ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చంపారా టీ గార్డెన్ కార్మికుడైన 28 ఏళ్ల రతన్ శుభోకర్ పోలీసులకు విగతజీవిగా కనిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక పత్రిక 'డైలీ స్టార్' నివేదిక ప్రకారం రతన్ శుభోకర్ మృతదేహం రక్తంతో తడిసి ఉండటాన్ని గమనించిన కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు లక్ష్మణ్ కర్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి నుండి రతన్ కనిపించకుండా పోయాడని, తరువాత తోటలో శవమై కనిపించాడని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తమకు తెలియవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, నిందితులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేళ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత జనవరి నెలలోనే జైలు కస్టడీలో దాదాపు 15 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది. మరణించిన వారిలో అవామీ లీగ్ సీనేయర్ నేత రమేష్ చంద్ర సేన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రళయ్ చకి తదితరులు ఉన్నారు. డిసెంబర్ 2024లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన అశాంతిలో పలువురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతల గురించి హామీలు ఇస్తున్నప్పటికీ, మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరుగుతుండటంపై మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.


