క్రేజీ క్రేజీ.. మేడిన్‌ ఇండియా లగేజీ  | India luggage market to touch Rs 267 billion dollers by 2028 | Sakshi
Sakshi News home page

క్రేజీ క్రేజీ.. మేడిన్‌ ఇండియా లగేజీ 

Feb 12 2026 4:26 AM | Updated on Feb 12 2026 4:26 AM

India luggage market to touch Rs 267 billion dollers by 2028

దేశీ బ్రాండ్లకు పెరుగుతున్న డిమాండ్‌ 

ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తి 

2028 నాటికి రూ. 26,700 కోట్లకు చేరనున్న పరిశ్రమ

ఏటా 12 శాతం వృద్ధి

ఇప్పుడు ట్రావెల్‌ అనేది అప్పుడప్పుడు మాత్రమే వేసే ట్రిప్పులకే పరిమితం కాకుండా, రెగ్యులర్‌ జీవన విధానంగా మారిపోయింది. దీంతో అత్యంత నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే లగేజీకి డిమాండ్‌ పెరుగుతోంది. డిజైన్, పనితీరు, నాణ్యతలో అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా ఉండే దేశీ బ్రాండ్స్‌ ఉత్పత్తులను కొనేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింబించడం, స్టయిల్‌కి పెద్దపీట వేయడం, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్లోబల్‌ లగేజీ, బ్యాగ్‌ తయారీ పరిశ్రమలో చైనా ఆధిపత్యం కొనసాగినప్పటికీ ప్రస్తుతం క్రమంగా భారత్‌లో తయారీవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. మేడిన్‌ ఇండియా నినాదం, ఇన్వెస్టర్లలో ఆసక్తి, విస్తరణ ప్రణాళికలు మొదలైనవి ఇందుకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక ప్రకారం 2028 నాటికి భారత లగేజ్‌ పరిశ్రమ రూ. 26,700 కోట్లకు చేరనుంది. 2023 నుంచి 2028 మధ్య ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. 60 శాతం మంది వినియోగదారులు దేశీ లేదా చిన్న బ్రాండ్స్‌ని కొనడానికి ఇష్టపడుతుండగా, 14 % మంది మరికాస్త ఎక్కువ చెల్లించి ప్రీమియం ఉత్పత్తులను కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. 

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న సంస్థలు .. 
సూట్‌కేసులు, ట్రాలీలు, బ్యాక్‌ప్యాక్‌లు, బిజినెస్‌ బ్యాగ్‌లు మొదలైనవి విక్రయించే అప్పర్‌కేస్‌ ఇందులో సింహభాగం ఉత్పత్తులను ప్రధానంగా నాసిక్‌ (మహారాష్ట్ర), రుద్రపూర్‌ (ఉత్తరాఖండ్‌)లోని తమ ప్లాంట్లలోనే ఉత్పత్తి చేస్తోంది. ప్రముఖ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దన్ను గల అప్పర్‌కేస్‌ ఉత్పత్తి సామర్థ్యం వచ్చే మూడేళ్ల వృద్ధికి సరిపడేంతగా నెలకు 1,00,000 యూనిట్ల స్థాయిలో ఉంది. భారత్‌లోనే తయారీ వైపు మళ్లుతున్న ప్రీమియం బ్రాండ్లలో యూమ్‌ అంకుర సంస్థ కూడా ఒకటి. మేడిన్‌ ఇండియాను తమ ప్రధాన బ్రాండ్‌ ఐడియాలజీగా పరిగణిస్తామని సంస్థ కో–¸ఫౌండర్‌ నైనా పరేఖ్‌ తెలిపారు. అందుకే తమ ఉత్పత్తుల తయారీని, ముఖ్యంగా అల్యూమినియం, హార్డ్‌ లగేజీ సోర్సింగ్, అసెంబ్లీని చైనా నుంచి భారత్‌కి మార్చుకుంటున్నామని వివరించారు.

 కఠినతరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఆవిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేస్తూ, విదేశీ సరఫరా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పరేఖ్‌ వివరించారు. వివిధ భాగస్వామ్యాల ద్వారా యూమీకి ఏటా 4,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వచ్చే రెండేళ్లలో దీన్ని 7,00,000 యూనిట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మరో కంపెనీ మిరాజియో ప్రస్తుతం తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్‌లో తయారు చేసేందుకు భాగస్వామ్యాలను కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించింది.  

మార్కెట్‌ వాటాపై కన్ను.. 
యూమీ ఇప్పటివరకు రూ. 35 కోట్ల వరకు పెట్టుబడులు సమీకరించింది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 250 కోట్లకు పైగా వార్షికాదాయాన్ని, 2029–30 నాటికి ప్రీమియం లగేజ్‌ సెగ్మెంట్లో 8–10% వాటా ను లక్ష్యంగా పెట్టుకుంది. అటు అప్పర్‌కేస్‌ దాదాపు 2,000 రిటైలర్లు, మూడు ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్, ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌ వాటా 2–3 శాతంగా ఉండగా, వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 10 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ అనే సంస్థ వచ్చే రెండేళ్లలో బ్యాక్‌ప్యాక్‌ల తయారీ సామర్థ్యాన్ని సుమారు 20% పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది.

సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement