ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు దక్కని వైనం
చరిత్ర సృష్టించిన సీపీఐ... కొత్తగూడె కార్పొరేషన్‌పై ఎర్రజెండా
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు కార్మిక–రైతు ఉద్యమాలకు అగ్రగామిగా నిలిచిన సీపీఎం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోగా, సీపీఐ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ విజయాలను నమోదు చేసింది. కొత్తగా అవతరించిన కొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ ఎర్రజెండా ఎగురవేయనుంది. సీపీఎం మాత్రం బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసి కూడా ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో తన ప్రభావాన్ని చూపలేకపోయింది.
బీఆర్‌ఎస్‌తో పొత్తు.. రెంటికీ నష్టం
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఎం బరిలోకి దిగినప్పటికీ ఆ వ్యూహం ఫలించలేదు. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సీపీఎం పోటీ చేసిన చోట కాంగ్రెస్ విజయం సాధించింది. తద్వారా బీఆర్‌ఎస్ కూడా నష్టపోయినట్టు అయింది. రాష్ట్రవ్యాప్తంగా 13 వార్డుల్లో మాత్రమే సీపీఎం గెలుపొందింది. ఐదేళ్ల క్రితం ఒంటరిగా పోటీ చేసి 12 సీట్లు సాధించిన సీపీఎంకు, ఈసారి పొత్తుతో ఒక సీటు మాత్రమే అదనంగా దక్కింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఒకప్పుడు సీపీఎంకు ప్రధాన కోటలు. కానీ తాజా ఫలితాలు అక్కడ కూడా ప్రభావం తగ్గినట్టుగా చూపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం బలహీనత, ఓటర్ల మూడ్ మార్పు, పొత్తులపై గందరగోళం.. ప్రభావితం చేసిన అంశాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సీపీఐ దూకుడు.. మేయర్ అవకాశం
ఈ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్‌లో గణనీయ ఫలితాలు సాధించింది. కొత్తగూడెంలో 22 మంది కార్పొరేటర్లు, రామగుండంలో ఒక కార్పొరేటర్ సీపీఐ తరఫున గెలిచారు. క్యాతనపల్లి, ఎదులాపురం మున్సిపాలిటీల్లో నాలుగేసి వార్డులు, మహబూబాబాద్‌లో 3 వార్డులతోపాటు హుజూర్‌నగర్, యాదగిరిగుట్ట, వైరా, చండూరు, కోదాడ, భూపాలపల్లిలలో ఒక్కో వార్డు గెలుచుకుంది. ఏకంగా 40 స్థానాల్లో విజయాలు నమోదు చేయడం సీపీఐకి నూతన ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్ పదవిని దక్కించుకునే అవకాశాన్ని సీపీఐ పొందడం తెలంగాణ, ఉమ్మడి ఏపీ చరిత్రలోనే తొలి ఘట్టంగా నిలవనుంది.


