అప్పుల్లో ఏపీ టాప్‌ | Debt burden exceeds state tax revenue | Sakshi
Sakshi News home page

అప్పుల్లో ఏపీ టాప్‌

Feb 11 2026 5:08 AM | Updated on Feb 11 2026 5:08 AM

Debt burden exceeds state tax revenue

దేశంలోనే అత్యధికంగా బాబు సర్కారు రూ.3.27 లక్షల కోట్ల అప్పులు

తొమ్మిది నెలల్లోనే బడ్జెట్‌ అంచనాలకు మించి అప్పుల మోత

బడ్జెట్‌ అప్పులు రూ.85,269 కోట్లు

రాష్ట్ర పన్నుల రాబడికి మించి రుణభారం

అమ్మకం పన్నుల రాబడి రూ.622 కోట్లు తగ్గుదల

ఇతర పన్నులు, డ్యూటీల్లో రూ.1,583 కోట్లు కొరత

రూ.15,247 కోట్లు తగ్గిన కేంద్ర గ్రాంట్లు

రూ.60,048 కోట్లతో రెవెన్యూ లోటు రెట్టింపు

ఈ ఆర్ధిక ఏడాది తొలి తొమ్మిది నెలల బడ్జెట్‌ కీలక సూచికలను వెల్లడించిన ‘కాగ్‌’  

సాక్షి, అమరావతి: అంతులేని అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు నెల నెలా దిగజార్చేస్తున్నారు! రుణభారం, రెవెన్యూ లోటుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. 18 నెలల్లో రూ.3.27 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. ఈ ఆర్థి­క ఏడాది డిసెంబర్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అప్పులు దేశంలోనే అత్యధికంగా రూ.85,269 కోట్లుగా ఉన్న­ట్లు కాగ్‌ వెల్ల­డించింది. బిహార్‌ను మించిపోయి టీడీపీ కూటమి సర్కా­రు అప్పు­లు చేయడం గమనార్హం. ఈమేరకు ప్రస్తుత ఆర్థిక సంవ­త్స­రంలో డిసెంబర్‌ వరకు బడ్జెట్‌ కీలక సూచికలను కాగ్‌ విడుదల చేసింది. 

రెవెన్యూ లోటు రెట్టింపు.. 
ఆంధ్రప్రదేశ్‌ అప్పులు, రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్‌లో పేర్కొన్న అప్పులను ఇంకా మూడు నెలలు మిగిలి ఉండగానే దాటేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది మొత్తానికి బడ్జెట్‌ అంచనాల అప్పు రూ.79,952 కోట్లు కాగా ఇప్పటికే గీత దాటి రూ.85,269 కోట్లు అప్పులు చేసింది. ఇక రాష్ట్ర సొంత పన్నుల రాబడిని మించి అదనంగా రూ.10 వేల కోట్లకు పైగా అప్పులు చేయడం విస్మయం కలిగిస్తోంది. 

రాష్ట్ర సొంత పన్నుల రాబడి డిసెంబర్‌ నాటికి రూ.74,163 కోట్లు కాగా అప్పు ఏకంగా రూ.85,269 కోట్లకు ఎగబాకింది. మరోపక్క బడ్జెట్‌లో మొత్తం రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా పేర్కొనగా డిసెంబర్‌ నాటికే రెట్టింపు స్థాయిలో రూ.60,480 కోట్ల రెవెన్యూ లోటులోకి రాష్ట్రం వెళ్లిపోయిందని కాగ్‌ గణాంకాలు వెల్లడిస్తు­న్నా­యి. ఇంకోవైపు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రా­నికి నిధులు తగ్గిపోయాయి. 2023–24 డిసెంబర్‌తో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్‌ వరకు కేంద్ర గ్రాంట్ల రూపంలో నిధులు ఏకంగా రూ.15,247 కోట్లు తగ్గిపోవడం గమనార్హం.

సంక్షేమానికి తూట్లు..
చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి నెలా అమ్మకం పన్ను రాబడి తగ్గడమే గానీ పెరగడం లేదని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర పన్నులు, డ్యూటీ రూపంలో రావాల్సిన రాబడి కూడా తగ్గడమే గానీ వృద్ధి అనేదే లేదు. 2023–24 డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్‌ నాటికి ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రావాల్సిన రాబడి రూ.1,583 కోట్లు తగ్గిపోయింది. 

2023–24 ఆర్థిక ఏడాది డిసెంబర్‌ వరకు పోల్చితే.. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్‌ నాటికి అమ్మకం పన్ను రాబడి ఏకంగా రూ.6,22 కోట్లు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 22వ స్థాన­ం­లో నిలిచింది. చిట్ట చివరి నుంచి ఏపీ రెండో స్థానంలో ఉంది. అమ్మకం పన్ను రాబడి క్షీణించడం అంటే ప్రజల కొను­గోలు శక్తి పడిపోవడమేనని స్పష్టం అవుతోంది. ఇక 2023–­24 డిసెంబర్‌ వరకు పోల్చి చూస్తే సామాజిక రంగ వ్యయం 2025–26 డిసెంబర్‌ నాటికి రూ.5,874 కోట్లు తగ్గిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement