భారత్‌తో ఒప్పందం చారిత్రాత్మకం: ట్రంప్‌ | Historic Deal Donald Trump Hails India us Trade | Sakshi
Sakshi News home page

భారత్‌తో ఒప్పందం చారిత్రాత్మకం: ట్రంప్‌

Feb 12 2026 7:47 AM | Updated on Feb 12 2026 7:50 AM

Historic Deal Donald Trump Hails India us Trade

వాషింగ్టన్‌: తాము భారతదేశంతో కుదుర్చుకున్న నూతన వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  అభివర్ణించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందం కారణంగా అమెరికా నుంచి బొగ్గు ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారుగా ఎదిగిందన్నారు. జపాన్, కొరియా తదితర దేశాలతో పాటు భారత్‌తో కుదిరిన ఈ తాజా ఒప్పందాలు అమెరికా ఇంధన ఎగుమతులను మరింత విస్తృతం చేస్తాయని ట్రంప్ అన్నారు. తమ దేశ బొగ్గు ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినదని ట్రంప్‌ పేర్కొన్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలు దాదాపు ఏడాది కాలం పాటు సాగి, చివరకు ఒక కొలిక్కి వచ్చాయి. గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఈ తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. 2025 ఆగస్టులో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు చేస్తున్నారనే నెపంతో అమెరికా.. భారత్‌పై 50 శాతం సుంకాలను విధించడంతో చర్చలు స్తంభించాయి. అయితే, తాజా దౌత్యపరమైన ముందడుగుతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను చక్కదిద్దింది.

ఈ నూతన ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. గతంలో 50 శాతంగా ఉన్న సుంకాన్ని ఇప్పుడు 18 శాతానికి తగ్గించారు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి, పోటీ మరింతగా పెరగనుంది. వాషింగ్టన్ విడుదల చేసిన 'ఫ్యాక్ట్ షీట్' ప్రకారం ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పర ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందాయి. ఇది భారత్ నుంచి అమెరికాకు జరిగే వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది.

ఈ సుంకాల తగ్గింపు నిర్ణయంతో భారతదేశంలోని కీలక రంగాలకు భారీ లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్ ఎగుమతులు పెరగనున్నాయి. వీటితో పాటు గృహాలంకరణ వస్తువులు, హస్తకళాకృతులు, ఎంపిక చేసిన యంత్ర పరికరాల విభాగాల్లో భారతీయ ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో తమ పట్టును సాధించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: శాంతి మంత్రంతో బౌద్ధ సన్యాసుల సరికొత్త చరిత్ర
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement