పాక్‌, ఇ‍మ్రాన్‌ ఆరోపణలు.. అమెరికా రియాక్షన్‌ ఇదే.. | US Respond On Pakistan And Imran Khan Issue | Sakshi
Sakshi News home page

పాక్‌, ఇ‍మ్రాన్‌ ఆరోపణలు.. అమెరికా రియాక్షన్‌ ఇదే..

May 20 2026 1:58 PM | Updated on May 20 2026 2:06 PM

US Respond On Pakistan And Imran Khan Issue

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఆరోపణలపై ఎట్టకేలకు అమెరికా విదేశాంగశాఖ స్పందించింది. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగించిన విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. పాక్‌ రాజకీయాలు అక్కడి ప్రజలకు సంబంధించినవే అంటూ ట్విస్ట్‌ ఇ‍చ్చింది.

కాగా, పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగించడం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోపణలపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పందిస్తూ..‘పాకిస్తాన్‌ రాజకీయాలతో అమెరికాకు సంబంధం లేదు. పాకిస్తాన్‌, అమెరికా కేవలం మిత్ర దేశాలు మాత్రమే. ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించిన విషయంలో మాకు ఎలాంటి ప్రమేయం లేదు. పాక్‌ రాజకీయాలు ఆ దేశ ప్రజలకు మాత్రమే సంబంధించినవి’ అని క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. 2022, ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు అమెరికాలోని పాక్‌ రాయబారి అసద్‌ మజీద్ ఖాన్‌తో అమెరికా హోంశాఖలోని దక్షిణ- మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్‌ లూ సమావేశమయ్యారు. అందులో వారు ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టాలని.. అప్పుడే ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మాట్లాడుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్‌ తటస్థ వైఖరిని అవలంభించడం వల్లే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని యూఎస్‌ నిర్ణయించినట్లు పాక్‌లో లీకైన దౌత్య సమాచారం వెల్లడించింది.

డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం
2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. యాదృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్‌ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థ వైఖరి ప్రదర్శించారు. అనంతరం  2022 మార్చి 7న, వాషింగ్టన్‌లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్‌తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్‌ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.

ఇమ్రాన్‌ తొలగింపు అనంతర పరిణామాలు
ఏప్రిల్ 2022, ఇమ్రాన్‌ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం కొద్ది నెలలకు  నవంబర్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్‌తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

అమెరికా-పాక్ సంబంధాలు
ఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి. పాక్‌లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్‌లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్‌కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్‌లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement