పోలవరంపై రాజీపడొద్దు.. ఏపీని అప్పుల కుప్పగా మార్చొద్దు | YSRCP MP YS Avinash Reddy during the budget debate in the Lok Sabha | Sakshi
Sakshi News home page

పోలవరంపై రాజీపడొద్దు.. ఏపీని అప్పుల కుప్పగా మార్చొద్దు

Feb 11 2026 5:38 AM | Updated on Feb 11 2026 5:38 AM

YSRCP MP YS Avinash Reddy during the budget debate in the Lok Sabha

20 నెలల్లోనే రూ.3.20 లక్షలకోట్ల అప్పులా?

పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదింపు ఆంధ్రులకు తీరని ద్రోహం  

వైఎస్‌ జగన్‌ నిర్మించిన మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ సరికాదు  

విశాఖ ఉక్కును కాపాడండి.. కడప స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిచేయండి  

లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆంధ్రప్రదేశ్‌ రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. 2026–27 బడ్జెట్‌పై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా ఎండగట్టారు. తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆరి్థకమంత్రిని అభినందిస్తూ.. 2026–27 మూలధన వ్యయాన్ని రూ.12.21 లక్షలకోట్లకు పెంచడాన్ని స్వాగతించారు. 

ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.5 శాతం పెరుగుదల అని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. పోలవరాన్ని 194 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉండగా, బడ్జెట్‌ ప్రసంగంలో దీన్ని 41.15 మీటర్లకే పరిమితం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

41.15 మీటర్ల వద్ద కేవలం 75 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలమని, దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని చెప్పారు. తద్వారా లక్షలాదిమంది రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55 వేలకోట్లు కాగా, సవరించిన వ్యయం రూ.30,436 కోట్లకు కుదించడం రాష్ట్ర రైతులకు చేసే ద్రోహమేనని మండిపడ్డారు. 

ఆఫ్‌ బడ్జెట్‌ అప్పులతో రాష్ట్రం ఎటు పోతోంది? 
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో మొత్తం అప్పులు రూ.3.32 లక్షలకోట్లు ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.3.20 లక్షలకోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ఏపీఎండీసీ  ద్వారా రూ.9 వేలకోట్లు, ఏపీఎస్‌సీఎల్‌ ద్వారా వేలకోట్లు అప్పులు చేస్తూ రాష్ట్ర ఖజానాను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని చెప్పారు. 

ఏపీఎండీసీ నిధులను ప్రైవేట్‌ వ్యక్తులు నేరుగా వాడుకునేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఇలాంటి ఆఫ్‌ బడ్జెట్‌ అప్పుల వల్ల భవిష్యత్తులో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర  
గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తుచేశారు. లక్షలకోట్లు అప్పులు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల కోసం రూ.5 వేలకోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోతోందని ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన వైద్యవిద్య­ను ప్రైవేట్‌పరం చేయడం వెనుక మర్మమేమిటని నిలదీ­శారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు, సామాన్య ప్రజ­లు వైద్యానికి దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక డిమాండ్లు  
రాష్ట్రానికి సంబంధించి ఆయన పలు డిమాండ్లు చేశారు. అవి..  
» విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపేసి, దానికి ప్రత్యేక గ్రాంట్‌ కేటాయించాలి. 
»  విభజన హామీ అయిన కడప స్టీల్‌ప్లాంట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి. 
» కడప–బెంగళూరు రైల్వేలైన్‌ పనులను 100 శాతం కేంద్ర నిధులతో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. 
»  ఉపాధిహామీ పథకం స్థానంలో వచ్చిన వీబీజీ రామ్‌ పథకంలో రాష్ట్ర వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచడం వల్ల ఏపీ వంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి కూడా 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి. 
» రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఎగువ పెన్నార్‌ అనుమతులు రద్దయ్యాయి. కేంద్రం చొరవ తీసుకుని ఆ అనుమతులను పునరుద్ధరించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement