా జిల్లాలో ప్రజలు రోడ్డెక్కి నీటి కోసం రాస్తారోకోలు నిర్వహించారంటే ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో స్పష్టమవుతోంది. పాతాళంలో జలాలు..అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడం కొత్త కాకపోయినా ఈ ఏడాది తూర్పు గోదావరి లాంటి జిల్లాల్లో కూడా అడుగంటాయి. దీన్నిబట్టే రాష్ట్రంలో బోర్లు పరిస్థితి, తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో పుట్లూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్లకు పడిపోయాయి. ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నట్లు గుర్తించారు. మరో 20 మండలాల్లో కూడా భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో తగ్గాయి. కర్నూలు జిల్లాలో కోసిగి, ప్యాపిలి, దేవనకొండ, బేతంచర్ల, క్రిష్ణగిరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, హాలహర్వి, నందికొట్కూరు, సంజామలలో ప్రమాదకర స్థాయిలో సగటున 100–150 మీటర్ల వరకూ తగ్గిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో 40 అడుగులు మేర భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో గతంలో పోలిస్తే రక్షిత మంచినీటి పథకాలకు నీటి లభ్యత 50 శాతం తగ్గింది. ఫలితంగా వీటిపై ఆధారపడిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది.అసలే ఎద్దడి.. ఆపై కలుషిత నీరుగుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలుతో పాటు చాలా పట్టణాల్లో మునిసిపాలిటీ పైపులైన్ల లీకేజీతో కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీనికి తోడు మంచినీటి ఎద్దడి నెలకొంది. కలుషిత నీరు, నీటి ఎద్దడి వెరసి మునిసిపాలిటీ నీటిపై నమ్మకం లేక చాలామంది మినరల్ వాటర్ క్యాన్లు, ఇళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో కూడా మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. మినరల్ వాటర్ ఆటో గ్రామానికి వస్తే బిందె రూ.10 చొప్పున కొంటున్నారు. తాగునీటి కోసం రోజూ రెండు బిందెలు చొప్పున నెలకు రూ.600 వరకు తాగునీటి కోసం ఒక్కో కుటుంబం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉపాధి హామీ కూలీలు తమ మూడు రోజుల కూలీని తాగునీటి కోసం ధార పోయాల్సిన పరిస్థితి. తాగునీరు సంగతి పక్కనపెడితే వంటకు, స్నానానికి ఇతర అవసరాలకు కూడా నీరు దొరకని దారుణ పరిస్థితి తలెత్తింది.అచ్చెన్న ఇలాకాలో గిరిజనుల అవస్థ..శ్రీకాకుళం జిలాల్లో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలితో పాటు కంచిలి, ఆముదాలవలస, హిర, పాతపట్నంలోని చాలా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉంది. కంచిలి మండలం నువాగడలో గిరిజనులు నెల రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడికి తాగునీటిని సరఫరా చేసే పథకాలు పాడయ్యాయి. ఉద్దానం నీటి పథకం ద్వారా జేజేఎం ట్యాప్ పాయింట్లకు నీటి సరఫరా కావడం లేదు. స్థానిక పంచాయతీ బోరు కూడా పని చేయకపోవడంతో గిరిజనులు దాహార్తితో అల్లాడుతున్నారు.– టెక్కలి మండల కేంద్రంలో తాగునీరు లేదు. దీంతో వైఎస్సార్సీపీ, ఇతర దాతలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. – హిర మండలంలో పక్కనే వంశధార ఉన్నా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. చిన్నకోరాడ పంచాయతీలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అలికాం–బత్తిలి రోడ్డుపై రాస్తారోకో చేశారు.– ఆముదాల వలస శివారు గ్రామాలు పార్వతీశ్వరునిపేట, జగ్గుశాస్త్రులపేట, తిమ్మాపురంలో వారానికి ఒక్కరోజే తాగునీరు అందుతోంది.– పాతపట్నం మడలం రంకిణీ గిరిజన గూడెంలో బోర్లు లేవు. ఇంటింటికీ తాగునీరు ఇస్తామని పైపులైన్లు వేసి వదిలేశారు.బోర్లు.. భోరు భోరు!– ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం మేజర్ పంచాయతీ జోహరాపురానికి బాపురం రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వక్కిరేణిలోని బురద నీటినే గ్రామ ప్రజలు వినియోగిస్తున్నారు.– అమలాపురంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. గత ప్రభుత్వంలో రూ.20 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు మంజూరై పనులు మొదలైనా కూటమి ప్రభుత్వం వచ్చాక అటకెక్కించింది. అల్లవరం. ఉప్పగుప్తం, అమలాపురం రూరల్ మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. – కాట్రేనికోన శివారు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. బాహ్యప్రపంచానికి దూరంగా సముద్రతీరంలో ఉన్న మగసానితిప్పకు గత ప్రభుత్వంలో పైపులైన్ వేసి నీరు సరఫరా చేశారు. ఇప్పుడు నిర్వహణ సరిగా లేకపోవడంతో నీరు అందడం లేదు. పల్లం, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటి మొగ, చిర్రయానం, నీళ్లరేవు, చాకలిపేట, గొల్లపేటలో నీటి కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. కాట్రేనికోనలో 250 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలి. కాంట్రాక్టర్‌కు బకాయిలు పెండింగ్ ఉండటంతో చేతులెత్తేశారు. జలజీవన్ మిషన్ నిధులతో పైపులైన్లు వేసి, ట్యాంకులు నిర్మించినా నిర్వహణ లేక నీళ్లు అందడం లేదు. – జగ్గంపేట నియోజకవర్గం గోకవరం, గండేపల్లి, కిర్లంపూడిలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. – కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగితో పాటు శివారు ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. – పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలం బురుజుల గ్రామస్తులు మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. ఇతర అవసరాలకు సుద్దవాగు నుంచి ఫ్లోరైడ్ నీటిని తెచ్చుకుంటున్నారు. – ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురంలో ఎస్ఎస్ ట్యాంకును శుభ్రం చేస్తూ సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు ఈనెల 20న నీటి సంపులో పడి మృతిచెందాడు. సురేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను ఇవ్వాలని కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో 26 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. – శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ, రొళ్ల, మడకశిర, అమరాపురం, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, రొద్దం, పరిగి, ముదిగుబ్బ, పుట్టపర్తి, ఎన్పీ కుంట మండలాల్లో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు పలుమార్లు రోడ్డెక్కారు. జిల్లా నుంచి మంత్రులు సత్యకుమార్, సవిత ఉన్నా తాగునీటి పరిష్కారానికి చొరవ చూపలేదు. – వినుకొండ నియోజకవర్గం ఉప్పలపాడు, ములకలూరు, తలర్లపల్లి, మూర్తింజాపురం, జంగాలపల్లి, రావులాపురం, ఉప్పరపాలెంతో పాటు పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. వినుకొండలో నాలుగురోజులకు ఒకసారి తాగునీరు అందుతోంది. –వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామంలో తాగునీటి సమస్యతో స్థానికులు అల్లాడుతున్నారు. ఇటీవల అధికారులు నిర్వహించిన వన్‌మంత్..వన్‌విలేజ్.. ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాకే సభలు, సమావేశాలు చేపట్టాలని అధికారులను నిలదీశారు.– నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం సోమశిల, పడమటి కంభంపాడులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పైపులైన్ మరమ్మతులతో నీటిని విడుదల చేయకపోవడంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. – రాయచోటి నియోజకవర్గం చక్రాయపేట, రెడ్డివారిపల్లె, ఎర్రగుడిగ్రామం బీఎన్ తాండా లో తీవ్ర నీటి సమస్య ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సురభి హరినజవాడ, కల్లూరిపల్లె గ్రామం సిద్దావాండ్లపల్లె, కాట్లగుంటివారిపల్లెలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో బోర్లు వేయించి సమస్య పరిష్కరించారు. –ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం నియోజకవర్గంలో 22 గ్రామాలు, కనిగిరి నియోజవర్గంలో 18 గ్రామాల్లో, గిద్దలూరు పట్టణంతో పాటు 10 గ్రామాల్లో, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 20 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. – కనిగిరి మండంలో సాగర్ నీళ్లు 20 రోజులకు ఒకసారి వస్తుండడంతో రాత్రిపూట పడిగాపులు కాసి మహిళలు నీళ్లు పట్టుకుంటున్నారు.నాలుగు కి.మీ. వెళ్లాల్సిందే ...తాగునీటి కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలోని గూళ్యం, లేదా మూడు కిలోమీటర్ల దూరంలోని బళ్లూరుకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. గ్రామంలోని బోరు నీరు తాగేందుకు పనికిరాదు. సమీపంలోనే బాపురం రిజర్వాయర్ ఉన్నా మా గ్రామానికి నీటి సరఫరా కావడం లేదు. నిత్యం సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నాం. పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు. – బి.గాదిలింగప్ప, ఎంపీటీసీ, సిద్దాపురం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా పొలాల్లో నీళ్లే దిక్కు..ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలువాల ఎస్ఎస్ ట్యాంకు ద్వారా గతంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేశారు. వేసవిలో వారం పది రోజులకు ఒక సారి నీటిని విడుదల చేస్తే ఎలా? గ్రామంలోని బోరు నీటిని ఇతర అవసరాలకు వాడుకుంటు తాగునీటి కోసం సమీప పొలాల్లోని వ్యవసాయ బోర్లు, బావులపై ఆధారపడుతున్నాం. – తిమ్మగురుడు, గార్లదిన్నె, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా⇒ కుళాయిలో బురదనీరు వస్తున్న ఈ దృశ్యం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో ఆదివారం కనిపించింది. తాగునీటి సంగతి దేవుడెరుగు.. ఇంటి అవసరాలకు కూడా ఈ నీరు పనికిరాదు. పంచాయతీ పైపులైన్లు దెబ్బ తినడంతో ఈ దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో నీటి సరఫరా ఎంత అధ్వానంగా ఎలా ఉందో చెప్పేందుకు ఇదో మచ్చు తునక!⇒ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం కొనకండ్లలో 12 వేల మంది నివాసం ఉంటున్నారు. రోజూ 6 లక్షల లీటర్ల తాగునీరు అవసరం. కేవలం శ్రీసత్యసాయి వాటర్ స్కీం ద్వారా మాత్రమే నీరు అందుతోంది. ఈ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో 20 రోజులు సమ్మె చేశారు. దీంతో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడి గ్రామస్తులు ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారిపై రెండుసార్లు రాస్తారోకో చేశారు. చివరకు కలెక్టర్ జోక్యం చేసుకుని రెండు నెలల బకాయిలు ఇస్తామని చెప్పారు. అయినా నీటి సమస్య పరిష్కారం కాలేదు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా జరుగుతోంది. స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దారుణ పరిస్థితి ఇది! ఇక్కడే కాదు.. ఈ నియోజకవర్గంలోని విడపనకల్లు, కూడేరు మండలాల్లో కూడా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.⇒ కర్నూలు జిల్లాలో తాగునీటి ఎద్దడిని ముందుగానే అంచనా వేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 141 గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, బోర్ల హైరింగ్, ట్యాంకర్ల కోసం రూ.8.48 కోట్లు అవసరమని జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వేసవి ముగుస్తున్నా ప్రభుత్వం చలించలేదు. చివరకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఈ నెల మూడో వారంలో కేవలం రూ.50 లక్షలు విదిలించింది. దీంతో జిల్లాలో వందల గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు.⇒ నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో చాలా వీధులకు 20 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందిస్తున్నారు. వీరులపాడు మండలంలో 15 గ్రామాలకు వారానికి ఒకసారి కూడా తాగునీరు రావడం లేదు. నందిగామ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి! జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం, మక్కపేట, మంగోల్లు, మాచినేనిపాలెం, వత్సవాయి మోడల్ కాలనీ, కాకరవాయి గ్రామాలలో కూడా తీవ్ర మంచినీటి సమస్య ఉంది. చంద్రబాబు సర్కారుపై నమ్మకం లేక ప్రజలు డబ్బులు వెచ్చించి మంచినీటిని కొనుగోలు చేస్తున్నారు.⇒ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఓ రాజ్యసభ సభ్యుడి నిధులు, జడ్పీ నుంచి రూ.40 లక్షలు మంజూరు చేయించారు. సాంకేతిక, పాలన అనుమతులు కూడా వచ్చాయి. కానీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ‘క్రెడిట్’ దక్కుతుందనే దుగ్ధతో టీడీపీ ఇన్చార్జ్ ఎరిక్షన్‌బాబు అడ్డుపడ్డారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు. కొలుకుల, తిరుమలగిరి, వెంకటాద్రిపాలెం, వాదంపల్లి, పెద్దారవీడు మండలంలోని చెట్లమిట్ట, మద్దెలకట్ట, త్రిపురాంతకం పాత అన్న సముద్రం గ్రామాల్లో డీప్ బోర్లు మంజూరయ్యాయి. గురిజేపల్లి, బోయపల్లి ఎస్సీ కాలనీ, ఆర్ ఉమ్మడివరానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ చొరవ చూపి బోర్లు మంజూరు చేయించారు. అయినాకూడా టీడీపీ నేతలు ఈ బోర్లు వేయనివ్వడం లేదు. ఇక పుల్లలచెరువు మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. -
అగ్నికి ఆజ్యం.. ఎల్‌నినోకు ‘లూ’ గాలుల తోడు
సాక్షి, అమరావతి: ఎల్‌నినో పరిస్థితులకు తోడు ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వాయవ్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోకి వాయవ్య దిశ నుంచి తీవ్రమైన పొడి వేడి గాలులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఈ గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయానికి తీవ్రమైన వడగాలులుగా మారుతున్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే ఈ గాలుల్ని ‘లూ’ గాలులు అని పిలుస్తారు. ఇవి సముద్రం నుంచి కాకుండా పూర్తిగా భూమి మీదుగా ప్రయాణిస్తూ దారిలో ఉన్న తేమను పూర్తిగా లాగేసుకుంటున్నాయి. మన వద్దకు వచ్చేటప్పుడు తూర్పు కనుమలను దాటే సమయంలో ఈ గాలులు కిందకు దిగడంతో వాతావరణం మరింత వేడెక్కుతోంది. సైన్స్ పరిభాషలో దీన్ని కంప్రెషనల్ హీటింగ్గా పిలుస్తారు. చల్లని గాలుల్ని అడ్డుకుంటున్న వాయువ్య గాలులు పగటిపూట పశ్చిమ దిశ నుంచి వచ్చే ఈ తీవ్రమైన వేడి గాలుల వల్ల సముద్రం నుంచి వచ్చే సాధారణ చల్లటి గాలులు భూమి మీదకు రావడంలేదు. దీంతో తీరప్రాంతాల్లో గాలిలో తేమ 80 శాతానికిపైగా తగ్గిపోతోంది. ఫలితంగా విపరీతమైన ఉక్కపోత పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా వేసవి సీజన్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయి. వాటివల్ల వేసవి ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి అలాంటివేమీ లేకపోవడం, ఒక అల్పపీడనం ఏర్పడినా అది బంగ్లాదేశ్ వైపు వెళుతూ సముద్రంలోని చల్లని గాలుల్ని తీసుకుపోయింది. దీంతో మన ప్రాంతం మరింత వేడెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్న రోజులు వేడిసెగలే ఉండనున్నాయి. ఎల్‌నినోతో తలకిందులైన వాతావరణ చక్రం ప్రస్తుత ఎండల తీవ్రతకు ప్రధాన కారణం ఎల్‌నినో అని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినోగా పిలుస్తారు. ఈ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ఇంకా సూపర్ ఎల్‌నినో దశకు సముద్ర ఉష్ణోగ్రతలు చేరుకోకపోయినా అందుకు దారితీసే పరిస్థితులు ఏర్పడినట్లు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా మన వాతావరణ చక్రం తలకిందులైంది. నైరుతి ఆలస్యమే ఈ ప్రభావం నైరుతి రుతుపవనాలపైనా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి బలహీనంగా మారతాయని అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల కిందటే అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలడంలేదు. అవి అక్కడే నిలిచిపోవడంతో ఈ నెలాఖరుకు అవి కేరళను తాకడం అనుమానమే. దీంతో ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా అవి విస్తరించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉండదని ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. లూ గాలులు అంటే.. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే గాలుల్ని ‘లూ’ గాలులు అని పిలుస్తారు. -
ఎండలకు 40 మంది మృత్యువాత
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 40 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే శుక్రవారం రాత్రి, శనివారం వడదెబ్బతో 22 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మంది మృతిచెందారు. మహబూబాబాద్‌లోని ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలోని చింతచెట్టుపై ఉన్న వందలాది గబ్బిలాలు ఎండ త్రీవ్రతతో మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లాలో కురవి మండలం బలపాలకు చెందిన రొయ్యలపెద్దరాములు(75), బంగారుగూడెం తండా గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూడు జాన్వు(38), సీరోలు మండలం బీల్యానాయక్ తండాకు చెందిన బానోత్ కమ్లి(65), డోర్నకల్ యాదవనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ జానీమియా(43), గూడూరు మండల కేంద్రానికి చెందిన పెసరి వీరమల్లు (70) చనిపోయారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బండ చిన్నమల్లయ్య(90), కక్కిరాలపల్లికి చెందిన అలువాల నీలమ్మ(80), ఇదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శాంతమ్మ(90), ఎల్కతుర్తి మండలం పెంచికలపేటకు చెందిన దుగ్యాని కొమురయ్య(101), కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పొడేటి లచ్చమ్మ (82), పరకాల శ్రీనివాసకాలనీకి చెందిన టైలర్ వెల్దండి వెంకటేశ్వర్లు(48) చనిపోయారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన రోజువారీ కూలీ పెద్దమ్మ కుమారస్వామి (60), వరంగల్ 41వ డివిజన్ విశ్వనాథ కాలనీకి చెందిన నాయీబ్రహ్మణుడు సింగారపు కుమారస్వామి (45), రంగశాయిపేట కాపువాడకు చెందిన శెంకేశి భాగ్యలక్ష్మి(60), పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ, రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన చిన్నపాక యాకయ్య(50) మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దుర్గం అంకయ్య(65), కాటారం రేగులగూడెం జీపీ పరిధిలో భూయాన్ వినోద్(35), కాళేశ్వరంలో సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చిన గుర్తు తెలియని భక్తుడు(50) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడేనికి చెందిన హమాలీ కార్మికుడు గొడిశాల పరశురాములు(55), జనగామ అంబేడ్కర్ నగర్‌కు చెందిన యాచకురాలు జ్యోతి(58), ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రునిపేటకు చెందిన రైతు ఊటుకూరి సోమిరెడ్డి(78) వడదెబ్బతో మృతిచెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన దినసరి కూలీ ఫయాజ్ (52), సుల్తానాబాద్ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్‌రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్‌కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్‌కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్‌కు చెందిన ఎం.శంకర్(45), గోదావరిఖనిలోని మధుప్రియ హోటల్లో పనిచేస్తున్న వెల్దండి మహేశ్(52), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మీకురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన మంచాల నరసయ్య(75), మిట్టపల్లి శంకర్(48), కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన రామగిరి పుల్లమ్మ(78), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గోపాల్‌నగర్‌కు చెందిన సట్వే శంకర్(50), గణేశ్‌నగర్‌కు చెందిన ఎనుపోతుల బాబు(65) వడదెబ్బతో చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో... నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎర్రచెరువుతండాకు చెందిన రైతు ఆంగోతు యుగేంధర్(32), యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంకు చెందిన కార్పెంటర్ దేవరకొండ శంకరయ్యచారి(65), మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య(65), ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్‌కు చెందిన చెన్న హరికిషన్ (50) వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
సుర్రుమన్న సూరీడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 279 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో 44.5, కాకినాడ జిల్లా కరపలో 44.4, అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల వర్షం పడింది. రానున్న రెండు రోజులు కూడా తీవ్రమైన ఎండలు, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేడు తీవ్ర వడగాలులు వీచే మండలాలు ఇవే.. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ, హిరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
భగభగలు.. వడగాలులు
సాక్షి, హైదరాబాద్: వేసవి భగభగలు తీవ్రమవుతున్నాయి. ప్రస్తుతం సాధారణ స్థితిలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతుండగా రానురాను తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి మే మధ్య కాలాన్ని వేసవి సీజన్‌గా పరిగణిస్తాం. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి రెండో వారం నుంచే ప్రారంభమయ్యాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యనున్న చలికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనం కావడం, ఎక్కువ రోజులు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, దీనికితోడు చలి తీవ్రత కూడా అధికంగా ఉండగా ఈ ఏడాది వేసవిలో ఇదే తరహాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వేడితో కూడుకున్న రోజులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్చిలో తేలికపాటి వానలు... రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉన్నాయి. రానున్న మూడు రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ఈనెల రెండు, మూడో వారంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈనెలాఖరు నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా ఉంటుందని ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ఈ సీజన్లో గరిష్టంగా 44 నుంచి 46డిగ్రీ సెల్సియస్ మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అదేవిధంగా భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో వడగాలులు కూడా ఎక్కువ రోజులు వీస్తాయని, వాతావరణంలో నెలకొన్న మార్పులుతో అత్యంత చలి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా వేసవి సీజన్‌పై ప్రాథమిక అంచనాలను ఐఎండీ నేడో, రేపో విడుదల చేయనుంది. -
ముందస్తు భగభగలు!
సాక్షి, హైదరాబాద్: చలికాలం ముగిసింది. పది రోజుల ముందే రాష్ట్రంలో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోగా... వేసవి భగభగలు అప్పుడే మొదలయ్యాయి. సాధారణంగా రాష్ట్రంలో చలికాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ నెలలోనే చలి తీవ్రత అధికంగా నమోదు కాగా... డిసెంబర్లో తీవ్రస్థాయికి చేరింది. జనవరి నెలాఖరు వరకు తీవ్రత ఎక్కువగా ఉండగా... ఫిబ్రవరి రెండో వారం నుంచి చలి క్రమంగా తగ్గింది. ప్రస్తుతం పది రోజుల ముందే చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టగా... చిటపట ఎండలు నమోదవుతున్నాయి. రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. ఈనెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతుండటం గమనార్హం. వాతావరణంలో మార్పులతో... ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా సీజన్ మార్పును గమనించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని వాతావరణం వేగంగా మారుతోంది. ఉత్తర ప్రాంతం నుంచి చలి గాలుల తీవ్రత తగ్గింది. ప్రస్తుతం చలి తీవ్రంగా ఉండాల్సి ఉండగా... పొడి వాతావరణం నమోదవుతుండటంతో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫలితంగా పగటిపూట ఉక్కపోత అధికంగా నెలకొంటోంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సీజన్లు ముందుకు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో ముందస్తు వేసవి ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వేసవి సీజన్ అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 36.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 2 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
మండే ఎండ.. జాగ్రత్తలే అండ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాడ్పులు వణికిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఇంకా ఎక్కువ ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో.. వడదెబ్బ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఎండల్లో పనిచేసే కార్మికులు గంటకు 10 నిమిషాల చొప్పున నీడపట్టున చేరి విశ్రాంతి తీసుకోవడం మంచిదంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉ.11 గంటల నుంచి సాయంత్రం వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది రాష్ట్రంలో 4,422.. అంతకుముందు ఏడాది 833 చొప్పున వడదెబ్బ కేసులు నమోదయ్యాయి.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..– ఎక్కువ సమయం ఏసీలో ఉండి ఒక్కసారిగా ఎండలోకి రాకూడదు. అదే విధంగా 40 డిగ్రీల ఎండలో తిరిగి ఒకేసారి 18 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ఏసీ గదుల్లోకి వెళ్లకూడదు. – వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. – ఎండలో తిరగాల్సిన పరిస్థితి వస్తే గొడుగు, టోపీ, హెల్మెట్ వాడాలి. – పిల్లలను ఎండలో ఆడుకోనివ్వకుండా, ఇండోర్ ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఇంట్లోకి వడగాలులు రాకుండా కిటికీలకు కర్టెన్లు వాడాలి.– దాహం తీర్చుకోవడానికి శీతల పానీయాలు తాగుతుంటారు. ఇలాచేస్తే మరింత దాహం పెరుగుతుంది. వీటికి బదులు మజ్జిగా, కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగడం ఉత్తమం. – శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేట్ శీతల పానీయాలు తాగకూడదు. అలాగే, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహార పదార్థాలు తినకూడదు.వడదెబ్బకు గురైతే చేయాల్సినవి..– వడదెబ్బకు గురైన బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స అందించాలి.– బాధితుడిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి.– బట్టలు వదులు చేసి, చల్లటి నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది.– గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా బాధితుడిని ఆస్పత్రికి తరలించాలి.రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి..శరీరం డీహైడ్రేడ్ కాకుండా జాగ్రత్తపడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల పైబడినా, ఐదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం.. చర్మం పొడిబారి వదులుగా మారడం, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలు వేడి, చలిని తట్టుకోలేరు కాబట్టి తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భిణులు, వృద్ధులు ఎండలేని సమయంలోనే బయటకెళ్లాలి. – డాక్టర్ పి. ప్రసాద్, మెడికల్ ఆఫీసర్, కాకుమాను, గుంటూరు జిల్లా -
Green Roof : మండుటెండల్లో రేకుల ఇల్లు కూడా చల్లచల్లగా..!
వేసవిలో మండే ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఎగువ మధ్యతరగతి, ధనికులైతే ఇళ్లలో ఏసీలు పెట్టుకొని సేదతీరుతుంటారు... మరి నగరాల్లోని బస్తీలు, మురికివాడల్లో రేకుల ఇళ్లలో నివసించే పేదల పరిస్థితి ఏమిటి? పైకప్పుల నుంచి లోపలికి వచ్చే వేడికి తాళలేక, నిద్ర పట్టక వారు విలవిల్లాడా ల్సిందేనా? ఈ ప్రశ్నకు వినూత్న ప్రయోగాలు చవకైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. భూతాపం ఏటేటా పెరిగిపోతున్న ఈ కాలంలో పేదల ఇళ్లను చల్లబరిచే పనిని విస్తృతంగా వ్యాప్తిలోకి తేవడానికి జూన్ 6న ‘వరల్డ్ గ్రీన్ రూఫ్ డే’ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. (బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలోని ఓ మురికివాడ (ఫావెల్)లో లూయిస్ కాసియానో తన అస్బెస్టాస్ రేకుల ఇంటిపై స్వయంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ రూఫ్ (ఏరియల్ వ్యూ)) జూన్ 6 వరల్డ్ గ్రీన్ రూఫ్ డే పై ఫొటోలో తన ఆకుపచ్చని ఇంటి పైకప్పుపై కూర్చున్న వ్యక్తి పేరు లూయిస్ కాసియానో (53). బ్రెజిల్‌లోని రియో డి జెనీరో మహానగరంలో పార్క్యు అరర అనే మురికివాడలో ఆస్బెస్టాస్ సిమెంటు రేకుల ఇంట్లో 85 ఏళ్ల తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. వేసవిలో అక్కడ పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్షియస్ దాటిపోతూ ఉంటుంది. ‘ఇటుకలు పగలు వేడిని పీల్చుకొని రాత్రుళ్లు వదులుతూ ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలయ్యే వరకు ఇల్లు చల్లబడేది కాదు. చెమటలు ఆగేవి కాదు. నిద్రపట్టేది కాదు. (మురికివాడలో ఇరుకైన రేకుల ఇళ్ల మధ్య 50 డిగ్రీల సెల్షియస్ ఎండలోనూ మొక్కలతో పచ్చగా లూయిస్ కాసియానో ఇల్లు. పైపు డ్రిప్ ద్వారా ఈ మొక్కలకు తగుమాత్రంగా నీరు ఇస్తూ లూయిస్ పరిరక్షించుకుంటున్నారు.) భరించలేనంత వేడిగా ఉండేది..’అని పదేళ్ల క్రితం పరిస్థితిని కాసియానో గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన స్వయంగా తన ఇంటిపై గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవటంతో పరిస్థితి సానుకూలంగా మారిపోయింది. 2012లో రేకుల ఏటవాలు పైకప్పు మీద మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాక ఇల్లు చల్లబడింది. ‘ఇరుగు పొరుగు ఇళ్లకన్నా మా ఇల్లు 15 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటోంది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా కొన్ని గంటలు లేకపోయినా ఇంట్లో ఉండగలుగుతున్నాం’అని కాసియానో చెప్పారు. (లూయిస్ కాసియానో రేకుల ఇంటి పైకప్పుపై మొక్కల్ని పెంచుతున్నది ఇలా) రియో డి జెనీరో యూనివర్సిటీలో గ్రీన్రూఫ్స్పై పరిశోధన చేస్తున్న బ్రూనో రెసెండో సహకారంతో కాసియానో తన ఇంటిపై ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలను రీసైకిల్ చేసి తీసిన తేలికపాటి పాలిస్టర్ నాన్‌ఓవెన్ జియోటెక్స్‌టైల్ పరదాను పరచి, మట్టి పోసి తీవ్ర ఎండలను సైతం తట్టుకొనే మొక్కలను పెంచుతున్నారు. గ్రీన్‌రూఫ్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరీ ఆయన ప్రచారం చేస్తున్నారు. గ్రీన్‌రూఫ్‌లు.. కొన్ని ప్రయోగాలు ముంబై, బెంగళూరులలో సీబ్యాలెన్స్, హసిరుదల వంటి స్వచ్ఛంద సంస్థలు ఇళ్ల పైకప్పులపై వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటి పైకప్పు మీద నీలిరంగు టార్పాలిన్‌పై నీరు నింపిన ప్లాస్టిక్ సీసాలను సీబ్యాలెన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సీసాల్లోని నీరు ఉష్ణోగ్రతను గ్రహించడం వల్ల ఆ మేరకు ఇల్లు తక్కువగా వేడెక్కుతుందని ఆ సంస్థ చెబుతోంది. రేకుల ఇంటిపై నీలిరంగు ప్యానెళ్లను అమర్చడం ద్వారా కూడా వేడిని తగ్గించవచ్చు. రేకుల ఇంటిపై తెల్ల టి ‘ఎకోబోర్డ్ పేనల్స్’ను పరచి అధిక ఉష్ణోగ్రత నుంచి కొంత మేరకు రక్షణ పొందొచ్చు. రేకుల ఇంటిపై అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి.. దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఉపాయం సత్ఫలితాలిస్తున్నట్లు సీబ్యాలెన్స్ సంస్థ చెబుతోంది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటిపై ఎకోబోర్డ్ ప్యానల్స్‌ను పరచి అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రయత్నం) మొండి మొక్కలతో కూల్‌కూల్‌గా.. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఇళ్ల పైకప్పులను చల్లగా ఉంచే కొన్ని మొండి జాతుల మొక్కలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ పుణేలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఆర్ఐ) ఇటీవల గుర్తించింది. పశ్చిమ కనుమల్లో కనుగొన్న 62 రకాల మొండి జాతి మొక్కలు 95% తేమను కోల్పోయినా చనిపోవని, తిరిగి తేమ తగిలినప్పుడు చిగురిస్తాయని తెలిపింది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో ఓ రేకుల ఇంటిపైన అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి, దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం) నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే రేకులు, శ్లాబ్ ఇళ్ల పైకప్పులపై ఈ జాతులను పెంచితే స్వల్ప ఖర్చుతోనే గ్రీన్‌రూఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందిస్తే ఎంత ఎండైనా ఇవి పచ్చగానే పెరిగే అవకాశం ఉంది. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’?.. ఎందుకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు?
మహారాష్ట్రలోని నవీ ముంబై శివార్లలో భారీ సభ.. లక్షల్లో జనాలు వచ్చారు.. ఎండాకాలమే అయినా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఏమీ లేదు.. అయినా వడదెబ్బ తగిలి ఏకంగా 14 మంది చనిపోయారు. అధిక ఉష్ణోగ్రతకు మరికొన్ని వాతావరణ అంశాలు తోడుకావడమే దీనికి కారణం. అందుకే కేవలం ఉష్ణోగ్రతను కాకుండా.. ‘హీట్ ఇండెక్స్’ను పరిగణనలోకి తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్ణయించింది. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండవచ్చన్న అంచనాలతో కలర్ కోడింగ్ మ్యాప్‌లనూ విడుదల చేస్తోంది. మరీ ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? దీనితో ఏమిటి లాభం? వంటి వివరాలు తెలుసుకుందామా.. ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ కలిస్తే.. ఎప్పుడైనా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కాస్త వేడిగా అనిపిస్తుంది. కానీ దీంతోపాటు వాతావరణంలో నీటిఆవిరి శాతం (రిలేటివ్ హ్యూమిడిటీ) కూడా పెరిగితే.. వేడికి తోడు ఉక్కపోత మొదలవుతుంది. ఆచోట నీడ లేకపోయినా, గాలివీయకపోయినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. విపరీతంగా చెమటపడుతుంది. అప్పటికీ ఎండ/వేడిలో నే ఉంటే శరీరంలో డీహైడ్రేషన్ మొదలవుతుంది. ఒకదశలో ఊపిరి తీసుకోలేక, స్పృహ తప్పే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి ఏమిటి సంబంధం? మామూలుగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే.. అందుకు తగినట్టుగా గాలి, నీరు వేడెక్కుతూ ఉంటాయి. వేడెక్కిన నీరు వేగంగా ఆవిరి అవుతూ గాలిలో హ్యూమిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు ఎండ, వేడి గాలి కారణంగా మన శరీరం వేడెక్కి చెమటపడుతుంది. మామూలుగా అయితే చెమట ఆరినకొద్దీ శరీరం చల్లబడుతుంది. కానీ వాతావరణంలో అప్పటికే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటంతో చెమట ఆరక.. శరీరం వేడెక్కిపోతూనే ఉంటుంది. ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం చూపి.. అస్వస్థతకు గురవుతారు. ఎంత ఉష్ణోగ్రతకు, ఎంత హ్యూమిడిటీ ఉంటే.. ఏంటి పరిస్థితి? - ఒక్కో స్థాయిలో ఉష్ణోగ్రతకు, ఒక్కోస్థాయి వరకు హ్యూమిడి టీ ఉంటే ఇబ్బందిగా ఉండదు. అవి పరిమితి దాటితే సమస్యగా మారుతుంది. - 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, 40% వరకు హ్యూమిడిటీ ఉంటే వాతావరణం హాయి గా ఉన్నట్టు. ఈ పరిస్థితిని మన శరీరం సులువుగా తట్టుకోగలుగుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. - ఈ ఉష్ణోగ్రతలు, హ్యూమిడిటీకి తోడు నేరుగా ఎండలో ఉండటం, వడగాడ్పులు వంటివి కూడా ఉంటే హీట్ ఇండెక్స్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఏమిటి దీనితో ప్రయోజనం? ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లినా తొలుత బాగానే అనిపిస్తుంది. కానీ కాసేపటికే ఇతర అంశాల ప్రభావంతో ఇబ్బందిగా మారుతుంది. అదే ‘హీట్ ఇండెక్స్’తో పరిస్థితి ఎలా ఉందన్నది తెలిస్తే.. ముందు జాగ్రత్త పడొచ్చు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుంది. ఉదాహరణకు ఢిల్లీ, విశాఖపట్నం రెండు చోట్లా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఢిల్లీలో 40%, విశాఖలో 50% హ్యూమిడిటీ ఉంటే.. ఢిల్లీలో పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ విశాఖలో మాత్రం ఉక్కపోత, వేడి తీవ్రత ఎక్కువ. ఇప్పటికే ‘ఫీల్స్ లైక్’పేరిట.. ఉష్ణోగ్రత, ఇతర అంశాలను కలిపాక.. వాతావరణం ఎంత వేడిగా ఉన్నట్టు అనుభూతి కలుగుతుందనే దాన్ని ‘ఫీల్స్ లైక్’, ‘రియల్ ఫీల్’వంటి పేర్లతో సూచిస్తుంటారు. ఇప్పటికే పలు ప్రైవేటు వాతావరణ సంస్థలు దీనిని అమలు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోని వెదర్ యాప్స్‌లో కూడా ఈ హీట్ ఇండెక్స్ అంచనాలను చూడవచ్చు. - ఉష్ణోగ్రత, హ్యూమిడిటీతోపాటు మేఘాలు ఆవరించి ఉండటం, గాలి వీచే వేగం, సదరు ప్రాంతం ఎత్తు, సమీపంలో భారీ జల వనరులు ఉండటం, తీర ప్రాంతాలు కావడం, వర్షాలు కురవడం వంటివాటిని బట్టి హీట్ ఇండెక్స్ మారే అవకాశం ఉంటుంది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా ‘హీట్ ఇండెక్స్’ను నిర్ధారించాల్సి ఉంటుంది. ‘హీట్ ఇండెక్స్’ఏ రోజుకారోజు, ఉదయం నుంచి రాత్రి వరకు సమయాన్ని బట్టి మారుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్. ఇది కూడా చదవండి: అవసరం అయితేనే బయటకు రండి.. రాత్రిపూట కూడా పెరగనున్న ఉష్ణోగ్రతలు -
నిప్పుల కొలిమి.. తీవ్రమైన వేడి ప్రాంతంగా రాష్ట్రంలోని ఆ జిల్లాలు
సాక్షి, అమరావతి: భానుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాల్లోనూ (శ్రీ సత్యసాయి మినహా) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే ఎండ మండిపోయింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడ ఎండ తీవ్రతను అంచనా వేయవచ్చు. మన్యం ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణా జిల్లా కొండూరులో 46, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.9, పల్నాడు జిల్లా రావిపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021, 22 సంవత్సరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటలేదు. 45 డిగ్రీలకు చేరుకున్నా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఈ సంవత్సరం 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, మెజారిటీ ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. వచ్చే రెండు రోజులు మరింత తీవ్రం వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాలు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువగా నీరు తాగాలి ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోయి హెపటైటిస్–బి వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పనిచేసే వారు ఎక్కువగా నీటితో పాటు పళ్లరసాలు, బార్లీ, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ఎండలో పనిచేసేవారిలో విపరీతమైన నీరసం, తలనొప్పి, పిక్కలు పట్టేయడం, తల విసిరేయడం వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలి. వారు నీడలోకి చేరి నీరు ఎక్కువగా తీసుకుని సేదతీరాలి. కళ్లకు ఇబ్బందులు రాకుండా నల్ల కళ్లద్దాలు వాడాలి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటలు వరకు ప్రయాణాలు చేయకూడదు. – డాక్టర్ వడ్డాది సురేష్, ఎండీ, రాజమహేంద్రవరం. వడదెబ్బకు ప్రకాశంలో నలుగురు మృతి ఒంగోలు: ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై సోమవారం ప్రకాశం జిల్లాలో నలుగురు మృతిచెందారు. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన సాబినేని సుబ్బమ్మ (56), పాపిశెట్టి సూరిబాబు(57), పొందూరి సుబ్బరామిరెడ్డి (68), సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన కొట్టే పేరమ్మ(65) వడదెబ్బకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత.. ఉదయం 6 గంటలకే మొదలవుతున్న ఎండ వేడి సాయంత్రం 6 గంటలు దాటినా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 డిగ్రీలు, 2, 3 గంటల సమయానికి 44 నుంచి 46 డిగ్రీలకు పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 30 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
‘సెగ’దరగ.. ఇదేం భగభగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మరింతగా మండనున్నాయి. ఈ నెల మొదటి వారమంతా ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతుండగా రానున్న మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో 42–44 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా అదే జిల్లాలోని జన్నారంలో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికం... వేసవి సీజన్ చివరి దశలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని, ప్రస్తుతం సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల మధ్య హెచ్చుతగ్గులుంటాయని ఐఎండీ అధికారులు వివరిస్తున్నారు. ఆదివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. అలాగే నల్లగొండ, భద్రాచలంలో సాధారణంకంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండటంతో దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బలహీన పడుతున్న ‘మోక’ అతి తీవ్ర తుపానుగా కొనసాగిన ‘మోకా’తుపాను మయన్నార్ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటడంతో బలహీనపడుతుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది. -
ఎల్లుండి నుంచి మళ్లీ మంటలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మారిన వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించింది. ఈనెల 8వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 6న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 7వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనావేసింది. ఇది ఈనెల 8న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం రాష్ట్రంలో.. గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. -
ఇక ఎండలు మండవు
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. తీవ్రమైన ఎండలు తగ్గిపోయి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అప్పటివరకు మోస్తరు వర్షాలతోపాటు అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం, ఆగ్నేయ/నైరుతి గాలుల వల్ల వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు కురుస్తున్నాయి. గత మూడేళ్లుగా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదైనా మధ్యలో 2, 3 రోజులు అకాల వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత మే నాటికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలలోపే నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మూడోవారం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడోవారం చివర్లో వర్షాలు మొదలవడంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే రకరమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. మే 9, 12 తేదీల మధ్య బంగాళాఖాతంలో అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది మయన్మార్ వైపు వెళ్లినా ఇక్కడి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్నిబట్టి మే రెండోవారం కూడా వాతావరణం ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఒకటి, రెండురోజులు ఎండలు పెరిగినా వర్షాలు మాత్రం కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీవర్షం ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు భారీవర్షం కురిసింది. సగటున కర్నూలు జిల్లాలో 27 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లాలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కల్లూరు, కర్నూలు, గోనెగండ్ల తదితర మండలాలు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, బేతంచెర్ల, పాణ్యం, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల్లో ఒక్కరోజు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆస్పరి, కొత్తపల్లి, పెద్దకడుబూరు మండలాల్లో పిడుగులు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామంలో పిడుగుపడటంతో 13 జీవాలు మరణించాయి. ఎమ్మిగనూరు మండలంలో 108.2 మిల్లీమీటర్లు, బనగానపల్లిలో 88, బేతంంచెర్లలో 75.2, కల్లూరులో 70.4, గోనెగండ్లలో 65, పాణ్యంలో 62.4, పగిడ్యాలలో 60.8, కర్నూలు అర్బన్‌లో 54.6, కర్నూలు రూరల్‌లో 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు. వారిలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఒక ఉపాధి కూలీ ఉన్నారు. ఎండల తీవ్రతకు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. వరి కోత యంత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. వేసవి ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం... ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించినా సంబంధిత శాఖలు మాత్రం దీనిపై పెద్దగా దృష్టిపెట్టడంలేదన్న ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించడంతోపాటు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇవేవీ పెద్దగా అమలు కావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను పట్టించుకొనే పరిస్థితి కనిపించట్లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలుకావడంలేదని ప్రజలు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఎంత ఎండకు ఏ అలర్ట్? ► రెడ్ అలర్ట్ (సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు ఉంటే జారీ చేసేది) ► ఆరెంజ్ అలర్ట్ (సాధారణం కంటే 4–5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే) ► ఎల్లో అలర్ట్ (హీట్‌వేవ్ వార్నింగ్. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కాస్త ఎక్కువ నమోదైతే) ► వైట్ అలర్ట్ (సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే జారీ చేసేది) ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► తరచూ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి. ► తెలుపు, లేతవర్ణంగల పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. ► తలకు వేడి తగలకుండా టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. ► వడదెబ్బ తగిలిన వారిని నీడలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడిగుడ్డతో తుడవాలి. ► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ► వడగాడ్పులు వీస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు యాజమాన్యాలు నీడ కల్పించాలి. తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ► ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. ► బస్టాండ్లలో, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలి. -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు...
-
భానుడి ఉగ్రరూపం: భవిష్యత్తులో సమ్మర్లో చుక్కలే..!
తిరువనంతపురం: భారత్‌లో రానున్న సంవత్సరాలలో వేసవి ఉగ్రరూపం చూపిస్తుందని వరల్డ్ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. ముందస్తుగా వేసవి కాలం రావడంతో పాటు వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగి ప్రమాదకరంగా మారుతాయని తెలిపింది. ప్రపంచంలో వేసవి తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, వడగాడ్పులకు వేలాది మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. ‘‘క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్’’ అన్న పేరుతో వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను రూపొందించింది. కేరళ ప్రభుత్వ భాగస్వామ్యంతో తిరువనంతపురంలో వరల్డ్ బ్యాంకు రెండు రోజులు నిర్వహించనున్న భారత వాతావరణం, అభివృద్ధి భాగస్వామ్యుల సదస్సులో ఈ నివేదికను విడుదల చేయనుంది. ఈ సారి వేసవి ముందస్తుగా రావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగుతుందని, ప్రజల ఆయుష్షు పరిమితిని తగ్గించే అవకాశం ఉందని, ఆర్థికంగా సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. భారత్‌లో పని చేసే వర్గంలో 75% మంది అంటే దాదాపుగా 38 కోట్లమంది మండుటెండల్లో చెమటోడుస్తూ పని చేస్తారని, వారందరి ప్రాణాలకు వడగాడ్పులు ముప్పుగా మారుతాయని నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వడగాడ్పుల వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, వారిలో 3.4 కోట్ల మంది భారత్‌లో ఉంటారని బ్యాంక్ అంచనా వేసింది. ఇదీ చదవండి: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్ -
ఎండలు ‘మండే’న్
సాక్షి, అమరావతి: భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నందలూరు, పెనగలూరు, చిట్వేల్, ప్రకాశం జిల్లా దోర్నాలలో 43.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా కల్లూరు, వెల్దుర్తి, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి అర్బన్‌లో 43.1 డిగ్రీలు, కర్నూలు, కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పుల్లల చెరువు, ముండ్లమూరులో 43 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 42.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 42.8, కర్నూలు జిల్లా పాణ్యం, బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 42.6, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రకాశం జిల్లా తర్లపాడులో 42.5, చిత్తూరు జిల్లా చిత్తూరు, గుడిపలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 152 మండలాల్లో తీవ్రమైన వేడి రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా.. 514 మండలాల్లో సోమవారం బాగా వేడి వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 152 మండలాల్లో మాత్రం తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోత వాతావరణంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళ, బుధవారాలు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి. వడదెబ్బకు ఇద్దరు మృతి నారాయణవనం (తిరుపతి): తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక కోమటి బజారువీధికి చెందిన దొరస్వామి కుమారుడు ప్రేమ్(12) ఆదివారం వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. అరుణానది సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను సేకరిస్తున్న పళనిస్వామి (47) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. -
Summer 2021: 'ఎండ' ప్రచండం
రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులతో నిప్పుల వాన కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం 111 మండలాల్లో, రానున్న 48 గంటల్లో 12 మండలాల్లో వడగాడ్పులు సెగలు పుట్టించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే వేసవి సెగ పుట్టిస్తోంది. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పటి నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవైపు తేమ గాలులు, మరోవైపు ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది తదుపరి 24 గంటల్లో ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా.. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో సూర్యుడు నిప్పుల వాన కురిపించనున్నాడని పేర్కొంది. మంగళవారం అనేక మండలాల్లో సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు, రేపు (బుధవారం) సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని హెచ్చరించింది. మంగళవారం రాష్ట్రంలోని 111 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 80 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమవారం మొత్తం 42 మండలాల్లో వడగాడ్పులు వీచాయని అధికారులు వివరించారు. 31న తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉండే మండలాలు.. గరుగుబిల్లి (విజయనగరం), కొయ్యూరు (విశాఖపట్నం), గొలుగొండ (విశాఖపట్నం), అడ్డతీగల (తూర్పుగోదావరి), రాజవొమ్మంగి (తూ.గో), నెల్లిపాక (తూ.గో), కూనవరం (తూ.గో), చింతూరు (తూ.గో), వేలేరుపాడు (ప.గో), కంచికచర్ల (కృష్ణా), వీరులపాడు (కృష్ణా), ఇబ్రహీంపట్నం (కృష్ణా). -
మార్చిలోనే మంటలు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ వేసవి అధిక ఉష్ణతాపాన్ని వెదజల్లనుంది. అంతేకాదు ఈ ఏడాది ముందుగానే భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరగనుంది. తీవ్ర వడగాడ్పులకూ అవకాశం ఉంది. ఇదే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి వేసవి సెగలు మొదలవుతాయి. ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరు నుంచే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇవి మున్ముందు మరింత ఉధృతం కానున్నాయి. మార్చి నుంచి మే వరకు కొంకణ్, గోవాలతో పాటు కోస్తాంధ్రలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశాలో ఉష్ణతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దాని ప్రభావం కోస్తాంధ్రలోనూ అధికంగా ఉండనుంది. ఈ వేసవి ఎందుకిలా..? ఏటా ఉత్తర భారత దేశంలో మార్చి ఆఖరి వరకు పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) చురుగ్గా ఉంటూ ప్రభావం చూపుతాయి. దీంతో ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణతీవ్రతను తగ్గిస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అవి చురుకుదనాన్ని తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆకాశంలో మేఘాలేర్పడకుండా నిర్మలంగా ఉండడం ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతోంది. మరోవైపు సముద్రం నుంచి నైరుతి, దక్షిణ గాలులు కూడా ప్రస్తుతం రావడం లేదు. ఈ గాలులొస్తే చల్లదనాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ ఆటంకాల చురుకుదనం తగ్గడం, సముద్ర గాలులు రాకపోవడంతో ముందుగానే వేసవి తాపం పెరగడానికి కారణమవుతోందని ఐఎండీ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ‘వాస్తవానికి మే నుంచి సముద్ర గాలుల రాక తగ్గుతుంది. కానీ ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచే చల్లగాలులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో సాధారణం కంటే 2–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు, అక్కడక్కడ తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన వివరించారు. మొదలైన వేసవి తాపం.. ఇప్పటికే రాష్ట్రంలో వేసవి తాపం కనిపిస్తోంది. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తునిలో 38 (+3.5), నందిగామ 37 (+1), మచిలీపట్నం 34.4 (+2), కాకినాడ 34 (+1.2), నర్సాపురం 33.6 (+1.3) కళింగపట్నం 33 (+1.4), బాపట్ల (+1), విశాఖపట్నం 32.3 (+2) డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పలుచోట్ల నాలుగు రోజుల క్రితమే ప్రస్తుత ఉష్ణోగ్రతలకంటే అధికంగా నమోదు కావడం విశేషం. -
ఆంధ్రప్రదేశ్ : నిప్పుల గుండం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/ తాడేపల్లి రూరల్(మంగళగిరి): భగభగ మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అనేకచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఒకవైపు భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోగా.. దీనికితోడు అగ్నికీలల్లా వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈసీజన్లో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య వంద దాటినట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. ఒక్క శుక్రవారమే 28 మంది వడదెబ్బ వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఈ వేసవిలో ఏడుగురు వడదెబ్బ వల్ల చనిపోయినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: తెలంగాణ.. నిప్పుల కొలిమి..!) సెగలు.. సెగలు.. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే కొద్దిసేపటికే ఒళ్లంతా చెమటతో తడిసిపోయి కళ్లు బైర్లు కమ్మి పడిపోయేలా పరిస్థితి తయారైంది.ఇళ్లల్లోనూ తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో సైతం ఏసీనో ఎయిర్ కూలరో లేకపోతే ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితి. ఇళ్ల దగ్గర కుళాయి తిప్పితే నీరు సలసలమంటూ పొగలు కక్కుతూ వస్తోంది. రాత్రి పది పదకొండు గంటలు దాటినా ఇళ్ల పైనున్న ట్యాంకుల్లోని నీరు చల్లబడటం లేదు. కుంటలు, చెరువుల్లోని నీళ్లు కూడా కాలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూరీడి ప్రతాపానికి జనమే కాదు జంతు జీవాలు, పక్షులు, జలచరాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో చనిపోతున్నాయని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇదేవిధంగా కొనసాగుతుందన్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో 18 మండలాల్లో 44 – 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం కూడా వడగాడ్పుల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. వడదెబ్బకు 28 మంది మృతి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బకు 28 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో 7 మంది, వైఎస్సార్ జిల్లాలో నలుగురు, విశాఖ జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ప్రాణాలు కోల్పోతున్న పశువులు ఎండకు తట్టుకోలేక పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వేడి నుంచి రక్షణ కోసం రైతులు తమ ఇళ్లలోని పాడిగేదెలు, ఆవులను మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చల్లని నీటితో తడుపుతున్నారు. అడవుల్లో సైతం నీరు దొరక్క జంతువులు, పక్షలు అలమటిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ కొంత వరకూ జంతువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేసినా అవి చాలడంలేదు. తక్షణమే చికిత్స చేయించకపోతే చావే.. పొలాల్లో ఒంటరిగా పనులు చేస్తున్నవారు, ఎండలో బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురైతే ఎవరైనా వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఉష్ణతాపం వల్ల మనిషి శరీరం నుంచి చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల సోడియం, పొటాషియం నిల్వల్లో మార్పులు వస్తాయి. వీటి దామాషా పడిపోవడంవల్ల మనిషి శరీరం వేడిని నియంత్రించే శక్తిని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, పొటాషియం, ఇతర లవణాలు తగుమోతాదులో లేకపోవడంవల్ల మనిషి వడదెబ్బకు గురవుతారు. కాగా ప్రస్తుత వేసవిలో ఇప్పటికే వంద మందిపైగా వడదెబ్బవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలు వస్తుంటే పదుల సంఖ్యలోనే ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారితో ‘సాక్షి’ ప్రస్తావించగా.. ‘గుండె సంబంధిత సమస్యలున్న వారు వడగాడ్పులకు తట్టుకోలేరు. ఇలాంటి వారికి వెంటనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ మరణాలను అధికారులు గుండెపోటుగానే పరిగణిస్తారేగానీ వడదెబ్బ మృతులుగా గుర్తించరు. అందువల్లే వడదెబ్బ మరణాల నిర్ధారించే ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికలో ఈ సంఖ్య తక్కువగా ఉంటోంది’ అని వివరించారు. గుండె సమస్యలున్న వారు వీలైనంత వరకు ఎండలో బయట తిరగరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి తెలిపారు. వడదెబ్బ లక్షణాలు - రోజుకు ఐదారుసార్లు కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం. - జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటం. - అయిదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం, నాలుక పిడచగట్టుకుపోయినట్లు తడారిపోవడం. - పాక్షిక లేదా పూర్తి ఆపస్మారకస్థితిలోకి వెల్లడం. - పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు ఎక్కువ వేడిగా ఉండటం. వడదెబ్బ తగిలితే ఈ లక్షణాలన్నీ ఉండాలని కాదు. వీటిలో ఏ లక్షణాలు కనిపించినప్పటికీ వైద్యులను సంప్రదించి వైద్యం చేయించాలి. వడదెబ్బకు గురైన వారిని బాగా గాలి తగిలేలా నీడలో పరుండబెట్టి చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో శరీరమంతా తుడవాలి. దీనివల్ల ఉష్ణోగ్రత తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కపర్థి సూచించారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు, గుండెజబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. – ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధ్యమైనంత వరకూ ఎండలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. – తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంతోపాటు హృదయ భాగంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. – శరీరానికి బాగా గాలి తగిలేలా వదులుగా ఉన్న తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. – రోజుకు కనీసం మూడు నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. ప్రతి అరగంటకొకసారి నీరు తాగుతూ ఉండాలి. – ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మ రసం, ఉప్పు కలిపిన చల్లని నీరు లేదా, మజ్జిగ, కొబ్బరి నీరు తాగడంవల్ల మేలు కలుగుతుంది. – ఎలక్ట్రాల్ పౌడర్ దగ్గర ఉంచుకుని ఏమాత్రం బడలికగా ఉన్నా నీటిలో కలుపుకుని తాగాలి. దీనివల్ల చెమట రూపంలో వెళ్లిన లవణాల స్థానే శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం లభిస్తాయి. – చివరి అంతస్తుల్లో ఉన్న ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. కిటికీలకు వట్టి వేళ్లు, గోనెసంచులు వేసి వాటికి నీరు చల్లడం ద్వారా కొంత వరకూ గది వేడిని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. రానున్న 5 రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం వివిధ జిల్లాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. మే 11వ తేదీ: 46 – 47 డిగ్రీలు – ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 43 – 45 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ అనంతపురంలలో కొన్ని ప్రదేశాలు 39 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 12వ తేదీ: 45 – 46 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 42 – 44 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 39 – 41 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 13వ తేదీ: 43 – 44 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 40 డిగ్రీలు – విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 14వ తేదీ: 43 – 44 డిగ్రీలు – గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 37 – 39 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 15వ తేదీ: 43 – 44 డిగ్రీలు – ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 39 డిగ్రీలు – విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రదేశాలు వడగాడ్పులు.. వర్షాలు రాష్ట్రంలో విభిన్న వాతావరణం రాష్ట్రంలో ఒకపక్క వడగాడ్పులు, మరోపక్క తేలికపాటి వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోపక్క ఒడిశా నుంచి కొమరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు శనివారం కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. -
మార్చిలోనే మంటలు
ప్రచండ భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తన తడాఖా చూపుతున్నాడు. ఎండలతో జనాలను ఠారెత్తిస్తున్నాడు. హైదరాబాద్‌లో 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్ మహారణ్యం కారణంగా ఇప్పుడు అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ఇండెక్స్ (యూవీ) సూచీ ‘పది’పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మార్చిలోనే పది మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచీ 12 పాయింట్లకు చేరే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల కారణంగా సూర్యుడి నుంచి వెలువడిన ఉష్ణం భూ ఉపరితల వాతావరణానికే పరిమితం అవుతోంది. ఫలితంగా మార్చి నెలల్లో వికిరణ తీవ్రత పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ యూవీ ఇండెక్స్ అంటే.. రోజులో ఏదైనా ప్రాంతంలో, సమయంలో మానవ చర్మం మంటపుట్టించే అతినీల లోహిత కిరణాల తీవ్రతను (వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద) యూవీ ఇండెక్స్‌గా పరిగణిస్తారు. సూచీ తీవ్రత పెరిగిన కొద్దీ చర్మంపై యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూవీ ఇండెక్స్ 6 ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎండలో 30 నిమిషాల పాటు నిలబడితే అతడికి సన్‌బర్న్ (చర్మం మంటపుట్టడం) వచ్చే అవకాశం ఉంటుంది. అదే సూచీ 12 కనుక ఉంటే 15 నిమిషాల్లోనే ఆ వ్యక్తి చర్మం మంట పుట్టడం, కందిపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు వస్తాయి. ఎండ తీవ్రతను కొలిచేందుకు ఈ సూచీని ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సూచీని 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ సూచీ ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సంస్థలు అవగాహన ఇస్తుంటాయి. సమస్యలు.. పరిష్కారాలు యూవీ ఇండెక్స్ పెరగడంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ఓజోన్ రక్షణ లేక మనుషులపై నేరుగా పడటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మంట పుట్టడం, రెటీనా దెబ్బతినడం జరుగుతాయి. యూవీ సూచీ సాధారణంగా 7 పాయింట్లకు పరిమితమైతే ఇబ్బందులు ఉండవు. 10 పాయింట్లు నమోదైతేనే ప్రమాదం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని సూచిస్తున్నారు. పలు మెట్రోనగరాల్లో హరితం ఇలా.. దేశంలో 35% గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో ఉంది. రెండోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 20.2%, గ్రీన్‌సిటీగా పేరొందిన బెంగళూరులో 19%, కోల్‌కతాలో 15%, ముంబైలో 10%, చెన్నైలో 9.5% గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మాత్రం 8 శాతానికే పరిమితం కావడంపై పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో తగ్గుతున్న హరితం.. హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు దోహదపడలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్రేటర్లో గ్రీన్‌బెల్ట్ 8 శాతానికే పరిమితమైందని పేర్కొంటున్నారు. గ్రీన్‌బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే మేలు.. - ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. - సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వాలి. - నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉం డాలి. లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంతోపాటు ఒక్కో మండలానికి కరువు సహాయక చర్యల కోసం రూ.10 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. బాలసముద్రంలోని ఏకశిల పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలె క్టరేట్ ఎదుట మండుటెండలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరి పంటకు ఎకరానికి రూ.15వేలు పరిహారం చెల్లించాలని, అన్ని గ్రామాల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, వడదెబ్బతో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని, కరువు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పశువుల దాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు తాత్కాలిక పింఛన్ రూ.3వేలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, నాయకులు సిరబోయిన కరుణాకర్, పాల్గొన్నారు.


