చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో, విజయ్ మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు చేరనున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు సమాచారం.
కాగా, తమిళనాడు ప్రభుత్వానికి అటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్నాడీఎంకే రెబల్స్‌కు మంత్రి పదవులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరికను సీపీఎం వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్‌కు అల్టిమేటం విధించినట్టు సమాచారం. దీంతో, సీఎం విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్ నివాళులు అర్పించం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసింది
కాంగ్రెస్ ఏం చెబుతుంది?
రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.

డిఫెన్స్‌లో టీవీకే..
ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్‌ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


