పుతిన్‌తో భేటీకి ఎప్‌స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు.. | Jeffrey Epstein As Spy For Ties With Russia, New Documents Expose His Attempts To Meet Vladimir Putin And Russian Elites | Sakshi
Sakshi News home page

పుతిన్‌తో భేటీకి ఎప్‌స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు..

Feb 9 2026 1:49 PM | Updated on Feb 9 2026 2:06 PM

Jeffrey Epstein a spy for Russia New documents reveal

న్యూఢిల్లీ: అమెరికా గూఢచారిగా ముద్రపడిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కు సంబంధించి తాజాగా వెల్లడైన మరో విషయం చర్చనీయాంశంగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా పలువురు ఉన్నత స్థాయి రష్యా అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎప్‌స్టీన్ ప్రయత్నించినట్లు అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన తాజా పత్రాలు వెల్లడిస్తున్నాయి.

సీఎన్ఎన్ కథనం ప్రకారం ఎప్‌స్టీన్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి రష్యా రాయబారి విటాలీ చుర్కిన్‌తో తరచూ సమావేశమయ్యేవారు. చుర్కిన్ కుమారుడు మాగ్జిమ్‌కు న్యూయార్క్‌లోని ఒక వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించేందుకు కూడా ఎప్‌స్టీన్ ప్రతిపాదించినట్లు ఈ పత్రాల్లో వెల్లడయ్యింది. 2017లో రాయబారి విటాలీ చుర్కిన్ ఆకస్మిక మరణం తర్వాత, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో సంబంధాలు పెంచుకోవడానికి ఎప్‌స్టీన్ ప్రయత్నించారు. 2018 జూన్ 24న నోర్వే రాజకీయ నేత థోర్బ్‌జోర్న్ జగ్‌ల్యాండ్‌కు పంపిన ఈమెయిల్‌లో, ‘నాతో మాట్లాడటం ద్వారా పలు కీలక విషయాలు తెలుసుకోవచ్చని మీరు పుతిన్‌కు సూచించవచ్చు’ అని ఎప్‌స్టీన్ పేర్కొన్నారు.

రష్యాలో పాశ్చాత్య దేశాల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలను వివరించే నెపంతో పుతిన్‌ను కలవాలని ఎప్‌స్టీన్ భావించారు. 2013లో మాజీ ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్‌కు రాసిన ఈమెయిల్‌లో నార్వే నేత ఒకరు జగ్‌ల్యాండ్ సోచిలో పుతిన్‌ను కలవబోతున్నారని, ఆ సమయంలో తన గురించి ప్రస్తావించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. తాను బిల్ గేట్స్ లాంటి ప్రముఖులకు సలహాదారునని, పుతిన్‌తో కనీసం రెండు మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు ఎప్‌స్టీన్ విన్నవించారు. అయితే సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆర్థిక సదస్సులో పుతిన్ కోరిన భేటీని తానే తిరస్కరించానని ఎప్‌స్టీన్ చెప్పుకున్నప్పటికీ, దానికి సరైన ఆధారాలు లేవు.

ఎప్‌స్టీన్ వ్యవహారంపై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ స్పందించారు. ఈ లైంగిక వేధింపుల కుంభకోణాన్ని రష్యా నిఘా సంస్థలే వ్యవస్థీకృతం చేసి ఉండవచ్చనే అనుమానంతో తమ దేశం దర్యాప్తు చేపడుతుందని  ప్రకటించారు. ప్రపంచ దేశాల నేతలను బ్లాక్ మెయిల్ చేసేందుకు రష్యా వద్ద కీలక సమాచారం ఉండే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. ఎప్‌స్టీన్ రష్యా గూఢచారి అనే దానిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అటువంటి నిరాధారమైన విషయాలపై సమయం వృథా చేయవద్దని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ‘నో ఫోన్‌ ఛాలెంజ్’.. రెండు వారాల్లో అనూహ్య మార్పు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement