జనవరిలోనూ గజగజే | Weather department forecast low temperatures, harsh cold winds in January | Sakshi
Sakshi News home page

జనవరిలోనూ గజగజే

Jan 2 2026 3:12 AM | Updated on Jan 2 2026 3:12 AM

Weather department forecast low temperatures, harsh cold winds in January

మెజారిటీ రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు 

పగటి పూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా.. రాత్రి మాత్రం తగ్గుదల 

మూడోవారం తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతల పెరుగుదల 

వాతావరణశాఖ అధికారుల అంచనా

సాక్షి, హైదరాబాద్‌: అత్యల్ప ఉష్ణోగ్రతలు, తీవ్ర చలిగాలులతో డిసెంబర్‌ నెలలో రికార్డు సృష్టించిన శీతాకాలం.. జనవరి నెలలోనూ అదే స్థాయిలో తన ప్రతాపాన్ని చూపనుంది. డిసెంబర్‌ నెలలో ఏకంగా 28 రోజులపాటు సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు తూర్పు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత అధికంగా నమోదైంది. తాజాగా జనవరి నెలలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నెల మూడోవారం వరకు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గుతాయని, అడపాదడపా పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలో నమోదవుతాయని చెబుతున్నారు. 

రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈనెల మూడో వారం వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెబుతున్నారు. పగటి పూట పొగమంచు ఉంటుందని, జనవరి నెలాఖరులో ఉత్తర, తూర్పు జిల్లాల్లోని కొన్నిచోట్ల ఒకట్రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 11.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గురువారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదైంది. రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో రానున్న నాలుగు రోజులు చలి తీవ్రత కూడా పెరుతుందని అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement