నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు | Assembly budget sessions from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

Feb 11 2026 5:01 AM | Updated on Feb 11 2026 5:05 AM

Assembly budget sessions from today

తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం 

14న బడ్జెట్‌ పెట్టే అవకాశం 

మార్చి 12 వరకూ సమావేశాలు

సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. వెలగపూడి­లోని అసెంబ్లీ హాలులో ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారు చేయనున్నారు. 

14న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మార్చి 12 వరకూ సమావేశాలు జరుగుతా­యని ఇప్పటికే స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొత్తం 19 పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలపనున్నారు.  

కార్యదర్శులతో స్పీకర్‌ సమావేశం 
బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు పంపాలని ఆదేశించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నెల రోజులైనా సమాధానాలు రాకపోవడం చూస్తున్నామని ఇకపై అలా జరగకుండా సకాలంలో సమాధానాలు పంపేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాల సమావేశాలను నేషనల్‌ ఈ–విధాన్‌ కింద డిజిటల్‌ విధానంలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు.  

మార్చి 5 నుంచి 7 వరకు క్రీడా పోటీలు 
అసెంబ్లీ సమావేశాల్లో ఆటవిడుపుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు, విప్‌లు, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో ఈ పోటీల నిర్వహణ సన్నద్ధతపై చర్చించారు. ఇందుకోసం శాసనసభ, శాసన మండలి చీఫ్‌ విప్‌లు, విప్‌లతో ఒక కమిటీ వేయాలన్నారు. క్రీడా పోటీలను మధ్యాహ్నం నుంచి జరపాలని, సాంస్కృతిక కార్యక్రమాలను చివరి రోజు సాయంత్రం జరపాలని సూచించారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement