మేం పాలకులం కాదు.. సేవకులం | CM Revanth Reddy In Sevalal Jayanti At Banjara Bhavan | Sakshi
Sakshi News home page

మేం పాలకులం కాదు.. సేవకులం

Feb 16 2026 5:49 AM | Updated on Feb 16 2026 5:49 AM

CM Revanth Reddy In Sevalal Jayanti At Banjara Bhavan

బంజారా భవన్‌లో సంత్‌ శ్రీసేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకల్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రవీంద్రనాయక్, సంజయ్, బలరాం నాయక్, బెల్లయ్య నాయక్‌ తదితరులు

నేనెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదు

నేనే రాజు.. నేనే మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు

పార్టీ గెలుపోటములకు బాధ్యత వహిస్తానని చెప్పేందుకే ఆ వ్యాఖ్యలు చేశా

సేవాలాల్‌ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

 సీఎం అయ్యేందుకు తనకు లంబాడాలు అండదండలు అందించారని వ్యాఖ్య

బంజారాహిల్స్‌: రాష్ట్ర ప్రజలకు తాము పాలకులం కాదని.. సేవకులం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సేవ చేయడానికే ప్రజలకు తమకు అవకాశం ఇచ్చారని.. అందుకు తగ్గట్లుగా తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్నారు. కానీ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ముఖ్యమంత్రిని, మున్సిపల్‌ మంత్రిని సైతం తానే అయినందున మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపోటములకు తానే బాధ్యత తీసుకుంటానని చెబుతూ ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి ఫలితం తన పనితీరుకు గీటురాయి అని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో సంత్‌ శ్రీసేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మానవజాతి శాంతి మార్గంలో నడవాలని సంత్‌ సేవాలాల్‌ అందరిలో స్ఫూర్తినింపారు. దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా నిలబడ్డారు. సేవాలాల్‌ జయంతిని అధికారికంగా జరపడం మా బాధ్యత. సమాజంలో వెనుకబడిన వారిని పాలనలో భాగస్వాములు చేయాలన్నదే నా ఆలోచన. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 15 శాతం ఉంటే 30 శాతం పదవులు ఇచ్చాం. నలుగురు మంత్రులు, స్పీకర్‌ పదవి ఎస్సీ వర్గానికే ఇచ్చామన్నారు. వచ్చే కాలమంతా పేదల కోసమే పనిచేస్తా’ అని సీఎం రేవంత్‌ తెలిపారు. 

దళితుడిని స్పీకర్‌ చేశాం..
ఏ దళితుడినైతే ముఖ్యమంత్రి చేస్తానని గత పాలకులు మోసం చేశారో.. ఆ దళితుడిని అధ్యక్షా అని మైక్‌ అడిగే పరిస్థితి తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దళితుడు రాష్ట్రాన్ని నడపలేరు.. నేనైతేనే నడుపుతానన్న వాళ్లు అధ్యక్షా అని పిలిచి మైక్‌ అడిగేలా దళితుడిని పైన కూర్చొబెట్టానని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య గొప్పతనమని.. అంబేడ్కర్‌ అందరికీ ఇచ్చిన ఆయుధమన్నారు. 20 ఏళ్లలో అన్ని హోదాలు చూశానని, ఏనాడూ ప్రజలకు దూరం కాలేదన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రతి సందర్భంలోనూ లంబాడా సోదరులు అండగా నిలబడ్డారని.. తనకు సీఎం హోదా రావడానికి లంబాడాల అండదండలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. 

పేదవాడి గౌరవం రేషన్‌కార్డు..
రాష్ట్రంలో 3.15 కోట్ల మంది పేదలకు రేషన్‌కార్డుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని.. తాను స్వయంగా ఒక గిరిజనుడి ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేశానని సీఎం రేవంత్‌ గుర్తుచేసుకున్నారు. అలాగే పేదల ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్లు చెప్పారు. 50 లక్షల మంది పేదల ఇళ్లలకు ఈ పథకం వర్తింపజేస్తున్నామన్నారు. 

విద్యార్థులు కష్టపడి చదవాలి..
గిరిజన విద్యార్థుల్లో స్ఫూర్తినింపేందుకే ఆ వర్గానికి చెందిన అధికారులకు మంచి పోస్టులు ఇచ్చామని సీఎం రేవంత్‌ చెప్పారు. విద్యార్థులు నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడి చదువు కోవాలని సూచించారు. 100 నియోజకవర్గాల్లో రూ. 20 వేల కోట్లతో యంగ్‌ ఇండియా స్కూల్స్‌ నిర్మిస్తున్నామ న్నారు. చదువు లేకపోవడం వల్లే గిరిజనులు పేదరికంలో మిగిలిపోతున్నారని.. చదువే అన్ని హోదాలు తెచ్చి పెడు తుందన్నారు. గిరిజన బిడ్డలు చదువుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు కావాలో తనకు చెప్పాలని సూచించారు.

అన్ని తండాలకూ బీటీ రోడ్లు..
రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌ సభావేదిక నుంచే ప్రకటించారు. ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని.. అన్ని తండాల్లోనూ గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలని చెప్పారు. అన్ని తండాల్లో మంచినీటి కోసం ట్యాంకులు, సోలార్‌ పంప్‌సెట్‌లు ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేయాలన్నారు. నల్లమలలో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ కోసం 20 ఎకరాల భూమి కేటాయించామని, వచ్చే జయంతిని అక్కడే జరుపుకుందామని సీఎం రేవంత్‌ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement