మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన వైనం
ఈ దృశ్యాలను రికార్డ్ చేసి బాధితురాలికి మరో అధ్యాపకుడి వేధింపులు
జాతీయ సంస్కృత వర్సిటీ అధికారులకు విద్యార్థిని ఫిర్యాదు
అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్.. మరో అధ్యాపకుడిపై కొనసాగుతున్న విచారణ
తిరుపతి సిటీ: విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్‌లో రికార్డు చేశాడు.
అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
దీంతో సదరు విద్యార్థినికి వర్సిటీ అధికారులు టీసీ ఇచ్చేసి డాక్టర్ లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తోన్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై వర్సిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


