ఈ రోజుల్లో చిన్నారులకు చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ముద్ద దిగదు.. షార్ట్స్ చూడకపోతే నిద్రపట్టదు. అయితే కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన టీచర్ అమృత.. విద్యార్థులను ఈ డిజిటల్ సంకెళ్ల నుండి విడిపించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి కఠినమైన శిక్షలు లేకుండా కేవలం ‘రంగురంగుల స్టిక్కర్లు - చిన్నపాటి సవాళ్లతో’ ఆమె చేసిన ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం రెండు వారాల్లోనే పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని మాయం చేసిన ఆ ‘నో ఫోన్ ఛాలెంజ్’ కథలోనికి వెళితే..
కేరళలోని కన్నూర్ జిల్లా, కూతుపరంబ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం అద్భుత ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు పాఠాల కంటే మొబైల్ ఫోన్లలో రీల్స్, షార్ట్స్ , వీడియో గేమ్స్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని టీచర్ అమృత గమనించారు. పిల్లల ఏకాగ్రత లోపించడానికి మితిమీరిన మొబైల్ వాడకమే కారణమని నిర్ధారించుకున్న ఆమె, వారిని ఆ వ్యసనం నుండి దూరం చేసేందుకు ఒక ప్లాన్ వేశారు. కేవలం హెచ్చరించడమే కాకుండా, పిల్లల మనస్తత్వానికి తగినట్లుగా స్టిక్కర్లు, ఆటలు, చిన్నపాటి సవాళ్లతో వారిని ఆకట్టుకున్నారు.
పిల్లల్లో మొబైల్ వాడకాన్ని తగ్గించడం అంత సులభం కాదని అమృతకు తెలుసు. అందుకే ఆమె ‘నో ఫోన్ ఛాలెంజ్’ను ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని విద్యార్థులకు మరుసటి రోజు తరగతిలో రంగురంగుల స్టిక్కర్లను బహుమతిగా ఇచ్చేవారు. ఇది విద్యార్థుల్లో ఒక సానుకూల పోటీని పెంచింది. ఫోన్ చూడటం మానేసిన పిల్లలకు ప్రోత్సాహకంగా కథల పుస్తకాలు, మట్టి బొమ్మలు, నోట్‌బుక్‌లను బహుమతులుగా అందించారు. ఫోన్ వదిలేసిన తర్వాత ఖాళీగా ఉండే సమయంలో వారు సృజనాత్మకంగా ఆలోచించేలా మట్టితో బొమ్మలు చేయడం, చిత్రలేఖనం లాంటి యాక్టివిటీస్ వారికి అలవడేలా చేశారు.
ఈ వినూత్న ప్రయోగం మొదలైన రెండు వారాల్లోనే పిల్లల్లో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడమే కాకుండా, వారి ప్రవర్తనలో కూడా ప్రశాంతత చోటుచేసుకుంది. గతంలో చిన్న విషయాలకే గొడవ పడే పిల్లలు, ఇప్పుడు సహనంతో వ్యవహరిస్తున్నారని టీచర్ అమృత తెలిపారు. మొబైల్ ఫోన్ లాక్కుంటే ఇంట్లో ఏడ్చి గొడవ చేసే పిల్లలు, ఇప్పుడు పెయింటింగ్ వేస్తూ, ఆ చిత్రాలను టీచర్‌కు చూపించడానికి ఉత్సాహపడుతున్నారని తల్లిదండ్రులు ఆనందంగా చెబుతున్నారు.
పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల స్క్రీన్ టైమ్ తగ్గించే దిశగా విద్యాశాఖ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఇటీవల విడుదలైన ఎకనామిక్ సర్వే నివేదికలో డిజిటల్ వ్యసనం వల్ల యువతలో ఆందోళన, కుంగుబాటు, ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడయ్యింది. ఫోన్లకు బానిసలవుతున్న నేటి తరాన్ని ఈ వ్యసనం నుంచి తప్పించేందుకు.. అమృత టీచర్ అనుసరించిన సృజనాత్మక పద్ధతులు అనుసరించాల్సిన అవసరముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు


