ఇక ఎండలు మండవు 

Moderate rains for one week and Low temperatures in Andhra Pradesh - Sakshi

వారం రోజులు ఓ మోస్తరు వర్షాలు.. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం 

అల్పపీడన ద్రోణులు, పశ్చిమ గాలుల ప్రభావం  

మే రెండోవారంలో అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం 

సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్‌): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. తీవ్రమైన ఎండలు తగ్గిపోయి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురు­స్తు­న్నాయి. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అప్పటివరకు మోస్తరు వర్షాలతో­పాటు అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం, ఆగ్నేయ/నైరుతి గాలు­ల వల్ల వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు కురుస్తున్నాయి.

గత మూడేళ్లుగా ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదైనా మధ్యలో 2, 3 రోజులు అకాల వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత మే నాటికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలలోపే నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్‌ మూడోవారం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడోవారం చివర్లో వర్షాలు మొదలవడంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే రకరమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఆ తర్వాత కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. మే 9, 12 తేదీల మధ్య బంగాళాఖాతంలో అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది మయన్మార్‌ వైపు వెళ్లినా ఇక్కడి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్నిబట్టి మే రెండోవారం కూడా వాతావరణం ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఒకటి, రెండురోజులు ఎండలు పెరిగినా వర్షాలు మాత్రం కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.  

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీవర్షం  
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు భారీవర్షం కురిసింది. సగటున కర్నూలు జిల్లాలో 27 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లాలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కల్లూరు, కర్నూలు, గోనెగండ్ల తదితర మండలాలు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, బేతంచెర్ల, పాణ్యం, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల్లో ఒక్కరోజు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

ఆస్పరి, కొత్తపల్లి, పెద్దకడుబూరు మండలాల్లో పిడుగులు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామంలో పిడుగుపడటంతో 13 జీవాలు మరణించాయి. ఎమ్మిగనూరు మండలంలో 108.2 మిల్లీమీటర్లు, బనగానపల్లిలో 88, బేతంంచెర్లలో 75.2, కల్లూరులో 70.4, గోనెగండ్లలో 65, పాణ్యంలో 62.4, పగిడ్యాలలో 60.8, కర్నూలు అర్బన్‌లో 54.6, కర్నూలు రూరల్‌లో 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top