వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ఆకస్మిక దాడి, అప్పటి సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని హతమార్చిన తరువాత టెహ్రాన్‌లో పాలన మార్పు అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాలో ఒక కీలక భాగంగా ఉంది. ఆ దాడుల తొలినాళ్లలో, ఇరాన్ తదుపరి నాయకుడు ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచే రావాలని ట్రంప్ పదేపదే మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి ట్రంప్ వ్యూహం తాజాగా తెరపైకి వచ్చింది.
ఇరాన్ టాప్ లీడర్ కోసం ట్రంప్ మనసులోని ప్రత్యేకమైన, అత్యంత ఆశ్చర్యకరమైన వ్యక్తి మరెవ్వరో కాదు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్. కొత్త ఇరాన్ ప్రభుత్వానికి నాయకుడిగా ట్రంప్ ఎంచుకున్న అహ్మదీనెజాద్ కఠినమైన, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక అభిప్రాయాలకు పేరుగాంచిన వ్యక్తి కావడం గమనార్హం.
ఈ విషయంపై సమాచారం అందుకున్న అమెరికా అధికారులను ఉటంకిస్తూ, మంగళవారం 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం... ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్‌ను దేశానికి కొత్త నాయకుడిగా తిరిగి నియమించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మరియు అమెరికా 'ఆపరేషన్ రోరింగ్ లయన్' ,'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్లను చేపట్టాయి. ఇరాన్‌కు నాయకత్వం వహించి, "ఇరాన్ రాజకీయ, సామాజిక , సైనిక పరిస్థితిని" నిర్వహించగల సమర్ధుడిగా అమెరికన్లు అహ్మదీనెజాద్‌ను భావిస్తున్నారని ఆయన సహచరుడు ఒకరు మీడియాకు తెలిపారు.
ఈ సాహసోపేతమైన ప్రణాళికను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో గాయపడిన అహ్మదీనెజాద్‌ను ఈ ప్రతిపాదన కోసం సంప్రదించారని, అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ బెడిసికొట్టిందని నివేదిక సూచించింది. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయనను ఒక హాలోకాస్ట్ నిరాకరిణిగా,అణుబాంబు పిచ్చివాడిగా, అప్పటికే విసిగిపోయి ఉన్న దేశంపై ఇస్లామిక్ విప్లవ భావజాలాన్ని బలవంతంగా రుద్దిన వ్యక్తిగా చాలామంది భావిస్తారు. అలాగే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మతతత్వ ఫాసిజానికి చిహ్నంగా కనిపించడమే కాదు, ఒకానొక సమయంలో ఆయన "ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలి" అని కూడా పిలుపు నిచ్చారు.
గత దశాబ్ద కాలంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారిపోవడంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఆయనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారికంగా నిషేధించింది. అంతేకాదు ఆయన ఇస్లామిక్ ప్రభుత్వం నిఘాలో కూడా ఉన్నారు.
'ది అట్లాంటిక్' నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే, ఇరాన్ ప్రభుత్వం అహ్మదీనెజాద్ ఇంటి వద్ద బాడీగార్డులను కాపలా పెట్టింది. పేరుకు ప్రముఖ పౌరుడి రక్షణ కోసమే అయినా, అసలు ఉద్దేశం ఆయనపై నిఘా ఉంచడమే. అయినప్పటికీ, ఇరాన్‌లో ఆయనకు ఇంకా ఆదరణ ఉంది, అందుకే అక్కడి ప్రభుత్వం ఆయన పట్ల అప్రమత్తంగా ఉంటుంది.
యుద్ధం మొదటి రోజున అహ్మదీనెజాద్ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ దాడి ఉద్దేశం ఆయనను గృహ నిర్బంధం నుండి విడిపించడమే. ఆయన ఆ దాడి నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ క్షిపణి దాడి తర్వాత పాలనా మార్పు ప్రణాళికపై ఆయన విరక్తి చెందారని అమెరికా అధికారులు మరియు అతని సహచరుడు ఒకరు తెలిపారు. అప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే వివరాలు తెలియవు. టెహ్రాన్‌లో నాయకత్వ మార్పు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని ఆయన సొంత సహాయకులే కొందరు విశ్వసించడం లేదని తెలుస్తోంది.
వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ఈ విషయంపై స్పందిస్తూ... "మొదటి నుండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) పై ప్రెసిడెంట్ ట్రంప్ తన లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడం, వాటి ఉత్పత్తి కేంద్రాలను కూల్చివేయడం, వారి నౌకాదళాన్ని ముంచేయడం మరియు వారి ప్రాక్సీలను బలహీనపరచడం. అమెరికా సైన్యం తన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది, ఇప్పుడు మా చర్చల ప్రతినిధులు ఇరాన్ అణుసామర్థ్యాలను శాశ్వతంగా నాశనం చేసే ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు" అని తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
అహ్మదీనెజాద్ ఎందుకు ?
వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను బంధించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇదే నమూనాను ఇరాన్‌లో కూడా పునరావృతం చేయవచ్చని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది. అలాగే మదురోను తొలగించిన తర్వాత వెనిజులాలో అధికారం చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ లాంటి వ్యక్తిగా అమెరికా అహ్మదీనెజాద్‌ను చూసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ


