శివభక్తులపై లాఠీచార్జ్‌ బాధాకరం: వైఎస్‌ జగన్‌ | YS Jagan expressed concern over Police Lathi Charge on Shiva Devotees | Sakshi
Sakshi News home page

శివభక్తులపై లాఠీచార్జ్‌ బాధాకరం: వైఎస్‌ జగన్‌

Feb 10 2026 8:58 PM | Updated on Feb 10 2026 9:31 PM

YS Jagan expressed concern over Police Lathi Charge on Shiva Devotees

సాక్షి,తాడేపల్లి: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివ స్వాములపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయ‌డంపై వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో,  శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయ‌డం బాధాక‌రం. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వ‌స్తున్నారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

చంద్రబాబు పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది.

జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ  ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.

దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు.

దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..

  • తిరుపతిలో జనవరి 8,  2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి

  • శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారు

  • శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న  కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే  ఉన్నాయి

  • జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను  వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది

భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement