ఫిట్స్ వ‌స్తే.. ఏం చేయాలి? | International Epilepsy Day 2026: Epilepsy Symptoms causes treatment | Sakshi
Sakshi News home page

ఫిట్స్‌ వచ్చినప్పుడు.. ఇలా చేయండి

Feb 9 2026 1:06 PM | Updated on Feb 9 2026 2:11 PM

International Epilepsy Day 2026: Epilepsy Symptoms causes treatment

ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధిని చాలా సాధారణ సమస్యగా పరిగణించాలి. చికిత్సతో పూర్తిగా తగ్గే సమస్య ఇది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. నేడు (ఫిబ్ర‌వ‌రి 9) ఎపిలెప్సీ డే (International Epilepsy Day) సందర్భంగా ఫిట్స్‌పై అవగాహన కోసమే ఈ కథనం.  

90 శాతంలో పూర్తి తగ్గుదల 
10 శాతంలోనే మాటిమాటికీ... 
తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయిస్తారు. దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలో... అంటే మరో 10 శాతం బాధితులకు రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి రావచ్చు. దాదాపు 70 శాతం మంది బాధితులు రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇక ఆపేయవచ్చనే నిర్ణయానికి వస్తారు. కానీ మరో 10 శాతం మందికి నాలుగు రకాల మందులు వాడినా కూడా ఫిట్స్‌ పదే పదే వస్తుండవచ్చు.

6.5 కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఫిట్స్‌తో బాధపడుతుండగా మనదేశంలో దాదాపు కోటి నుంచి 1.2 కోట్ల మంది బాధితులున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 50 లక్షల మంది కొత్త పేషెంట్స్‌ ఈ  జాబితాలో చేరుతున్నారు.  

26 మందిలో ఒకరికి... 
చూడ్డానికి ఎంతో భయంకరంగా, ఆందోళన గొలిపేలా ఉండే లక్షణాలూ, అపోహల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రతి 26 మందిలో ఒకరికి ఫిట్స్‌ కనిపిస్తున్నాయి. ఇందులో 80% అల్పాదాయ, మధ్యతరగతివారే. ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. అంటువ్యాధి కానే కాదు. చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోయే నిరపాయకరమైన వ్యాధి. అనేక అపోహల కారణంగా దేశంలోని 50% పైగా బాధితులు ఇంకా చికిత్సకు దూరంగా ఉన్నారు.

70% మందిలో.. 
ఫిట్స్‌ / ఎపిలెప్సీ వచ్చినవాళ్లలో దాదాపు 70 శాతం మందిలో కారణాలు తెలియవు. మిగతా 30 శాతం మందిలో ఏవైనా నిర్దిష్టమైన కారణాలతో ఫిట్స్‌ వస్తుంటాయి. ఉదాహరణకు... కొందరిలో వంశపారంపర్యంగా, తలకు దెబ్బతగలడం, పక్షవాతం, మెదడులో గడ్డలుగానీ లేదా  ఇన్ఫెక్షన్‌గానీ రావడం వల్ల అలాగే మరికొందరిలో పక్షవాతం (స్ట్రోక్‌) కారణంగా రావచ్చు.

ప్రస్తుతం ఫిట్స్‌ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు బాధితుల బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయిస్తారు. ఫిట్స్‌ మళ్లీ మాటిమాటికీ రాకుండా ఉండాలంటే పూర్తి కోర్సు వాడాల్సిందే.

మరికొన్ని మార్గాలు 
ఫిట్స్‌ తగ్గించేందుకు కొన్ని మార్గాలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో... శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ఫిట్స్‌ ఆవిర్భావ కేంద్రాన్ని గుర్తించినట్లయితే... దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని, శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇక డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ ప్రక్రియ మరొకటి. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్‌ డైట్‌) ఇవ్వడం ద్వారా ఫిట్స్‌ను అదుపు చేయవచ్చ. మరికొందరిలో ‘వేగస్‌ నర్వ్‌’ అనే నరాన్ని స్టిమ్యులేట్‌ చేయడం ద్వారా కూడా ఫిట్స్‌ను అదుపుచేయవచ్చు.

ఫిట్స్‌ వచ్చినప్పుడు... 
ఫిట్స్‌ వచ్చినవారికి తాళం చేతులు అందించడం, ఏదైనా లోహపు వస్తువును చేతిలో పెట్టడం చేస్తుంటారు. వాస్తవానికి ఇవేవీ చేయకూడదు. ఫిట్స్‌రాగానే ఆ వ్యక్తిని.. 
∙సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువగా కదిలించకూడదు. 
∙నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. 
∙ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. 
∙కాళ్లూ, చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. 
సాధారణంగా ఫిట్స్‌ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో అతడు తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్‌ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.

చ‌ద‌వండి: అవాంఛిత రోమాలకు ప‌రిష్కారం

చివరగా... ఎపిలెప్సీ అనేది ఉన్నతికి ఏమాత్రం ప్రతిబంధకం కాదు.
మహిళల్లో ఎపిలెప్సీ వచ్చినా అది సాధారణ జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదు. అందరిలానే వీళ్లూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement