న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు సమర్పించిన నోటీసులో సాంకేతిక, విధానపరమైన లోపాలు ఉన్నట్లు లోక్‌సభ సచివాలయం గుర్తించింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫార్మాట్‌లో ఈ నోటీసు లేదని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు నోటీసును తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ స్పీకర్ ఓం బిర్లా ఈ భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నోటీసులో ప్రధానంగా కాలక్రమ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ నోటీసులో రాబోయే కాలానికి సంబంధించిన సంఘటనలను సుమారు నాలుగు సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం జరిగిన సంఘటనల ఆధారంగానే నోటీసు ఉండాలి తప్ప, భవిష్యత్తు తేదీలను పేర్కొనడం నిబంధనలకు విరుద్ధం. ఇటువంటి పొరపాట్ల వల్ల ఈ నోటీసును రద్దు చేసే అధికారం సచివాలయానికి ఉన్నప్పటికీ, తదుపరి చర్యల కోసం స్పీకర్ సానుకూలంగా స్పందించారు.
సాంకేతిక కారణాలతో నోటీసును తోసిపుచ్చకుండా, అందులోని లోపాలను సరిదిద్దుకునేలా విపక్షాలకు అవకాశం కల్పించాలని స్పీకర్ సచివాలయ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని, అవసరమైన సవరణలు చేయించిన తర్వాతే ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సవరించిన నోటీసు అందిన వెంటనే, నిబంధనలకు లోబడి త్వరితగతిన పరిశీలించాలని సచివాలయానికి ఆదేశాలు జారీ చేశారు.
సవరించిన నోటీసు తిరిగి సమర్పించిన తర్వాత, అది పార్లమెంటరీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో అధికారులు మరోసారి తనిఖీ చేయనున్నారు. అన్నీ సవ్యంగా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల మొదటి విడత ముగిసిన తర్వాత, రెండో విడత ప్రారంభంలో ఈ అంశాన్ని చర్చకు స్వీకరించే అవకాశం ఉంది. విపక్షాల ప్రతిపాదనపై తుది నిర్ణయం వారు సమర్పించే సవరణల పైనే ఆధారపడి ఉంటుందని సచివాలయ వర్గాలు తెలియజేశాయి.


