మొబైల్‌ చాయ్‌.. ఉపాధికి హాయ్‌.. | inspiration Story On Laxman Tea Shop | Sakshi
Sakshi News home page

మొబైల్‌ చాయ్‌.. ఉపాధికి హాయ్‌..

Feb 9 2026 11:34 AM | Updated on Feb 9 2026 11:48 AM

inspiration Story On Laxman Tea Shop

మొబైల్‌ వ్యాపారానికి నాందిపలికిన లక్ష్మణ్‌ 

అదే స్ఫూర్తితో మరికొందరికి ఉపాధి కల్పస్తూ

ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు.. నిజ జీవితంలో విజయాలకు పునాది వేసిన ఆనవాళ్లు అనేకం.. ఒక వినూత్న ఆలోచనతో, తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు.. అలాంటి వారిలో ఒకరు సనత్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్‌. 30 ఏళ్ల క్రితమే మొబైల్‌ వ్యాపార కాన్సెప్‌్టకు అంకురార్పణ చేశారు. ప్రస్తుతం అనేక మంది ఈ రంగంలో ఉపాధి పొందుతోన్న విషయం తెలిసిందే..   

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటకు చెందిన బచ్చల లక్ష్మణ్‌ బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. మొదట రిక్షా తొక్కుకుంటూ జీవనం ప్రారంభించాడు. గిట్టుబాటు లేకపోవడంతో సాయంత్రానికి నిరాశా నిస్పృహలే మిగిలేవి. అప్పుడే.. టీ కోసం అనేకమంది దూరం వెళ్లడాన్ని గమనించాడు. రిక్షానే మొబైల్‌ టీ స్టాల్‌గా మారిస్తే.. అన్న ఆలోచన తట్టింది. అకున్నదే తడవు ఆచరణలో పెట్టాడు. 1996లో ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట ప్రాంతంలో రిక్షాలో మొబైల్‌ టీ స్టాల్‌ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎక్కడ పది మంది గుమికూడితే అక్కడ టీ అందిస్తూ జీవన ప్రయాణాన్ని సాగించారు. సంవత్సరం తిరక్కముందే రిక్షా నుంచి మూడు చక్రాల బైక్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యాడు.  

ఒకటిగా ప్రారంభమై.. 
అలా ఒక్క మొబైల్‌ టీ స్టాల్‌ కాస్తా.. ప్రస్తుతం 22 మొబైల్‌ టీ స్టాల్స్‌ను స్వయంగా తీర్చిదిద్ది ఉపాధి కోసం వెతుక్కునే వారికి అండగా నిలుస్తున్నాడు. లక్ష్మణ్‌ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న మొబైల్‌ టీ పరిమళం ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట దాటుకుని నగరం అంతటా వ్యాపించింది. తెల్లవారుజామున 4 గంటలకే అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద దిగే ప్రయాణికులకు అల్లం, గ్రీన్, లెమన్, బూస్ట్, హార్లిక్స్, కాఫీ, టీ కాషన్‌.. ఇలా అనేక రకాల తేనీటిని అందిస్తుంటాడు.

రూపాయి నుంచి.. 
‘అప్పట్లో అమీర్‌పేట కేంద్రంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థల కార్యకలాపాలు కొనసాగేవి. ఇద్దరు సహాయకులతో నడిపేవాడిని.. వారికి రోజుకు రూ.50లు ఇచ్చేవాణ్ణి. ప్రారంభంలో రూపాయికే టీ.. అలా రోజుకు 700–800 టీలు విక్రయించేవాణ్ణి. దీనిమీదే ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేశా. సొంతిల్లు కొనుక్కున్నా. నాకులా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 22 మందికి మొబైల్‌ టీ స్టాల్స్‌ ఇస్తున్నా. ఇంతగా విస్తృతమవుతుందని అప్పుడు అనుకోలేదు’ అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement