విప్‌ ఉల్లంఘిస్తే వేటే! | Violation of party whip will lead to disqualification: Telangana | Sakshi
Sakshi News home page

విప్‌ ఉల్లంఘిస్తే వేటే!

Feb 16 2026 5:44 AM | Updated on Feb 16 2026 5:44 AM

Violation of party whip will lead to disqualification: Telangana

3 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి... ఫిర్యాదు అందిన వెంటనే షోకాజ్‌ నోటీసులు

7 రోజుల్లోగా సంజాయిషీకి అవకాశం...ఆ తర్వాత 2 రోజుల్లో అనర్హతపై నిర్ణయం

సంజాయిషీ ఇవ్వకపోతే సాక్ష్యాధారాల ఆధారంగా నిర్ణయం

కోరం ఉంటేనే ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సమావేశం

తొలి రెండు సమావేశాల్లో కోరం లేకుంటే ఆ తర్వాతి భేటీల్లో అవసరం లేదు

అభ్యర్థికి ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే మరొకరు మద్దతు తెలపాలి

స్పష్టం చేస్తున్న మేయర్‌/చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల నిబంధనలు– 2020

సాక్షి, హైదరాబాద్‌: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులు తప్పనిసరిగా పార్టీ విప్‌ను పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే. పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తే వారిపై అనర్హత వేటు వేసి సభ్యత్వం రద్దు చేస్తారు. తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌/చైర్‌ పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికల నిబంధనలు–2020 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పరోక్ష విధానంలో మేయర్‌/చైర్‌ పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలను ఎలా నిర్వహించాలో ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను జారీ చేసింది. సోమవారం ఈ పదవులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధనలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 

విప్‌ ఉల్లంఘిస్తే...
గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ విప్‌ను నియమించి ఎన్నికలు జరిగే రోజు ఉదయం 11 గంటలలోపు ఎన్నికల అధికారికి అందజేయాలి. సంబంధిత పార్టీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్లో అత్యున్నత స్థాయి కలిగిన వ్యక్తి లేదా ఆ వ్యక్తి నుంచి అధికారం పొందిన మరో వ్యక్తి తన సంతకంతోపాటు పార్టీ ముద్ర వేసి ఎవరిని విప్‌గా నియమించారో ఈ లేఖలో తెలియజేయాలి. 

తమ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులకే ఓటేయాలని పార్టీ సభ్యులందరికీ విప్‌గా నియామకం పొందిన వ్యక్తి ‘విప్‌’జారీ చేయడంతోపాటు ఆ అభ్యర్థుల జాబితాను ప్రత్యేక సమావేశ ప్రారంభానికి గంట ముందు ఎన్నికల అధికారికి సమర్పించాలి. 
సభ్యులందరికీ పార్టీ విప్‌ నోటీసు చేరినట్టు వారి నుంచి ధ్రువీకరణ తీసుకొని సమావేశ ప్రారంభానికి ముందు ఎన్నికల అధికారికి విప్‌గా నియామకం పొందిన వ్యక్తి సమర్పించాలి. పార్టీ తరఫున ఎన్నికైన సభ్యుడు ఎవరైనా విప్‌ తీసుకునేందుకు నిరాకరిస్తే ఆ విషయాన్ని రికార్డు చేసి ఎన్నికల అధికారికి అందించాలి. 

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. 
తమ పార్టీ సభ్యుడు/సభ్యులు విప్‌ ఉల్లంఘించారని విప్‌గా నియామకం పొందిన వ్యక్తి ఎన్నికలు జరిగాక మూడు రోజుల్లోగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, ఎన్నికల అధికారి సంబంధిత సభ్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వారిపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తారు. వారం రోజుల్లోగా సంజాయిషీ అందితే, ఆ తర్వాతి రెండు రోజుల్లోగా ఎన్నికల అధికారి ఆయా సభ్యుల సభ్యత్వ రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తగిన కారణాలతో వెల్లడించాలి. ఒకవేళ వారం రోజుల్లో సంజాయిషీ అందకపోతే అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా ఆ తర్వాతి రెండు రోజుల్లోగా ఎన్నికల అధికారి తగిన నిర్ణయాన్ని తీసుకుంటారు. 

తొలుత ప్రమాణ స్వీకారం.. తర్వాతే ఎన్నికలు 
జిల్లా కలెక్టర్‌ నియమించిన గెజిటెడ్‌ అధికారి సంబంధిత పురపాలికలో మేయర్‌/చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక కోసం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ప్రారంభమైన వెంటనే సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 

కోరం ఉంటేనే తొలి రెండు సమావేశాలు 
సంబంధిత మున్సిపల్‌ కౌన్సిల్‌/కార్పొరేషన్‌లో ఓటు హక్కు కలిగి ఉన్న సభ్యుల (ఎన్నికైన సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు) మొత్తం సంఖ్యలో కనీసం సగం మంది సమావేశానికి హాజరైతేనే మేయర్‌/చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల నిర్వహణకు కోరం ఉన్నట్టు పరిగణించి సమావేశాన్ని కొనసాగిస్తారు. నిర్దేశిత సమయానికి సమావేశం ప్రారంభమైన గంటలోపే కోరం సాధ్యమైతే ఎన్నికలను నిర్వహిస్తారు. 

ఏదైనా కారణంతో ఎన్నికలు సాధ్యం కాకుంటే సాధారణ సెలవులతో సంబంధం లేకుండా మరుసటి రోజు మళ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. మరుసటి రోజూ ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో ఎన్నికల నిర్వహణకు తదుపరి తేదీని ఖరారు చేసేందుకుగాను ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.
కోరం లేక తొలి రెండు సమావేశాల్లో మేయర్‌/చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక సాధ్యం కానిపక్షంలో, తదుపరి సమావేశం/సమావేశాల్లో కోరం విషయంలో పట్టింపు లేకుండా హాజరైన సభ్యులతో మేయర్‌/చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

ఎన్నికల ప్రక్రియ ఇలా...
మేయర్‌/ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పోటీ చేసే అభ్యర్థిని ఓటు హక్కు గల ఓ సభ్యుడు ప్రతిపాదిస్తే మరో సభ్యుడు మద్దతు తెలపాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శుల్లో అత్యున్నత స్థాయి కలిగి వ్యక్తి నుంచి, లేదా వారి నుంచి అధికారం (పత్రంపై పార్టీ ముద్ర వేసి ఉండాలి) పొందిన వ్యక్తి నుంచి ఈ మేరకు ధ్రువీకరణ పత్రం తీసుకొని కలెక్టర్‌ నియమించిన ఎన్నికల అధికారికి ఎన్నికలు జరిగే రోజు ఉదయం 10 గంటలలోపు అందజేయాలి. 

సక్రమ విధానంలో అభ్యర్థిత్వం ప్రతిపాదించిన, మద్దతు తెలిపిన అభ్యర్థుల పేర్లు, రాజకీయ పార్టీ పేరును ఎన్నికల అధికారి చదివి వినిపిస్తారు. 
సభ్యులందరూ ఒకే అభ్యర్థిని ప్రతిపాదిస్తే ఎన్నికలు నిర్వహించకుండా సంబంధిత అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. 
ఇద్దరు, అంతకు మించి అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నికలు నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన సభ్యులు చేయి ఎత్తి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 

మేయర్‌/చైర్‌ పర్సన్‌ ఎన్నికలు పూర్తయిన తర్వాతే డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. 
సభ్యులు చేయి ఎత్తడం ద్వారా ఒక్కో అభ్యర్థి సాధించిన ఓట్ల సంఖ్యను ఎన్నికల అధికారి రికార్డు చేసి ప్రకటిస్తారు. అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిని ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. 
ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు పోలైతే అభ్యర్థులు, సభ్యులందరి సమక్షంలో ఎన్నికల అధికారి లాటరీ ద్వారా తీసిన తొలి పేరును ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement