‘తృణధాన్యాలు’ తొలగింపు  | US revises fact sheet on trade deal with India | Sakshi
Sakshi News home page

‘తృణధాన్యాలు’ తొలగింపు 

Feb 11 2026 12:43 PM | Updated on Feb 12 2026 5:31 AM

US revises fact sheet on trade deal with India

మధ్యంతర ఒప్పందంపై సవరించిన జాబితా విడుదల చేసిన అమెరికా  

వాటిపై భారత్‌లో టారిఫ్‌ల రద్దు లేదా తగ్గింపు ఉండబోదని వెల్లడి  

న్యూయార్క్‌: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో మన రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. భారత రైతాంగానికి నష్టం కలిగించే నిర్ణయాలు ఉండబోవని హామీ ఇస్తోంది. ఉభయతారకంగా ఉండే ఒప్పందానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటోంది. 

ఇటీవల ఇరుదేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై అమెరికా ప్రభుత్వం సోమవారం ఫ్యాక్ట్‌షీట్‌ విడుదల చేసింది. అమెరికాకు సంబంధించిన ఏయే వస్తువులు, ఉత్పత్తులపై భారత్‌లో టారిఫ్‌లు రద్దు కావడం లేదా తగ్గించడం జరుగుతుందో వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఈ ఫ్యాక్ట్‌షీట్‌లో సవరణ చేసి, మంగళవారం మరోసారి విడుదల చేయడం గమనార్హం. సవరించిన జాబితాలో ‘కొన్ని రకాల తృణధాన్యాలు’అనే పదాన్ని ట్రంప్‌ సర్కార్‌ తొలగించింది. 

అంటే అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతి చేసే తృణధాన్యాలపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గించడం ఉండబోదని తేలి్చచెప్పింది.  ఇలా ఫ్యాక్ట్‌షీట్‌ను సవరించడం వెనుక ఏం జరిగిందన్నది తెలియరాలేదు. తొలుత విడుదల చేసిన జాబితాలో మధ్యంతర ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు ప్రస్తావించారు. అమెరికా పారిశ్రామిక వస్తువులు, సరుకులు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తొలగించడానికి లేదా తగ్గించడానికి భారత్‌ అంగీకరించిందని పేర్కొన్నారు. 

ఇందులో మద్యం తయారీకి ఉపయోగించే ధాన్యాలు, ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్, తాజా లేదా శుద్ధి చేసిన పండ్లు, కొన్ని రకాల తృణధాన్యాలు, సోయాబీన్‌ ఆయిల్, వైన్, స్పిరిట్స్‌తోపాటు అదనపు ఉత్పత్తులు ఉన్నట్లు జాబితాలో పొందుపర్చారు. 500 బిలియన్‌ డాలర్లకుపైగా విలువైన ఇంధన, సమాచార, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గుతోపాటు ఇతర ఉత్పత్తులను అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేయబోతోందని తెలియజేశారు. 

సవరించిన ఫ్యాక్ట్‌షీట్‌ను గమనిస్తే.. ఇందులో కొన్ని రకాల తృణధాన్యాలు అనే పదాన్ని తొలగించారు. అలాగే ‘అమెరికా వస్తువులు, ఉత్పత్తులు కొనడానికి భారత్‌ కట్టుబడి ఉంది’అనే వ్యాక్యంలో కట్టుబడి అనే పదాన్ని తొలగించారు. ‘కొనాలని భావిస్తోంది’అని చేర్చారు. నిజానికి గతవారం మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత భారత్, అమెరికాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ‘తృణధాన్యాలు’అనే ప్రస్తావన లేదు. అమెరికా ప్రభుత్వం తమ ఫ్యాక్ట్‌షీట్‌లో ఈ పదాన్ని చేర్చి, ఒక్కరోజులోనే తొలగించడం గమనార్హం. అమెరికా నుంచి తృణధాన్యాలను దిగుమతి చేసుకొంటే భారత రైతులు నష్టపోతారన్న వాదన వినిపిస్తోంది.   
 
ఇది కూడా చదవండి: ‘తొలగింపు నోటీసు’లో లోపాలు.. మరో అవకాశం ఇచ్చిన స్పీకర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement