ఫోర్‌.. నెవర్‌ బిఫోర్‌ | Twist in Karimnagar Corporation Politics | Sakshi
Sakshi News home page

ఫోర్‌.. నెవర్‌ బిఫోర్‌

Feb 16 2026 5:24 AM | Updated on Feb 16 2026 8:17 AM

Twist in Karimnagar Corporation Politics

కరీంనగర్‌  కార్పొరేషన్‌లో ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌

బీజేపీకి చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు

పాలమూరులో కాంగ్రెస్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌ వస్తున్నా 

మేయర్‌ అభ్యర్థి ఎంపికపై కుదరని ఏకాభిప్రాయం

నిజామాబాద్‌లోనూ ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్‌ పాగా

కొత్తగూడెంలో అధికార పంపిణీ ఒప్పందంతో సీపీఐకి చాన్స్‌

మున్సిపల్‌ కార్పొరేషన్లలో మేయర్‌ పీఠం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా గెలిచిన పాలమూరుతోపాటు బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ల మద్దతు, స్వతంత్రులు, ఎక్స్‌ అఫీషియో ఓట్ల సహకారంతో కరీంనగర్, నిజామాబాద్‌లలో కూడా పాగా వేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్‌లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కటి కావడం గమనార్హం. మరోవైపు పాలమూ­రులో కాంగ్రెస్‌–ఎంఐఎంలు కలిసి మేయర్‌ పీఠాన్ని దక్కించుకోనుండగా, కొత్తగూడెంలో సీపీఐకి అవకాశం దక్కనుంది. రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లలో పరిస్థితి ఇది.

బీజేపీకి అధిక డివిజన్లు వచ్చినా..
66 డివిజన్లు ఉన్న కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీకి 30 డివిజన్లు దక్కాయి. నలుగురు స్వతంత్రులు, ఎంపీ బండి సంజయ్‌ ఓటుతో ఆ పార్టీ బలం 35కు చేరింది. కానీ, ఇక్కడ బీజేపీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరికి మజ్లిస్, స్వతంత్రులు కూడా తోడయ్యారు. దీంతో కాంగ్రెస్‌ (14), బీఆర్‌ఎస్‌ (9), స్వతంత్రులు (4), మజ్లిస్‌ (3), ఏఐఎఫ్‌బీ (2) తోపాటు ఎమ్మెల్యేలు కమలాకర్‌ (బీఆర్‌ఎస్‌), కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్‌)ల ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఆ కూటమి బలం 34కు చేరింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే... బీజేపీ గూటికి వెళ్లిన స్వతంత్రుల్లో ఒకరు కాంగ్రెస్‌ కూటమికి రావడంతో కూటమి బలం 35కు పెరిగితే, బీజేపీ బలం 34కు తగ్గింది. బీజేపీ నుంచి మరో ఇద్దరు కూడా వస్తారనే ప్రచారం జరుగుతుండడంతో కమలం శిబిరం కలవరపాటుకు గురవుతోంది.

కొత్తగూడెంలో కామ్రేడ్లు
చెరో 22 డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్, సీపీఐల మధ్య అధికార పంపిణీ ఒప్పందం కుదరడంతో ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేయర్, డిప్యూటీ మేయర్‌ స్థానాలను దక్కించుకోనున్నాయి. తొలి రెండున్నరేళ్లు సీపీఐకి, మలి రెండున్నరేళ్లు కాంగ్రెస్‌కు మేయర్‌ పదవి ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది.

పాలమూరులో మేయర్‌ ఎవరో..!
మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పరం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే..మేయర్‌ అభ్యర్థిత్వంపై ఈ పార్టీలో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు 31 ఓట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్‌ గెలుపొందిన 29తోపాటు ఎమ్మెల్యే ఎక్స్‌ అఫీషియో ఓటు, ముగ్గురు ఎంఐఎం, నలుగురు స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ బలం 37కు చేరింది. బీఆర్‌ఎస్‌ 15, బీజేపీ 8 మంది చొప్పున బలం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే, ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి మేయర్‌ అభ్యర్థి ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొందరు కార్పొరేటర్లు క్యాంపు నుంచి శనివారం రాత్రే పాలమూరుకు చేరుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

నిజామాబాద్‌ కాంగ్రెస్‌దే...!
ఇందూరు కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన మేరకు ఆ పార్టీ బలం సమకూర్చుకుంది. ఇక్కడ బీజేపీకి 28 డివిజన్లు రాగా, మ్యాజిక్‌ ఫిగర్‌కు మూడు తగ్గాయి. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డిలు ఎక్స్‌ అఫీషియో ఓట్లు వేస్తే ఆ మేరకు బలం చేకూరనుంది. కానీ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం 14 మందితోపాటు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్‌ కూటమి బలం 34కు చేరనుంది. దీంతో మేయర్‌ పీఠం కాంగ్రెస్‌కు, డిప్యూటీ మేయర్‌ ఎంఐఎంకు దక్కడం లాంఛన ప్రాయమే కానుంది. 
నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్‌ పరం కావడం కూడా లాంఛన ప్రాయమే.   

Advertisement
 
Advertisement
Advertisement